సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠ్యాంశాల బోధనకు అధికారులు మంగళం పాడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా నిపుణులతో రూపొందించిన సిలబస్‌ను, పాఠ్యప్రణాళికను అనుసరించాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అమలు చేయించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ స్కూళ్లలోనే ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు స్వస్తి పలుకుతున్నారు. పలు జిల్లాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రైవేటు సంస్థల పాఠ్యాంశాల బోధనను గత కొంతకాలంగా కొనసాగిస్తుండడమే దీనికి నిదర్శనం. ఆనందలహరి, ఈషా ఫౌండేషన్ తదితర సంస్థలకు ఈ బోధన ప్రక్రియను ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఆయా సంస్థలకు ఏటా కోట్లాది రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆయా పాఠశాలల టీచర్లు తప్పనిసరిగా ఆయా సంస్థలు చెప్పినట్లు వినాలని, వారి శిక్షణ కార్యక్రమాలకు హాజరై వారి పద్ధతుల్లోనే బోధన సాగించాలని, వారి సిలబస్‌నే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేస్తుండడం గమనార్హం.
‘అల’కు ఈ ఏడాది మరో 1,450 స్కూళ్లు అప్పగింత
టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే చిత్తూరు జిల్లాలోని రిషివ్యాలీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థకు ‘ఆనందలహరి’ పేరిట ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ సంస్థకు ముందుగా చిత్తూరు జిల్లాలోని కొన్ని స్కూళ్లు మాత్రమే అప్పగించారు. తర్వాత మరికొన్ని జిల్లాల్లోని స్కూళ్లను కూడా దీని పరిధిలో చేర్చారు. గతేడాది నాటికి ఆ సంస్థకు 1,700 స్కూళ్లు, ఈ ఏడాది మరో 1,450 స్కూళ్లను అప్పగించారు. ముందుగా 1, 2 తరగతుల్లోని విద్యార్థులకు మాత్రమే ఈ సంస్థ బోధన సాగించేది. ఇప్పుడు 3, 4, 5 తరగతుల్లో కూడా ఈ సంస్థ విధానాలనే పాటించాలని ఆయా జిల్లాల అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఈ సంస్థ కేవలం తన బోధన పద్ధతులను ప్రభుత్వ టీచర్లకు నేర్పించి బోధన సాగించేలా చేస్తోంది. దీనికోసం ఇప్పటివరకు ఈ సంస్థకు రూ.50 కోట్ల వరకు చెల్లించడం గమనార్హం. ఎస్‌సీఈఆర్‌టీ పాఠ్య ప్రణాళికను అటకెక్కించి ఈ సంస్థ తన సొంత సిలబస్‌ను, పాఠ్యప్రణాళికను అమలు చేయిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్లు ఈ సంస్థ ఇచ్చే శిక్షణకు హాజరుకావడంతోపాటు సంస్థ సిబ్బంది చెప్పే పనులు చేయాల్సి వస్తోంది. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
చిత్తూరు జిల్లా మొత్తం ఈషా ఫౌండేషన్‌కు అప్పగింత
కాగా, ఈషా ఫౌండేషన్‌కు ఇంతకుముందు సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోని స్కూళ్లను మాత్రమే అప్పగించారు. తాజాగా ఆ జిల్లాలోని రిషివ్యాలీ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చిన స్కూళ్లు మినహా మొత్తం అన్ని స్కూళ్లనూ ఈషా ఫౌండేషన్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జిల్లా ప్రభుత్వ టీచర్లపై ఈ సంస్థ సిబ్బంది పెత్తనం పెరిగిపోయింది. ఈ సంస్థకు కూడా ప్రభుత్వ సొమ్మును వందల కోట్లలో ముట్టచెబుతున్నారు. ఈ సంస్థ చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కావడంతో సంస్థ ప్రతినిధులు అధికారుల మాటలు కూడా లెక్కచేయడం లేదు. వారు అడిగిన మేరకు నిధులు మంజూరు చేయడం ఒక్కటే తమ పని అని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి.
డ్యాన్సుల పేరిట కోట్లు దోపిడీ
కాగా, ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ ద్వారా డ్యాన్సులు నేర్పేందుకు గతేడాది టిపా, సిలాజిస్ట్ అనే సంస్థలకు విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ జిల్లాలోని కొన్ని స్కూళ్లలో కంప్యూటర్ ద్వారా డ్యాన్సులు నేర్చుకునేందుకు విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు ఈ సంస్థలు సమకూరుస్తాయి. వాస్తవానికి ఈ సంస్థలకు డ్యాన్సులు నేర్పించేందుకు ఎలాంటి నిపుణులు లేరు. కేవలం కంప్యూటర్ సీడీల్లో కొన్ని కార్యక్రమాలను అప్‌లోడ్ చేయించి వాటిని స్కూళ్లలోని పిల్లలకు నేర్పించడం చేస్తుంటారని, దీనికోసం ఏకంగా ఈ సంస్థలకు రూ.5 కోట్లు చెల్లించారని విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర మంత్రికి బంధువులు కావడంతో విద్యా శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈ ఏడాది మరో మూడు జిల్లాల్లో డ్యాన్సులు నేర్పడానికి సదరు సంస్థ ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖకు అందించింది. దీనికి రూ.40 కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ సంస్థ డ్యాన్సులు నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనం ఎంతో మెరుగుపడిందని అధికారులు తప్పుడు నివేదికలను సిద్ధం చేయిస్తున్నారని పేర్కొంటున్నారు. గతేడాది పరీక్షల్లో ఆయా స్కూళ్లలో విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణులవ్వడానికి కారణం ఈ కంప్యూటర్ డ్యాన్సులేనని నివేదికలు రూపొందించి, వాటి ఆధారంగా మరో మూడు జిల్లాల్లో కార్యక్రమాల అమలుకు అనుమతులు ఇచ్చేలా సదరు మంత్రి అధికారుల ద్వారా వ్యవహారాన్ని నడిపిస్తున్నారని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment