పిల్లలే జీవితం అవ్వాలి... | Children need life ... | Sakshi
Sakshi News home page

పిల్లలే జీవితం అవ్వాలి...

Published Sun, Sep 15 2013 11:53 PM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

పిల్లలే జీవితం అవ్వాలి...

పిల్లలే జీవితం అవ్వాలి...

మూడో ఏట... డ్రాయింగ్
 ఐదో ఏట... భరతనాట్యం.
 ఆరో ఏట... కర్ణాటక సంగీతం.
 ఏడో తరగతిలో... ఎన్.సి.సి.,
 అలాగే యోగా! ఇంకోటి... ఇంకోటి...
 టెన్త్‌కి వచ్చేసరికి మనోజ్ఞ చుట్టూ...
 కుప్పలు తెప్పలుగా కప్పులు, మెప్పులు!
 ఇప్పుడా అమ్మాయి...
 మెడిసిన్ చదువుతోంది.
 చదువు దారి చదువుదే.
 అవార్డుల దారి అవార్డులదే!
 ‘యు హ్యావ్ గివెన్ ఎ వండర్‌ఫుల్ చైల్డ్ టు ది నేషన్’.
 మనోజ్ఞ తల్లికి భారత ప్రధాని ప్రశంస.
 ఎలా సాధ్యం... ఇంతలా తీర్చిదిద్దడం?!
 సాధ్యమే అంటున్నారు అనిత.
 లాలపోసే వయసు నుంచీ బిడ్డ ఐక్యూకి
 సానబెడుతూ వస్తున్న ఆ తల్లి అనుభవాలే
 ఈవారం మన ‘లాలిపాఠం’.

 
తేజస్విని మనోజ్ఞ... చక్కటి తెలుగమ్మాయి. ఈ అమ్మాయి ఒక రోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటూ కనిపించింది. మరో రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డునందుకుంటూ కూడ. ఇదే అమ్మాయి సార్క్ శిఖరాగ్ర సమావేశాలకు ఎన్‌సిసి యూనిఫాంలో మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. భరతనాట్య ప్రదర్శనతో అభినందనలు అందుకుంది. ఉన్నట్లుండి మరోరోజు యోగసాధన భంగిమలో దర్శనమిస్తుంది. అప్పుడప్పుడూ స్వరంలో సరిగమలు పలికిస్తూ కర్ణాటక సంగీతాన్ని సాధన చేస్తుంది. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె వయసు 20లోపే, వేళ్ల మీద లెక్కించే వయసే కానీ, సాధించిన విజయాలను లెక్కించడానికి మాత్రం వేళ్లు చాలవు. సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇన్నిరంగాల్లో ప్రతిభావంతురాలు కావడం చిన్న విషయం కాదు. అమ్మాయిలో అంతటి ఐక్యూ ఉండడం దేవుడిచ్చిన వరమైతే, దానిని ఒకక్రమంలో పెట్టడంలో ఆమె తల్లిదండ్రులు సఫలమయ్యారు. ఆ వివరాలను మనోజ్ఞ తల్లి అనిత సాక్షితో పంచుకున్నారు.
 
 పాపకు ఓ వ్యాపకం కోసం...
 
 ‘‘మా వారు మధుసూదన శర్మ బ్యాంకు ఉద్యోగి, నాది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి పాప స్కూలు నుంచి వచ్చి ఒంటరిగా బాల్కనీలో కూర్చుని ఉండేది. పాపను ఏదో ఒక వ్యాపకంలో నిమగ్నం చేయడం మంచిదనిపించింది. ఉదయం కొన్ని డ్రాయింగ్‌లు ఇచ్చి, సాయంత్రం నేనొచ్చేటప్పటికి పూర్తిచేయమని చెప్పేదాన్ని. పాపకు ఐదేళ్లు వచ్చిన తర్వాత భరతనాట్యం నేర్పిద్దామని సికింద్రాబాద్‌లో చేర్చాం.
 
 నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పాపను డాన్సు క్లాసుకు తీసుకు వెళ్లేదాన్ని. పాప ఇంట్లో ఉన్నంత సేపూ నా చుట్టూ తిరుగుతూ నేను పాట పాడేటప్పుడు గొంతు కలుపుతూ ఉండేది. తనకు ఆసక్తి ఉంది కదా అని ఆరేళ్లు వచ్చిన తర్వాత కర్ణాటక సంగీతంలో చేర్పించాం. రోజూ సాయంత్రం డాన్సు, సంగీతం క్లాసులతోనే సరిపోయేది. దాంతో హోమ్‌వర్క్ ఉదయం పూట చేయించడం అలవాటు చేశాను. మనోజ్ఞకు నాలుగింటికి లేచి చదువుకోవడం కూడా అలాగే అలవాటైంది. డాన్సు ప్రదర్శన పూర్తయి ఇంటికి వచ్చి నిద్రపోయేటప్పటికి ఒక్కోసారి పన్నెండయ్యేది. అలాంటప్పుడు కూడా తెల్లవారి నాలుగు గంటలకు లేపితే బద్దకించకుండా లేచేది.
 
 ఇదిలా ఉండగా సెవెన్త్ క్లాసులో ఉన్నప్పుడు ‘ఎన్‌సిసిలో చేరుతాను’ అని అడిగింది. నేను కూడా ఎన్‌సిసి క్యాడెట్‌నే. దాంతో తనని నిరుత్సాహపరచలేదు. వీటితోపాటు స్కూల్లో యోగా క్లాసులుండేవి. ఈ యాక్టివిటీస్ అన్నింటిలోనూ తరచుగా కాంపిటీషన్‌లు జరుగుతుండేవి. పాపను వాటికి తీసుకెళ్లడం నాకు అదనపు బాధ్యత. మధ్యాహ్నం కాంపిటీషన్ ఉంటే నేను ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకుని వెళ్లేదాన్ని. మనోజ్ఞ పోటీలో పాల్గొన్న తర్వాత తిరిగి స్కూల్లో దించి నేను ఆఫీస్‌కెళ్లేదాన్ని. పాప టెన్త్‌క్లాస్‌కి వచ్చాక ఫుల్‌టైమ్ జాబ్ వదిలి ఫ్రీలాన్స్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇలా నా టైమంతా పాప చుట్టూనే...’’ అన్నారామె.
 
 గురితప్పని షూటర్!
 
 మనోజ్ఞ ఏకకాలంలో ఇన్ని కళలను సాధన చేస్తూ శిఖరాగ్రాలకు చేరడం గురించి అనిత... ‘‘దేనిలో అడుగుపెట్టినా పీక్‌కు వెళ్లాలనే తపనతో శ్రమిస్తుంది. పిల్లల్లో ఆ తత్వం ఉండడమే పెద్ద వరం. తనలో ఆ క్వాలిటీ ఉండబట్టే ఇన్ని విజయాలు సాధించింది. అన్నింటినీ బాలెన్స్ చేసుకోగలిగిన మానసిక స్థిరత్వం కూడా ఉంది. ఎన్‌సిసి శిక్షణలో టీచర్లు ‘నువ్వు రైఫిలంత బరువు కూడా లేవు, ఎలా షూట్ చేస్తావు’ అనేవారట. వాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ రైఫిల్ షూటింగ్‌లో టాపర్ అయింది. ఇవన్నీ చేస్తూ టెన్త్‌క్లాస్ 94 శాతంతో పాసైంది’’ అన్నారు.
 
 చదువు, పరీక్షలు, ప్రదర్శనలు, ఎన్‌సిసి క్యాంపులు... ఒక టైమ్‌టేబుల్‌తో మరొకటి ఓవర్‌లాప్ అయిన సందర్భాలను వివరిస్తూ... ‘‘అన్నింటికంటే పెద్ద చిక్కుముడి ఇంటర్‌లో  పడింది. ప్రీఫైనల్స్ సమయంలో ప్రధానమంత్రి నుంచి అవార్డు తీసుకోవాల్సి వచ్చింది. కాలేజ్ వాళ్లు ససేమిరా అన్నారు. ఏదయితే అదవుతుందని ఢిల్లీ వెళ్లిపోయి, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ బోర్డుకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తూ ఇంటర్మీడియట్ బోర్డు డెరైక్టర్‌గారే మాట్లాడారు. ఆయనకు పరిస్థితి చెప్పగానే... ‘మన రాష్ట్ర క్యాడెట్ ప్రధానమంత్రి అవార్డుకి ఎంపిక కావడం 16 ఏళ్ల తర్వాత ఇదే. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. పరీక్ష మళ్లీ రాయవచ్చు’ అని భరోసా ఇచ్చారు’’ అన్నారు అనిత.
 
 ప్రధాని ప్రశంస!
 
 జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘మనోజ్ఞ ప్రైమ్ మినిస్టర్ మెడల్ అందుకున్న రోజు ప్రధాని మన్‌మోహన్ సింగ్ ‘యు హావ్ గివెన్ ఎ వండర్‌ఫుల్ చైల్డ్ టు ది నేషన్’ అన్నారు. ఆ ప్రశంస... మనోజ్ఞ కోసం నేను పడుతున్న శ్రమను, చేస్తున్న ఖర్చును తప్పుబడుతూ బంధువులు, ఇతరులు అన్న మాటలకు సమాధానం అనిపించింది. అలాగే మరో సంఘటన... చిన్నప్పుడోసారి మనోజ్ఞ డాన్సు క్లాసుకు వచ్చే పిల్లలను చూస్తూ ‘వాళ్లలా నేను కారులో వచ్చేది ఎప్పుడమ్మా’ అని అడిగింది. అప్పుడు నేను ‘బాగా చదువుకో, డాన్సు నేర్చుకో, అప్పుడు కారే నీ దగ్గరకు వస్తుంది’ అన్నాను. మనోజ్ఞ ‘మిస్ ఆంధ్రా తెలుగు గర్ల్’ పోటీలో బహుమతిగా నానోకారు అందుకున్నప్పుడు అప్పటి సన్నివేశం కళ్ల ముందు మెదిలింది’’ అన్నారు అనిత.
 
 సమాజమే పెద్ద బడి!
 
 పరిణతితో వ్యవహరించే నేర్పు గురించి చెబుతూ... ‘‘కొత్తిమీర కట్ట కొనడానికి వెళ్తున్నా కూడా పాపను నాతో తీసుకెళ్లేదాన్ని. ఎంత ఎక్కువగా సమాజాన్ని, ప్రపంచాన్ని చూస్తే అంత ఎక్కువ పరిజ్ఞానం వస్తుంది, ప్రతిదీ ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్సే. ఇలాంటి అనుభవాలతో బయటి దేశాలకు ఒక్కతే వెళ్లాల్సి వచ్చినప్పుడు తను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. మనోజ్ఞలో మరో మంచి లక్షణం ఏమిటంటే... మీడియా అటెన్షన్ ఎంత వస్తున్నా తనలో అహం పెరగలేదు. దానికి భరతనాట్యం, ఎన్‌సిసి క్రమశిక్షణ, యోగసాధన, ధ్యానం... ఇలా ప్రతిదీ కారణమే.
 
 పోటీల్లో పాల్గొనేటప్పుడు ‘నువ్వు నీలోని నైపుణ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రదర్శించు, ఫలితం గురించి ఆలోచించకు’ అని ప్రోత్సహించేదాన్ని. గెలిచి తీరాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. తను నా శ్రమను చూస్తూ పెరిగింది. కాంపిటీషన్‌లు పూర్తయి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చి వంట చేసుకుని భోజనం చేసిన రోజులూ తనకు తెలుసు. మా వారు మాకు సెలైంట్ సపోర్టర్. పాప కోసం చేస్తున్న ప్రయత్నాలను కాదనేవారు కాదు. ఆయన ట్రాన్స్‌ఫర్‌లతో రెండేళ్లకోసారి బయటి ఊర్లకు వెళ్తుంటే మనోజ్ఞ కోసం నేను హైదరాబాద్‌లోనే ఉండేదాన్ని. ఇదేమీ త్యాగం కాదు. బాధ్యతను నిర్వర్తించడమే. పిల్లలను కన్న తర్వాత వాళ్లకోసం జీవించాల్సిందే’’ అన్నారు అనిత.
 
 కన్నబిడ్డ పెంపకాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్న మాతృమూర్తి అనిత, ఆమె ప్రయత్నానికి అండదండగా నిలుస్తున్న తండ్రి మధుసూదన్. పిల్లలను కనడం, పెంచడం కాదు. వారిని జాతి గర్వించే పౌరులుగా తయారు చేయడానికి ఎంత శ్రమ అవసరమైతే అంతగా శ్రమించి తీరాలి, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలంటున్న ఈ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
 
 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 
 నా కష్టం ఫలించింది
 మనోజ్ఞ యుఎస్, యుకె, యూరప్, అరబ్ ఎమిరేట్స్, సింగపూర్‌తోపాటు అనేక ఆసియా దేశాల్లో ప్రదర్శనలిచ్చింది. ఐదారు దేశాల అధ్యక్షులు, ప్రధానుల నుంచి పురస్కారాలను, ప్రశంసలను అందుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఇన్నేళ్లపాటు బస్టాపుల్లో ఎండకు ఎండి, వానకు తడిసిన సందర్భాలు, ఆటోలో తీసుకెళ్తూ పాపకు జడలు వేసి, టిఫిన్‌పెట్టిన సంఘటనలు గుర్తొస్తుంటాయి.
 - అనిత, మనోజ్ఞ తల్లి
 
 తేజస్విని మనోజ్ఞ విజయాలు కొన్ని...
 -ఇండియన్ యూత్ ఎక్స్‌లెన్సీ అవార్డు (ఎన్.సి.సి.)
 -సార్క్ యంగ్ అచీవర్స్ మెడల్
 -యుఏఈ ‘ఇండియన్ ఉమెన్ అచీవర్స్’ ట్రోఫీ
 -ఇండియా బెస్ట్ క్యాడెట్(ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ) ట్రోఫీ (ప్రధానమంత్రి నుంచి)
 -రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రెసిడెంట్ చేతులమీదుగా పురస్కారం
 -బెస్ట్ షూటర్ (రైఫిల్ షూటింగ్)
 -లీడ్ ఇండియా కంటింజెంట్ కమాండర్
 -సమైక్య భారత్ గౌరవ్ సత్కార్ పురస్కార్
 -ఎపి గవర్నర్ నుంచి గౌరవ పురస్కారం
 -వైఎస్‌ఆర్ చేతులమీద ‘బాలరత్న అవార్డు’
 -క్రియేటివ్ చైల్డ్ విభాగంలో రాష్ట్రపతి పురస్కారం
 -మిస్ ఆంధ్రా తెలుగు గర్ల్ 2012 బ్రెయిన్ అండ్ బ్యూటీ కాంటెస్ట్‌లో విజేత  ఇంకా...
 -స్వచ్ఛంద సంస్థ ద్వారా బాలల ఆరోగ్యం, విద్య, బాలకార్మికుల నిర్మూలన కోసం సేవ
 -సేవ్ ద గర్ల్ చైల్డ్ క్యాంపెయిన్
 -1500 పైగా భరతనాట్య ప్రదర్శనలు, చారిటీ షోలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement