
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు రెజ్లర్ల ఆరోపణలు, నిరసనలతో తరచూ వార్తల్లోకెక్కిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఇప్పుడు ఎన్నికల హడావిడిలో ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ రెజ్లర్ అనిత షెరాన్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయగా, వివాదాస్పద డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ తన వీర విధేయుడు సంజయ్ కుమార్ సింగ్‌ను బరిలో దించాడు.
నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధ్యక్ష పోటీ ఇప్పుడు మాజీ రెజ్లర్ అనిత, బ్రిజ్‌భూషణ్ నమ్మిన బంటు సంజయ్‌ల మధ్యే నెలకొంది. నిరసన దీక్షలో పాల్గొన్న రెజ్లర్లకు వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన 38 ఏళ్ల అనితకు రెజ్లర్ల మద్దతు ఉంది. ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల 12న ఓటింగ్, అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి.