మున్సిపల్ పీఠాలు టీడీపీకి
- నర్సీపట్నం చైర్‌పర్సన్‌గా అనిత
- యలమంచిలికి రమాకుమారి
- ప్రమాణ స్వీకారం చేయించిన ప్రిసైడింగ్ అధికారులు
యలమంచిలి/నర్సీపట్నం టౌన్ : రూరల్ జిల్లాలోని యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులు తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను వరించాయి. రెండింటా ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీతో నర్సీపట్నంలో చైర్‌పర్సన్‌గా చింతకాయల అనిత, వైస్‌చైర్మన్‌గా చింతకాయల సన్యాసిపాత్రుడు, యలమంచిలిలో చైర్‌పర్సన్‌గా పిళ్లా రమాకుమారి, వైస్‌చైర్మన్‌గా కొఠారు సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు చైర్‌పర్సన్లూ గతంలో సర్పంచ్‌లుగా పనిచేసినవారే. గురువారం ఉదయం 11 గంటలకు రెండు మున్సిపాలిటీల్లో ఈ ఎన్నిక జరిగింది.
నర్సీపట్నంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సమక్షంలో ఆర్డీవో కె.సూర్యారావు, మున్సిపల్ కమిషనర్ పి.సింహాచలం ఈ ఎన్నిక నిర్వహించా రు. ఈ మున్సిపాలిటీలోని 27 వార్డులకు టీడీపీ 19, వైఎస్‌ఆర్‌సీపీ 6, కాంగ్రెస్, సీపీఐ చెరొకటి గెలుచుకున్నాయి. వైఎస్సార్‌సీపీ 6గురు సభ్యులు, ఒక కాంగ్రెస్ సభ్యుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎన్నికయిన వార్డు సభ్యులతో తొలుత ప్రిసైండింగ్ అధికారులు ప్రమాణం చేయించారు.
అనంతరం వారిని అభినందించారు. యల మంచిలిలో 24 వార్డులకు టీడీపీకి 21, వైఎస్‌ఆర్‌సీపీ మూడు దక్కాయి. ఇక్కడి గుర్రప్ప కల్యాణమండపంలో అనకాపల్లి ఆర్‌డీవో వసంతరాయుడు వార్డు మెంబర్లతో ప్రమాణస్వీకారం చేయించా రు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. పిళ్లా రమాకుమారి చైర్‌పర్సన్‌గా, కొఠారు సాంబశివరావు వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వారి చే ఆర్డీవో ప్రయాణ స్వీకరించారు.
ఈసందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ మున్సిపాలిటీలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిసారిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనువాసరావు, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యన్నారాయణమూర్తి, వంగలపూడి అనిత, పీలా గోవింద గణబాబు, విశాఖడెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, లాలం భాస్కరరావు, సుందరపు విజయ్‌కుమార్, గొంతిన నాగేశ్వరరావులు హాజరయ్యారు.