చదువు‘కొనాలి’ | heavy school fee in private schools | Sakshi
Sakshi News home page

చదువు‘కొనాలి’

Published Fri, May 29 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

చదువు‘కొనాలి’

చదువు‘కొనాలి’

ప్రైవేటు ‘సీటు’.. భారీ రేటు
పిల్లలను బడిలో చేర్పించుకునేందుకు ఇళ్లిళ్లూ తిరుగుతున్న  ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు
టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ పేర్లు తీసేసినా భారీగా ఫీజులు
కనీస విద్యార్హత లేని టీచర్లతో బోధన
చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు
వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్న ప్రైవేటు పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను రప్పించడం ఈ ఏడాది కత్తిమీద సామే

 
 (సాక్షిప్రతినిధి, అనంతపురం) : ఎండలు ఎంత మండుతున్నాయో...ప్రైవేటు స్కూళ్లలో ఫీజులూ అంతకు రెట్టింపు స్థాయిలో మండుతున్నాయి. టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్, స్మార్ట్ లాంటి పేర్లను రెండేళ్ల కిందట తొలగించినా ఫీజుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. భారీగా ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. మరో వారం రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో వాటి యాజమాన్యాలు పిల్లల కోసం వీధివీధి, ఇళ్లిళ్లూ తిరుగుతున్నాయి. అధికారులు ఏమాత్రం ఏమరపాటు వహించినా పిల్లలు లేరనే సాకుతో సర్కారుబళ్లు మరోసారి  మూతపడే ప్రమాదముంది.

 ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇటు ప్రైవేటు పాఠశాలలు, అటు ప్రభుత్వ పాఠశాలలకు కత్తిమీద సాముగా మారింది. మరో వారంలో ప్రైవేటు పాఠశాలలు.. ఆపై వారానికి  సర్కారు పాఠశాలలు  పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు స్కూళ్లు అడ్మిషన్లపై దృష్టి సారించాయి. వాటిలోని టీచర్లు గ్రూపులుగా ఏర్పడి.. రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ చుట్టేస్తున్నారు. తమ పాఠశాలలోని ప్రత్యేకతలను గొప్పగా చెప్పుకుంటున్నారు. మాటల్లో చెప్పినంత గొప్పగా పాఠశాలలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటికొచ్చిన టీచర్లను ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ వారు విద్యార్థులను రప్పించడమే ధ్యేయంగా ప్రయత్నిస్తున్నారు.

ఒక్కో టీచరు కనీసం పదిమంది విద్యార్థులనైనా చేర్పించాలని యాజ మాన్యాలు హుకుం జారీ చేయడం, ఎక్కువ మందిని చేర్పిస్తే మంచి వేతనాలు ఇస్తామని హామీలు ఇవ్వడంతో గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఇంటింటికీ వచ్చి పిల్లలను ఎగరేసుకుపోవడం, ప్రైవేటు వేగాన్ని ప్రభుత్వాధికారులు అందుకోకపోవడంతో ఏటేటా సర్కారు స్కూళ్లలో పిల్లల సంఖ్య క్షీణిస్తోంది. పిల్లలు తక్కువగా ఉన్నారనే సాకుతో ఇప్పటికే దాదాపు 179 పాఠశాలలను జిల్లాలో మూసేశారు. ఈక్రమంలో పిల్లల సంఖ్యను అధికారులు పెంచకపోతే మరిన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదముంది.

 భారీగా ఫీజులు
 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. జిల్లాలో ఇది చాలా స్కూళ్లలో అమలు కావడం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. విద్యాబోధనతో పాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిషు, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్, ఇతర టాలెంట్ టెస్టులను నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజుల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు.

పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, టై లాంటివి విక్రయిస్తున్నారు. వీటి ధరలను యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా తమ వద్దనే తీసుకోవాలంటూ నిబంధన  విధిస్తున్నారు. ఫీజులతో పాటు వీటి భారం కూడా తల్లిదండ్రులపై పడుతోంది. ఎల్‌కేజీ విద్యార్థికే ఏడాదికి రూ.25వేల దాకా ఖర్చవుతోంది. 5-10 తరగతులకైతే స్కూళ్లను బట్టి రూ.30-70 వేలు ఖర్చవుతోంది.

 నిబంధనలకు విరుద్ధం
 విద్యాహక్కు చట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షను నిర్వహించకూడదు. కానీ చాలా స్కూళ్లు ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. దీనివల్ల సీటు రాని విద్యార్థులు చిన్న వయసులోనే మానసికంగా కుంగిపోయి.. చదువుపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు.

 విద్యాహక్కు చట్టం ఏం చెబుతోందంటే..
►ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు.
►విద్యార్థులను అడ్మిషన్ చేసుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు.
►అర్హత కల్గిన ఉపాధ్యాయులతోనే విద్యాబోధన చేయాలి.
►అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, 60వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
►ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి కచ్చితంగా పాటించాలి.
►ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement