గప్‌చుప్‌గా ఏడడుగులు
కొందరు హీరోయిన్లు పెళ్లిళ్లను ఆడంబరంగా చేసుకుంటే మరికొందరు నిరాడంబరంగా, మరీ కొందరు రహస్యంగా చేసుకుంటుంటారు. నటి అనిత ఈ మూడు విధానాలను అనుసరించకుండా గప్‌చుప్‌గా కార్యం ముగించేసుకోవడం విశేషం. తెలుగులో నువ్వు నేను వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళంలో మయూరమ్ చిత్రంతో తెరపైకొచ్చింది. వరుషమెల్లా వసంతం, శుక్రన్, నాయగన్ (కమల్ చిత్రం కాదు) మహరాజా తదితర చిత్రాల్లో నటించిన అనిత గోవాకు చెందిన రోహిత్ అనే బ్యాంకు అధికారి ప్రేమలో పడింది. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ గోవాలో వివాహం చేసుకున్నారు.
ఈ వివాహానికి చిత్ర ప్రముఖులు ఎవ్వరినీ ఆహ్వానించలేదు. అనితతో సన్నిహితంగా ఉండేవాళ్లకు కూడా ఆమె పెళ్లి సమాచారం లేదట. దీంతో వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంత అత్యంత గోప్యంగా వివాహం చేసుకోవడానికి కారణమేమిటమ్మా అన్న ప్రశ్నకు అనిత బదులిస్తూ వివాహమనేది తన సొంత విషయం అంది. దాన్ని ఊరంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలియచేశానని చెప్పింది. అదే విధంగా నటనకు స్వస్తి చెప్పే విషయం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అనిత అంది.