అనకాపల్లి: టీడీపీ జెండా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని పలువురు ఆశావహులు పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యరి్థగా ప్రచారం అవుతున్న అనితకు మద్దతు ఇచ్చి మళ్లీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడలేమంటూ వారు శనివారం పాయకరావుపేటలో జరిగిన సమావేశంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నుంచి జన సమీకరణ చేసి, బలప్రదర్శన చేశారు.
కేవలం పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించాలన్న ప్రధాన ఎజెండాతోనే ఈ సమావేశం నిర్వహించారు. జనసేననుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మి శివకుమారి, బోడపాటి శివదత్, పెద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటివరకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ఇకనైనా నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయించాలని కోరారు. పార్టీరాష్ట్రకార్యదర్శి, సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచి, తర్వాత జనసేన నాయకులు, కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని తెలిపారు. పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో పాయకరావుపేట టికెట్ టీడీపీకే ఇవ్వదలిస్తే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు.
అనితకు టికెట్ ఇస్తే మాత్రం కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తెలిపారు. జనసేన కార్యకర్తల అభ్యర్థనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హమీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాయకరావుపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీకుమారి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను పర్యటిస్తున్నారు. గ్రామాల్లో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలోను జనసేన నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment