సర్కారీ స్కూల్‌ 'ఫుల్‌'.. సీట్ల కోసం తల్లిదండ్రుల క్యూ | Andhra Pradesh Government Schools Filled With Huge Students Joinings | Sakshi
Sakshi News home page

సర్కారీ స్కూల్‌ 'ఫుల్‌'.. సీట్ల కోసం తల్లిదండ్రుల క్యూ

Published Thu, Aug 19 2021 2:36 AM | Last Updated on Thu, Aug 19 2021 10:09 AM

Andhra Pradesh Government Schools Filled With Huge Students Joinings - Sakshi

నెల్లూరులోని కేఎన్‌ఆర్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం వేచి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

సాక్షి, అమరావతి: ‘తల్లిదండ్రులకు విన్నపం.. మా స్కూలులో సీట్లు లేవు. దయచేసి రికమెండేషన్లు చేయించకండి. మేము సామాన్యులం. సహకరించండి.’ ఇది ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఆంధ​ప్రదేశ్‌లోని అనేక ప్రభుత్వ స్కూళ్లలో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు వెల్లువెత్తుతున్నాయనేందుకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నెన్నో. రెండేళ్ల క్రితం వరకు ఉన్న పరిస్థితిని ఇప్పటి పాఠశాలల్లోని పరిస్థితిని గమనిస్తే ఏ అంశంలో చూసుకున్నా పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపట్టిన కార్యక్రమాలు రెండేళ్లలోనే అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు రాష్టంలో చదువుల లోగిళ్లు కునారిల్లుతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆనందం వెల్లివిరుస్తోంది. చదువులు భారమై విద్యార్థులు స్కూళ్లకు దూరమైన స్థితి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చదువుకోవాలన్న ఆరాటం కనిపిస్తోంది. 

అప్పట్లో డ్రాపవుట్లు.. ఇప్పుడు వెల్లువలా చేరికలు 
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను క్రమేణా నిర్వీర్యం చేసింది. పలు చోట్ల ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. ఉన్న స్కూళ్లలో సరైన వసతులు, సిబ్బంది లేక తల్లిదండ్రులు పిల్లలను ఆ బడులకు పంపడం మానేశారు. అదే సమయంలో స్తోమత ఉన్న వారు ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివించుకోగా, ఇతరుల పిల్లలు బడులు మానేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు పరిశీలిస్తే ఈ అంశం స్పష్టంగా తెలుస్తోంది. 
సీట్లు లేవంటూ స్కూల్‌ ముందు ఏర్పాటు చేసిన బ్యానర్‌ 

పరిస్థితి తారుమారు
రాష్ట్రంలో 2018–19లో ప్రభుత్వ స్కూళ్లు 72.11 శాతం ఉండగా, విద్యార్థుల శాతం 52.83 శాతంగా ఉంది. అదే ప్రైవేటు పాఠశాలలు 23.59 శాతమే ఉన్నా, విద్యార్థులు 43.79 శాతంగా ఉన్నారు. 2020–21 విద్యా సంవత్సరానికి విద్యార్థుల శాతం పరిస్థితి తారుమారయ్యింది. ప్రభుత్వ పరిధిలోని 72.28 శాతం స్కూళ్లలో 59.46 శాతం మంది విద్యార్థులుండగా, 23.73 శాతమున్న ప్రయివేటు పాఠశాలల్లో 37.77 శాతానికి చేరికలు పడిపోయాయి.


రాష్టంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 2014–15 విద్యా సంవత్సరంలో 72,32,771 మంది విద్యార్థులు ఉండగా, ఆ మరుసటి ఏడాది ఆ సంఖ్య 69,07,004కు తగ్గిపోయింది. అంటే 3,25,767 మంది విద్యార్థులు పూర్తిగా చదువులు మానేసి డ్రాపవుట్లుగా మారారు. ఆ తర్వాత 2018–19 నుంచి క్రమేణా పెరుగుదల ప్రారంభమై 2020–21 నాటికి రాష్ట్రంలో విద్యార్థుల చేరికలు 73,05,533కు పెరిగాయి. అంటే 2018–19 కన్నా 2,62,462 మంది అదనంగా చేరారు. 

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రం మొత్తమ్మీద విద్యార్థుల చేరికలు తగ్గిపోగా, ప్రభుత్వ స్కూళ్లలో ఆ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లను అప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేసి లక్షల్లో పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటులోకి వలస వెళ్లేలా చేసింది. 2014–15లో 41,83,441 మంది విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లలో ఉండగా, 2018–19 నాటికి ఆ సంఖ్య 37,20,988కు పడిపోయింది. ఏకంగా 4.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల నుంచి మానేశారు. వీరిలో అత్యధికం శాతం మంది ప్రైవేటు స్కూళ్లలో చేరగా, తక్కిన వారు పూర్తిగా చదువులకు దూరమయ్యారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మళ్లీ మారింది. 2020–21 నాటికి 43,43,844కు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలకు నాడు–నేడుతో పాటు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి అనేక కార్యక్రమాలు కారణమయ్యాయి. 2020–21లో ఒక్కసారిగా ప్రయివేటు స్కూళ్లలో చేరికల శాతం 14.10 శాతానికి పడిపోగా, ప్రభుత్వ స్కూళ్లలో ఏకంగా ఈ రెండేళ్లలో 6,22,856 మంది అదనంగా చేరడం విశేషం. ప్రభుత్వ స్కూళ్లలో ఇలా చేరిన వారిలో 60 శాతం మంది నాడు–నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన స్కూళ్లలో చేరారంటే ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి పథకాలు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో స్పష్టమవుతోంది.
 
ప్రభుత్వ పథకాలతో సర్కారు బడి వైపు పరుగులు
ప్రభుత్వం గత రెండేళ్లలో వివిధ విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఛిన్నాభిన్నమవ్వడంతోపాటు ప్రైవేటు చదువులు భారంగా మారిన తరుణంలో వారంతా ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్నారు.

ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద రూ.16 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో 10 రకాల సదుపాయాలు సమకూరుస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడత రూ.3,669 కోట్లతో 15,715 స్కూళ్లను తీర్చిదిద్దారు.

ఈ స్కూళ్లలో చేరికలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది మరింత మంది చేరడానికి వస్తుండడంతో వసతి చాలని స్థితి ఏర్పడుతోంది. మరోపక్క ప్రభుత్వం అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం, జగనన్న విద్యాకానుక కింద 3 జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్కు బుక్కులు, షూ, సాక్సులు, బెల్టు, బ్యాగుతో పాటు ఇంగ్లిష్‌– తెలుగు నిఘంటువును అందిస్తున్న విషయం తెలిసిందే. జగనన్న గోరుముద్ద కింద రుచి కరమైన, శుభ్రమైన భోజనాన్ని కూడా అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement