
ఊర్కొండ/ కల్వకుర్తి టౌన్: కుమారుడి పుట్టినరోజు నాడే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, కుమారుడు విగతజీవులుగా మారారు. నాగర్‌కర్నూ ల్ జిల్లాలోని కల్వకుర్తి పద్మశ్రీ నగర్ కాలనీకి చెందిన టేకులపల్లి వెంకటయ్య(45), అనిత(42) దంపతులకు కుమార్తె అంకిత, కుమారుడు సాయికిరణ్(5) సంతానం.
శనివారం సాయికిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఊర్కొండ సమీపంలోని జడ్చర్ల– కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడిన వెంకటయ్య, సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అనిత, అంకిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వెల్దండలోని ఎన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మరణించింది.
కుమారుడి కోసమే..
వెంకటయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయిన తర్వాత వారసుడి కోసం వెంకటయ్య అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనితకు సైతం మొదటి కాన్పులో కూతురే పుట్టింది. చాలాకాలానికి సాయికిరణ్ జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment