venkataiah
-
అమ్మ ప్రాణం తీసిన రూ.500
పరిగి: గొడవ పడుతున్న కొడుకులను విడిపించేందుకు వెళ్లిన ఓ తల్లి ప్రాణం కోల్పోయింది. క్షణికావేశంతో మొదలైన చిన్నపాటి తగాదా ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరమ్మ (63)కు వెంకటయ్య, శ్రీను, సత్యమ్మ సంతానం. భర్త గతంలోనే మృతిచెందగా.. చిన్న కొడుకు శ్రీనుతో కలిసి ఉంటోంది. పెద్దకొడుకు వెంకటయ్య కుటుంబంతో సహా సమీపంలోని నజీరాబాద్ తండాలో జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీను అనారోగ్యం బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో అన్న వెంకటయ్యకు ఫోన్ చేసి.. మహ్మదాబాద్‌కు చెందిన పసుపుల మల్లయ్య వద్ద రూ.5 వేలు తీసుకురమ్మని చెప్పాడు. డబ్బులు తీసుకొచ్చిన వెంకటయ్య వాటిని తమ్ముడికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి భార్యతో కలిసి సయ్యద్‌మల్కాపూర్ వచ్చాడు. ఇదిలా ఉండగా అనారోగ్యం పాలైన తమ్ముడిని పరామర్శించేందుకు అక్క సత్యమ్మ సైతం వచ్చింది. అయితే రాత్రి వేళ అందరూ భోజనానికి సిద్ధమవుతుండగా.. అన్నదమ్ములిద్దరూ మద్యం తాగేందుకు కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత అక్క సత్యమ్మ తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వలేదని వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను తనను చూసేందుకు వచ్చిన అక్కను డబ్బులు అడుగుతావా అంటూ అన్నను నిలదీశాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. డబ్బు తెచ్చిస్తానని సత్యమ్మ చెప్పినా అన్నదమ్ముల వాగ్వాదం ఆగలేదు. ఈ క్రమంలో ఇద్దరూ పెనుగులాడుతూ ఇంటి ఎదురుగా ఉన్న సీసీ రోడ్డుపైకి చేరుకున్నారు. కొడుకులు కొట్టుకుంటున్నారని గాబరాపడిన తల్లి శంకరమ్మ.. ఇరువురినీ విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీను మధ్యలో నీవెందుకు వస్తున్నావంటూ తల్లిని తోసేయగా, సీసీ రోడ్డుపై పడిపోయింది. కుటుంబ సభ్యులు వచ్చి లేపేందుకు ప్రయత్నించగా చలనం కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లు 108కి ఫోన్ చేసి, అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. -
పుట్టినరోజునే ప్రాణాలు కోల్పోయి..
ఊర్కొండ/ కల్వకుర్తి టౌన్: కుమారుడి పుట్టినరోజు నాడే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, కుమారుడు విగతజీవులుగా మారారు. నాగర్‌కర్నూ ల్ జిల్లాలోని కల్వకుర్తి పద్మశ్రీ నగర్ కాలనీకి చెందిన టేకులపల్లి వెంకటయ్య(45), అనిత(42) దంపతులకు కుమార్తె అంకిత, కుమారుడు సాయికిరణ్(5) సంతానం. శనివారం సాయికిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఊర్కొండ సమీపంలోని జడ్చర్ల– కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటయ్య, సాయికిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, అనిత, అంకిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వెల్దండలోని ఎన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మరణించింది. కుమారుడి కోసమే.. వెంకటయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయిన తర్వాత వారసుడి కోసం వెంకటయ్య అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనితకు సైతం మొదటి కాన్పులో కూతురే పుట్టింది. చాలాకాలానికి సాయికిరణ్ జన్మించాడు. -
పెద్దపల్లి పెద్దవ్వ
జిల్లా కేంద్రం పెద్దపల్లి కమాన్ చౌరస్తా నుంచి కిలోమీటరు దూరం వెళ్తే బ్రాహ్మణ వీధి వస్తుంది. ఆవీధిలోని ఒక ఇంట్లో.. రెండు మూడేళ్లు తక్కువగా నూరేళ్ల వయసున్న మాతృమూర్తి కనిపిస్తుంది. పేరు మల్లోజుల మధురమ్మ. ఆమె పేరు చెవిన పడని తెలంగాణ ప్రాంతం లేదు. ఉత్తర తెలంగాణలోనైతే ఇంటింటా ‘‘అవును.. మల్లోజుల మధురమ్మ నాకు తెలుసు.. నేను చూశా.. నేను విన్నా’’ అని చెప్పుకునేవారే. కారణం.. ఆ తల్లి జీవితంలో ప్రతి పేజీ ఓ చరిత్రకు ముడిపడి ఉంది. నాడు తెలంగాణ విమోచన పోరాటం నుండి సమసమాజ స్థాపన కోసం నేటికీ జరుగుతున్న ప్రతి పోరాట ఘట్టంలో మల్లోజుల మధురమ్మ పాత్ర పరోక్షంగా ఉంది. ఆమె భర్త మల్లోజుల వెంకటయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రాష్ట్ర విమోచన ఉద్యమంలో ఒకరయ్యారు. మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు.. అసమానతలు లేని నవసమాజ నిర్మాణం కోసం అడవులు పట్టి వెళ్లారు. ఆ అన్నదమ్ముల్లో ఒక్కరు కిషన్‌జీ అమరుడయ్యారు. మరొకరు మల్లోజుల వేణు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకుడు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం సందర్భంగా.. తల్లిగా, తెలంగాణ సాయుధ వీరుడు వెంకటయ్య భార్యగా మధురమ్మ జీవిత విశేషాలు కొన్ని. సమరయోధుని భార్యగా గుర్తింపు మల్లోజుల మధురమ్మ పండు ముసలితనంలోనూ కళ్లద్దాలు లేకుండానే స్పష్టంగా చూస్తుంది. చెవులు వినబడుతాయి. అంతే స్పష్టంగా మాట్లాడుతుంది. కారణం.. ఈ సమాజాన్ని రెండు వైపులా చూసింది. రజాకార్లు, పోలీసులు పెట్టిన వేధింపులు అనుభవించింది. ప్రభుత్వాధికారుల నుండి సన్మానాలు అందుకుంది. సమరయోధుడి భార్యగా ఏటా జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలలో సన్మానాలు అందుకుంటూనే ఉంది. ఇటీవల సాక్షాత్తూ పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన మధురమ్మకు పాదాభివందనం చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకులంతా మధురమ్మ నుంచి ఆశీర్వాదం అందుకున్నవారే. ఇందుకు భిన్నమైన కోణం కూడా ఉంది. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో రామగుండం మండలం ముర్మూరు వద్ద ప్రభుత్వం వెంకటయ్యకు కేటాయించిన ఏడు ఎకరాల భూమి ఎల్లంపల్లి ప్రాజెక్టులో మునిగిపోయింది. భూమికి బదులు భూమిని ఇస్తామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేయడంతో.. మధురమ్మకు అభినందనలు మాత్రమే మిగిలాయి. భర్త ఆచూకీ కోసం చిత్రహింసలు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందులో మల్లోజుల మధురమ్మ భర్త వెంకటయ్య ఒకరు. నాగపూర్ క్యాంపులో కమ్యూనిస్టు కార్యకర్తగా శిక్షణ పొందిన వెంకటయ్యను రజాకార్లు అరెస్టు చేసి సుల్తానాబాద్ కోర్టులో హాజరుపరిచి వరంగల్ జైలుకు తరలించారు. అంతకు ముందు భర్త ఆచూకీ కోసం మధురమ్మను వారు పెట్టిన చిత్ర హింసలు అన్నీ ఇన్నీ కావు. అడవిబాట పట్టిన కన్నబిడ్డలు తెలంగాణ ప్రాంతం విముక్తి తర్వాత పదేళ్లకు పుట్టిన మధురమ్మ ముగ్గురు కొడుకుల్లో పెద్ద వారైన ఆంజనేయశర్మ ప్రస్తుతం పెద్దపల్లిలోనే పౌరోహిత్యం చేస్తున్నారు. ‘‘చివరిసారి 25 ఏళ్ల క్రితం పోలీసులు నా కొడుకుల జాడ చెప్పా లంటూ ఇల్లు నేలమట్టం చేయడంతో నిరాశ్రయురాలినై తుంగ గుడిసెలోనే నాలుగేళ్లు కాలం గడిపాను’’ అని చెమర్చిన కళ్లతో మధురమ్మ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. – కట్ట నరేంద్రాచారి, సాక్షి, పెద్దపల్లి ఫొటోలు : సతీష్ రెడ్డి అగ్రనేత కిషన్‌జీ ఎనిమిదేళ్ల క్రితం ఎన్కౌంటర్లో మరణించిన మధురమ్మ రెండో కొడుకు కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) మావోయిస్టు పార్టీ నిర్మాణ కర్తల్లో ఒకరు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు అయిన విప్లవ సానుభూతిపరుడు. జగిత్యాల జైత్రయాత్ర నుండి మొదలైన కిషన్‌జీ ప్రస్థానం పీపుల్స్‌వార్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘ కాలం సాగింది. ఆ తర్వాత కేంద్ర కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్నారు. భారత విప్లవోద్యమ పితామహుడైన చారుమజుందార్ సొంత గడ్డ పశ్చిమబెంగాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని కిషన్‌జీ పునరుజ్జీవింపజేశారు. పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలకు ముంబై, ఢిల్లీ, కలకత్తాలకు చెందిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం రావడం విశేషం. -
వెంకటయ్య..వెరీ లక్కీ
సోమాజిగూడ: ఓ సాధారణ పారిశుధ్య కార్మికుడు ఫైవ్ స్టార్ హోటల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. జీహెచ్ఎంసీ కార్మికుడు వెంకటయ్యకు ఆ అదృష్టం దక్కింది. చిత్తశుద్ధితో పారిశుధ్య విధులు నిర్వహించి దేశవ్యాప్త గుర్తింపు పొందిన వెంకటయ్యను సోమాజిగూడలోని మెర్క్యుర్ హోటల్ నిర్వాహకులు సోమవారం జరిగిన వార్షికోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించారు. అంకితభావంతో విధులు నిర్వహించే వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందనడానికి వెంకటయ్య ఉదాహరణ అని ఈ సందర్భంగా కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు టీచర్.. నేడు టాయిలెట్ నిర్వాహకుడు అశోక్ నగర్‌లోని పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకుడైన సంజయ్ కుమార్‌ను ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అశోక్‌నగర్‌లోని గౌరవ గృహాన్ని నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ ఝా తన కుటుంబంతో అదే ప్రాంతంలో నివసిస్తూ 24 గంటలు టాయిలెట్‌ను నిర్వహిస్తున్నాడు. డిగ్రీ పూర్తి చేసి గతంలో బీహార్‌లో టీచర్‌గా పని చేసిన సంజయ్ ప్రస్తుతం టాయిలెట్ నిర్వహణ ద్వారా నెలకు రూ.15 వేలకు పైగా ఆదాయం పొందుతున్నాడని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కమిషనర్లు సంజయ్‌కుమార్ ఝాను అభినందించారు. -
దంపతులపై వేట కొడవళ్లతో దాడి
-
ఐదు బోర్లు వేసి.. ఆత్మహత్య
చింతపల్లి: ఎండిపోతున్న పత్తి పంటను చూసి దిగులు చెందిన రైతు పాతాళ గంగ కోసం భగీరధ ప్రయత్నం చేశాడు. చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావడంతో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన గండికోట వెంకటయ్య తనకున్న నాలుగెకరాలలో పత్తిపంట సాగు చేశాడు. అయితే సరైన నీటి వసతి లేక పంట ఎండిపోతుండటంతో.. మంగళవారం రాత్రి తన భూమిలో 5 బోర్లు వేశాడు. వాటిలో చుక్క నీరు పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యాదాద్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పంట పొలాల్లో మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పట్టణానికి చెందిన జగన్నాథం చిన వెంకటయ్య(34)గా గుర్తించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
బొగ్గులదొన ఉప ఎన్నికల హోరాహోరీ
నల్లగొండ జిల్లా డిండి మండలం బొగ్గులదొన పంచాయతీ సర్పంచి పదవికి గురువారం నిర్వహించిన ఉప ఎన్నిక నువ్వానేనా అన్నట్లు సాగింది. సర్పంచి వరికుప్పల జంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందటంతో అధికారులు గురువారం ఉప ఎన్నిక జరిపారు. జంగయ్య భార్య జయమ్మ తన సమీప ప్రత్యర్థి తండు వెంకటయ్యపై 44 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. -
శభాష్ వెంకటయ్య!
జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్యకు రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.1,11,116 చెక్కును అందజేశారు. దక్షిణ మండల జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి రూ.లక్ష, ఖర్చులకు మరో రూ.10 వేల చెక్కులను గురువారం అందించారు. శుక్రవారం సాయంత్రం వెంకటయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ ఆంజనేయులు వెళ్తున్నారు. విమాన టిక్కెట్లను గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వారికి అందజేశారు. తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నారు. అభినందనలు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం వెంకటయ్యను సత్కరించారు. ఢిల్లీ వె ళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.25 వేలు అందజేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు. అంతా కలగా ఉంది.. గత మూడు రోజులుగా తనకు అంతా కలగా ఉందని వెంకటయ్య సాక్షి’తో చెప్పారు. అందరూ తనను అభినందిస్తున్నారని... టీవీలు, పేపర్లలో తన ఫొటో కనిపిస్తోందని...కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు, బంధువులు అభినందిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
పత్తేపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
శంకర్పల్లి మండలం పత్తేపూర్ గ్రామ శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళ్తున్న వెంకటయ్య(45) అనే వ్యక్తి ఎదురుగా వస్తోన్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటయ్య స్వస్థలం చేవెళ్ల మండలం కమ్మెట అనుబంధగ్రామం గొల్లగూడ. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రుణభారంతో రైతు బలవన్మరణం
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం పట్టపహాడ్‌లో కుమ్మరి వెంకటయ్య(38) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్యకు రెండెకరాల మామిడితోట, ఎకరం పొలం ఉన్నాయి. పొలంలో గడ్డి సాగు చేసి, ఇటీవల కొనుగోలు చేసిన జర్సీ ఆవులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల బోరు అడుగంటి మామిడితోట ఎండిపోయింది. అప్పు చేసిన కొనుగోలు చేసిన జర్సీ ఆవు మృత్యువాతపడింది. రూ.3 లక్షల వరకు ఉన్న అప్పులను ఎలా తీర్చాలో తెలియక వెంకటయ్య ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తన మామిడితోటలోనే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బకు వెయ్యి కోళ్లు మృతి
ఎండతీవ్రతకు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లక్ష్మారావుగూడలోని ఓ ఫారంలో వేయి కోళ్లు చనిపోయాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య అనే తనకున్న చేనులో రెండు షెడ్లను అప్పుచేసి వేశాడు. ఒక్కో షెడ్డులో మూడు వేల కోళ్లను పెంచే వీలుంది. రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరగటంతో రెండు షెడ్లలోని కోళ్లకు చల్లదనం కోసం ఏర్పాట్లు కూడా చేశాడు. అయినప్పటికీ గురువారం వెయ్యి కోళ్లు చనిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల ఆరంభం నుంచి ఎండ వేడిమికి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెప్పాడు. -
భార్యాబిడ్డలపై గొడ్డలితో దాడి.. ఆత్మహత్య
అచ్చంపేట(మహబూబ్‌నగర్): కుటుంబ కలహాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను కత్తితో కిరాతకంగా నరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(46), దాలమ్మ 40 దంపతులకు నలుగురు సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన వెంకటయ్య భార్యతో పాటు పిల్లలను చంపేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భయపడిపోయిన దాలమ్మ పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టి భర్తతో వాదులాడుతుండగా.. కోపోద్రిక్తుడైన భర్త కత్తితో ఆమె పై దాడి చేశాడు. అనంతరం భార్య చనిపోయిందనుకొని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నెల్లూరునగరంలో వ్యక్తి దారుణ హత్య
నగరంలోని బాలపీరయ్య కల్యాణమంటపం సమీపంలో ఎన్.వెంకటయ్య(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. మృతుడి స్వస్థలం గూడూరు. కానీ ప్రస్తుతం బుజబుజనెల్లూరు కాలనీలో నివసిస్తున్నాడు. కల్యాణ మంటపం సమీపంలోనే వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హత్యకు పాత కక్షలే కారణం అయి ఉంటాయని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న 5వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పంట పండలేదని రైతు ఆత్మహత్య
వలిగొండ : వర్షాలు లేకపోవడంతో కళ్ల ముందే పంట ఎండిపోతుందని ఒక రైతు తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన వెంకటయ్య అనే రైతుకు ఐదు ఎకరాల పొలం ఉంది. ఆ పొలంతోపాటు మరో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంట సాగుచేశాడు. కాగా, వర్షాలు సరిగా లేకపోవడంతో పంట ఎండిపోతుంది. వ్యవసాయం కోసం అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. దాంతో ఓ వైపు పంట ఎండిపోవడం.... మరోవైపు అప్పుల బాధతో వెంకటయ్య తీవ్ర మనస్తాపం చెందాడు. దాంతో పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి
నల్లగొండ : చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని ఆ గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటయ్య(35) అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు గత కొంత కాలంగా అనుమాస్తున్నారు. ఆ క్రమంలో అతనిపై గ్రామస్తులు ముకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిని వెంకటయ్య సోదరుడు పెద వెంకటయ్యతోపాటు అతడి బావమరిది చంద్రయ్య అడ్డుకున్నారు. ఈ దాడిలో వారిద్దరు కూడా గాయపడ్డారు. అయితే వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి
తిరుమల: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తిరుమలకు వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు రిసెప్షన్ డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
బస్సును ఢీకొన్న లారీ
ధారూరు: నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేరెళ్లి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓ సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 07 జెడ్ 4055) తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. నగరం నుంచి తాండూర్లోని విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి ఓ లారీ (ఏపీ 09 వై 5448) వస్తోంది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్ వెంకటేశ్ అతి వేగంగా వాహనం నడుపుతున్నాడు. ఉదయం 10.15 గంటల సమయంలో కేరెళ్లి గ్రామం సమీపంలో గాలి పోచమ్మ ఆలయ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంకటయ్య తీవ్రంగా హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. బస్సు డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతూ వాహనాన్ని ఎడమ వైపునకు మళ్లించాడు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ కుడివైపునకు రాంగ్రూట్లో వచ్చాడు. బస్సును సమీపించిన తరుణంలో హారన్‌కు ఉలిక్కిపడిన లారీ డ్రైవర్ వెంకటేశ్ ఒక్కసారిగా లారీని ఎడమ వైపునకు తీసుకున్నాడు. ఈక్రమంలో లారీ వెనుకభాగం బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు కుదుపునకు గురవడంతో ప్రయాణికులు 15 మంది ముందు సీట్లకు తగిలి స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం ప్రయాణికులు వేరే బస్సులో వెళ్లిపోయారు. బస్సు డ్రైవర్ వెంకటయ్య ధారూరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. లారీతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగభూషణం తెలిపారు. -
ఆటో పల్టీ: ఇద్దరి దుర్మరణం
ధారూరు: వేగంగా వెళ్తున్న ఆటో బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి పల్టీలుకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో రైతు, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ప్రమాదంలో మరో పదమూడు మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతగిరిగుట్ట మలుపులో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వికారాబాద్ సీఐ రవి కథనం ప్రకారం.. వికారాబాద్ నుంచి ఓ ఆటో(ఏపీ 28 వై 1922) శనివారం ఉదయం ధారూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. ఈక్రమంలో అనంతగిరి గుట్ట దిగుతుండగా శివలింగం మలుపులో వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆటో వేగంగా ఉండడంతో లోయలోకి దూసుకెళ్తుంది. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్ వెంకటయ్య వెంటనే కుడివైపుకు మళ్లించాడు. దీంతో ఆటో అదుపుతప్పి మూడుసార్లు పల్టీలు కొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన రైతు కావలి ఎల్లయ్య(50) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధారూరు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్(45), శంషొద్దీన్(32), చాంద్‌పాషా(38), యాదయ్య(22), లక్ష్మణ్(20), మోసీన్(19)లకు తీవ్ర గాయాలయ్యా యి. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఓ ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే మధుసూదన్ ప్రాణం విడిచాడు. శంషొద్దీన్, చాంద్‌పాషా, యాదయ్యల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వారిని నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న వికారాబాద్ సీఐ రవి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా ఆటో డ్రైవర్ వెంకటయ్య పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి వస్తూ.. ఆటో పల్టీలు కొట్టిన ప్రమాదంలో రైతు ఎల్లయ్య తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈయనకు భార్య బాల మణి, కొడుకు సాయిలు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఎల్లయ్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శనివారం ఉదయం వికారాబాద్‌లోని ఆ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగి మధుసూదన్ వికారాబాద్‌లోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. రెండునెలల క్రితం ఆయన ధారూరు తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చారు. ఈయనకు భార్య సరస్వతి, కూతురు విజయ ఉన్నారు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ మండలం మత్పల్ గ్రామస్తుడు. మధుసూధన్ రాజేంద్రనగర్ మండలం ఆరెమైసమ్మ వద్ద ఉంటూ ధారూరుకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడు. -
ఆశలు..ఆవిరి
నవ వసంతం వారిళ్లలో కొత్త దనం తేలేదు సరికదా.. తీరని విషాదాన్ని నింపి..కాలుని నిర్ణయం కఠినమని రుజువు చేసింది. భర్తా, పిల్లలతో కలిసి ఉగాది వేడుకను చేసుకుందామని ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి గుండెనిండా శోకాన్ని నింపింది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన చంద్రమ్మకు ఎదురైన దుస్థితి. మాచన్ పల్లిలో ఆడపడుచు ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్న పిల్లలు యాదమ్మ (12), యశ్వంత్ (8)లను పండుగకు ఇంటికి తెస్తానని వెళ్లిన భర్త వెంకటయ్య (35) కొడుకు సహా అందని లోకాలకు వెళ్లిపోయాడు. కుమార్తె తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైంది. ఇంటికి హుషారుగా బైక్‌పై బయలు దేరిన వారిని బస్సు మృత్యు దేవతై కబలిం చింది. ఈ విషయం తెలిసిన చంద్రమ్మకు కంటనీరు తప్పా మాట పెగలడం లేదు. కుటుం బంపై పెంచుకున్న ఆశలు..చెదిరిన స్వప్నమవ్వడాన్ని తట్టుకోలేక పోతోంది. ఇక భూత్పూ ర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు బొలెరో వాహనం బోల్తాపడి ప్రమాదంలో చిక్కుకోగా మాసన్న (50) అనే వ్యక్తి, గుర్తు తెలియని మరో ఇరువురు ప్రాణాలు కోల్పోయి ఆత్మీయులకు వేదనను మిగిల్చారు. పండగపూట పచ్చని తోరణాలతో కళకళలాడాల్సిన కుటుంబాల్లో రక్తం చిందింది. బంధువులు..స్నేహితులు..ఇరుగుపొరుగు వారితో ఆనందం నిండాల్సిన ఇళ్లల్లో కన్నీరు మిగిలింది. షడ్రుచులతో తయూరు చేసిన పచ్చడి తిందామని దూరప్రాంతాల నుంచి తమతమ ఇళ్లకు బయలు దేరిన వారు తిరిగిరాని లోకాలకు చేరి‘పోయూరు’.అరుున వారితో ఆప్యాయంగా గడుపుదామనుకున్న వారు విగతజీవులై తమవారిని శోకసంద్రంలో ముంచేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయలతో మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బొలెరో బోల్తా : ముగ్గురు మృతి భూత్పూర్ : వేగంగా వెళ్తున్న ఓ బొ లెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి కి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం జాతీయ రహదారిపై గల శేర్పల్లి (బి) సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు బండల లోడ్‌తో వెళ్తున్న వాహనం లో ఆరుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు. వెనుక టైరు పంక్చర్ కావడంతో బోల్తాపడింది. పెబ్బేర్ మం డలం పెంచికలపాడుకు చెందిన హ రిజన్ మాసన్న (50) అక్కడికక్కడే మృ తిచెందాడు. అతని కుమారుడు బాలకృష్ణకు కాలు, చేయి విరిగింది. మ రో ఇద్దరు మృతుల ఆచూకీ తెలియాల్సి ఉంది. కర్నూలుకు చెందిన డ్రైవర్ సురేశ్‌కు కాలు విరగ్గా, తలకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన బాలకృష్ణ, సు రేశ్లను 108 ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బతికి బయటపడ్డ దంపతులు... మానవపాడు మండలం తక్కశిలకు చెందిన మద్దిలేటి, లక్ష్మి అనే దంపతులు డ్రైవర్ పక్కకు కూర్చొని ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ కాలు, చేయి విరి గినా మద్దిలేటి, లక్ష్మిలకు ఎలాంటి గా యాలు కాకుండా బతికి బయటపడ్డారు. ఈ సంఘటన నుంచి తేరుకున్న అనంతరం భగవంతుడు తమకు పునర్జన్మ ప్రసాదించాడని లక్ష్మమ్మ రో దిస్తూ తెలిపింది. మృతి చెందిన ముగ్గురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జ డ్చర్ల రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్ ఎస్సై లక్ష్మారెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెంచికలపాడులో విషాదం పెంచికలపాడు(పెబ్బేరు) : పొట్ట చేత పట్టుకొని పనికోసం పట్నం వెళ్లిన తం డ్రీ కొడుకులపై విధి కక్ష గట్టింది. తన కుమారుడితో ఉగాది పండుగకు సొంత ఊరికి బయలు దేరి వస్తుండగా మార్గమధ్యంలో వారు ప్రయాణిస్తున్న వాహ నం ప్రమాదానికి గురై తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడికి తీ వ్ర గాయలయ్యాయి. తన భర్త , కుమారుడు పండుగకు వస్తున్నారని ఎదురు చూస్తున్న ఆ ఇల్లాలికి విషయం తెలిసేసరికి కుప్పకూలిపోయింది. పెంచికల పాడు ఎస్సీ కాలనీకి చెందిన కర్రె మశన్న(52), అక్కమ్మ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ఐదుగురు ఆ డపిల్లలు కాగా ఒకే ఒక్క కుమారుడు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పని కోసం హైదరాబాద్ వె ళ్లి కూలీ చసి జీవనాన్ని గడుపుతున్నా రు. తన కుమారుడు బాలకష్ణతో కలిసికూలీ చేస్తూ ఐదుగురు కూతుళ్ల పెళ్లీలు చేశారు. ఖర్చుల నిమిత్తం హైదరాబాద్‌లో పని చేస్తుండేవారు. పండగపూట విషాదం నెలకొంది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని బలిగొంది. తండ్రీ, కూతురు,కొడుకు కలిసి వస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢికొట్టి ఇద్దరి ప్రాణాలు బలిగొంది. తండ్రీ కొడుకులు దుర్మరణం చెందగా..కూతురు తీవ్ర గాయూలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సోమవారం దేవరకద్ర-మహబూబ్‌నగర్ మార్గమధ్యంలోని కోటకదిర స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన హరిజన్ వెంకటయ్య, చంద్రమ్మ దంపతులకు ఇద్దరు ఆడ సంతానం, ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. వెంకటయ్య (35) వడ్డెరపని చేస్తూ తన టుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురు యాదమ్మ (12) యశ్వంత్ అలియాస్ చింటూ (8)లు కోటకదిర స్టేజీ సమీపంలోని కాకతీయ ప్రైవేట్ పాఠశాలలో ఒకరు 8వ తరగతి, ఒకరు ఒకటో తరగతి చదువుతున్నారు. వీరు మహబూబ్‌నగర్ మండలం మాచ న్పల్లిలోని తన మేనత్త వద్ద ఉంటూ ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. అయితే పండగకు తన కూతురు, కొడుకును బైక్‌పై స్వగ్రామానికి తీసుకు వస్తుండగా కోటకదిర స్టేజీ వద్ద రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. యాదమ్మ, యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా యశ్వంత్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. యాదమ్మ తీవ్ర గాయాలపాలై ఎస్వీఎస్ ఆస్పత్రిలో కోలుకుంటోంది. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేశారుు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బస్వాయిపల్లిలో విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెందడంతో వారి స్వగ్రామమైన బస్వాయిపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసిమెలిసి ఉండే తండ్రి, కొడుకులు ఇద్దరు ఒకేసారి దుర్మరణం చెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
పిల్లల్లేకపోయిరి!
పాలమూరు, న్యూస్‌లైన్: దినాం పరిస్థితి ఎట్లున్నగాని.. పండ్గదినమొచ్చిందంటే.. పిల్లలు కండ్లముందలుండాలె.. లేకుం టే అమ్మ, నాయ్నలు శాన కుద్నెజేస్తరు.. గసొంటి బా ధనే గీళ్లు గూడవడ్తుండ్రు.. 70 ఏండ్లు మీదవడ్డ వెంకటయ్యది అడ్డాకుల మండలం తుంకినిపూర్. గాయ న భార్య నర్సమ్మ.. వీరికిద్దరు కొడ్కులు..పెద్దకొడ్కు కురుమూర్తికి పెండ్లయింది. చిన్నకొడ్కు వెంకటేశ్‌కు ఇంకాగాలేదు. పెద్దకొడుకు పెండ్లాన్ని, తన త మ్ము డ్ని దోల్కోని పొట్టచేతవట్కోని మహరాష్ట్రలున్న నా గపూర్‌కు వలసవోయిండ్రు..! పెద్దకొడ్కు పిల్లలు వోల్లతాన్నె ఉన్నగూడ్క.. పండ్గపూట కోడలు, కొడ్కులిద్దరు వొస్తలేరని దినమంత దిగులువడ్తుండ్రు.. ఇంట్ల కొడ్కుల్లేకుండ మంగళారం పండ్గ ఎట్లజేస్కుంటమని ఎంకటయ్య, గాయన భార్య నర్సమ్మ పక్కింటి కుర్మయ్య, వెంకటమ్మకు తమ కడుపులబాధ గిట్ల జెప్పుకుంటుండ్రు..! వెంకటయ్య : మనూరు పిల్లగాళ్లంత సంకురాత్రి పం డ్గకోస్రం శానా దూరంకెళ్లి ఊరికొస్తుండ్రు.. మన కొ డ్కులు మాత్రం ఒస్తలేరు.. ఊర్లపని దొర్కుతలేదని దేశంగాని దేశంబొయి ఏం కష్టాలు వడ్తున్నరో.. మన పిల్లలకు సుఖం లేకపాయె.. ఏం బత్కులే మనయ్! నర్సమ్మ : సర్కారు సాయం లేదు. ఉన్న రెండెక్రాల బూమిల బోర్లు వేస్తే నీళ్లువడకవాయె.. ఏస్కున్న పంటెండిపాయె.. గందుకే గద మన పిల్లలు బత్కనీకె వొయిండ్రు. వెంకటయ్య : పట్నంల పనిజేస్క బత్కుతున్న మనూరు పోరగాళ్లు పెండ్లం పిల్లల్తోటి సంకురాత్రి పండ్గ సంబురం జేస్కునికి తుంకినిపూర్కొస్తుండ్రు మన కోడలు, కొడుకులు వొస్తలేరని బాధయితుంది. నర్సమ్మ : ఏంజేతం.. గీసారీ కాలం మంచిగుందని చెప్పుకొన్నీకెనే.. ముందల మురిపించి.. ఎన్కసీరి పంటల్ని శెడగొట్టినయ్గా వోనలు.. పంట చేత్కొచ్చే టైంలనే వోనలెక్వయ్ అందర్కీ పంట చేత్కి రాకపాయె.. గిసోంటి పరిస్థితిల మన పిల్లలు ఊర్లుంటె ఎట్ల బత్కుతమని పనికోస్రం మారాష్ట్రకు వొయిండ్రు.. వెంకటయ్య : గిసోంటి టైంలనే సర్కరొళ్లు ఎక్కడలేని భారం మోపుతుండ్రు.. వొంటజెయ్యనీకె కట్టెల్ దొర్కుతలేవు.. గ్యాస్‌బండకు రేట్లు వెంచిరి.. ఊర్లంటె గాళ్లకు చిన్నతనమైందేమో.. కరెంటు బిల్లులు వెంచిరి.. పొద్దుమూకు కరెంటు తీయవట్రి.. ఇన్ని తిప్పల మన పిల్లలు మనూర్కొచ్చినగిట్ల.. ఏం సుఖపడ్తరు గాని నువ్ బాధవడకే..! నర్సమ్మ : అవునయ్యా... బస్‌చార్జీలు పిరెమైనయి..కండ్ల ముంగట కొడుకుల్లేరని బాధవడ్తున్నగాని గంత దూరం నుంచి వొచ్చిపోవాలంటె ఎంత ఖర్సైతది. గాళ్ల పరిస్థితి ఎట్టుందో యేమో? ..గీ బూమ్మీన యెట్ల బత్కాల్నొ దెలుస్తలేదు. పిల్లల పరిస్థితి జూస్తె ఏడ్పొస్తుంది. అనుకుంట ఎంకటయ్య, నర్సమ్మ ఆలుమొగండ్లు ఇద్దరు ఒకరికొకరు సర్ది చెప్పుకొని కొంచెసేపు బాధవడ్రి..! గీళ్లిద్దరు ఆలుమొగుండ్ల పరిస్థితి గిట్లుంటే.. తుంకినిపూర్లనే ఉన్న 60 ఏండ్ల బొంగు చిన్నకుర్మయ్య, వెంకటమ్మల ఇద్దరు కొడ్కులు చిన్నయ్య, దాసు, కోడండ్లు.. గాళ్ల పిల్లలు పట్నానికి (హైదరాబాద్‌కు) కూలిపనికి పోయిరిపనిజెయ్యనీకి వొయిండ్రు.. గానీ పండ్గకొస్తలేరని ఆల్మొగలు దిగులు వడ్తుండ్రు..! వెంకటమ్మ : ఏమంది వోయ్య.. శానకుదెన జేస్తున్నవ్.. ఎందుకో జెప్పరాదా..! కుర్మయ్య : ఏం లేదే.. మన చిన్న తనంల ఊరిడ్సి పోయెటోళ్లం గాదు.. మన పిల్లలకు గీడ బత్కుదెర్వు లేకనే.. ఊరిడ్సివోయిండ్రు.. సంకురాత్రి పండ్గకు కొడ్కులు, కోడండ్లు, గాళ్ల పిల్లలు గూడ్క వొస్తలేరని దిగులైతుంది. వెంకటమ్మ : ఏంజేతమయ్యా.. యవుసాయం జేతమంటే కరెంట్ ఎప్పుడు వోతదో ఎప్పుడొస్తదో ఎర్కలేకుండవోయింది. కానీ కాలమొచ్చింది.. కన్నకష్టాలు మనయెంట కాసుకున్నయ్. కుర్మయ్య : యాదిమర్సినవా.. సంకురాత్రి పండ్గొస్తే ఎంత సంబురం ఉంటుండె.. గిప్పుడు ఏం కొన్నీకే.. తిన్నీకే లేకుండైంది. సన్నబియ్యంతోటి బెల్లం బువ్వ జేస్కుందమంటె కిలకు 35 రూపాయిలైంది.. ఇంటికి సుట్టమొస్తెగిట్లు బువ్వ వెట్టనీకె లేకుండైంది. గిసోంటి టైంల సంకురాత్రి పండ్గను జేస్కునెదెట్లనొ అర్థమైతలేదు. కుర్మయ్య : ఊర్లనేమో గిట్లుంది.. పిల్లలతోటి పట్నంబోదమంటె ఇల్లిడ్సి పోబుద్దిగాదు.. పండ్గ దినాలల్ల కొడ్కులు, కోడండ్లు, మన్మండ్లు లేకపోతె తినబుద్దిగూడ గాదు. పిల్లల్లేకుండ సంకురాత్రి పండ్గ జేస్కునుడెట్లనో అర్థమైతలేదు. ...గాళ్లకు బత్కుదెర్వు లేనందుకే కూలిపనికోస్రం పట్నం బొయిండ్రు.. ఏంజేతం మన బత్కులిట్ల కాలవడ్నయి.. ముందర ఇంగేమి బాధలు ఎదుర్కొనాల్లో అర్థమైతలేదు.. అన్కుంట వెంకటమ్మ, కుర్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
బాధితుడి నుంచి రూ.4వేల లంచం డిమాండ్ అచ్చంపేట, న్యూస్‌లైన్: బాధితుడి నుంచి రూ.నాలుగువేల లం చం తీసుకుంటూ బ ల్మూర్ వీఆర్వో గుజ్జుల వెంకటయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయా డు. అతని విచారించి డబ్బును సీజ్‌చేశారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ ఎం.ప్రభాకర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. బల్మూర్‌కు చెందిన పల్లె హర్షవర్దన్‌రెడ్డి తండ్రి పల్లె శేఖర్‌రెడ్డి 2012లో చనిపోయారు. అత ని తండ్రి పేర అదే గ్రామ సర్వేనెం.88, 89అ, 126అ, 127అలో 1.39 ఎకరాల భూమి ఉంది. తనపేర విరాసత్ చేయాల్సిందిగా హర్షవర్దన్‌రెడ్డి బల్మూర్ తహశీల్దార్‌కు దరఖా స్తు చేసుకోగా, వీ ఆర్వో గుజ్జుల వెంకటయ్యకు రెఫర్ చేశారు. అయితే పట్టాపాసు పుస్తకాల కోసం బాధితుడు మూణ్నెళ్లుగా కార్యాలయం చుట్టూ తి రుగుతున్నాడు. పాసుపుస్తకాలు ఇంకా సిద్ధంకాలేదని సదరు వీ ఆర్వో చెబుతూవస్తున్నాడు. ఇదిలాఉండగా, గతనెల 25న వీ ఆ ర్వో వెంకటయ్య హర్షవర్దన్‌రెడ్డికి ఫోన్‌చేసి పట్టాపాసు పుస్తకం, టై టిల్డీడ్ కోసం రూ.ఐదువేలు కావాలని అడిగాడు. పాస్‌పుస్తకాలు కావాలని మరోసారి అడిగితే రూ.నాలుగువేలు కావాలని డిమాం డ్ చేశాడు. చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని బల్మూర్‌కు రమ్మంటే హర్షవర్దన్‌రెడ్డి అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఫోన్‌చేయగా సదరు వీఆర్వో అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్‌కు రమ్మని కబురుపెట్టాడు. డబ్బులు తీసుకుంటుండగా వీఆర్వో వెంకట య్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టాపాసు పుస్తకాలు, డబ్బును సీజ్‌చేశారు. వీఆర్వోను పట్టుకున్నవారిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఇన్స్పెక్టర్లు తిరుపతిరాజు, సి.రాజు, సిబ్బంది ఉన్నారు. -
మరో అడుగు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం పేరిట రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనంపై విచారణ కోసం మరో కమిటీ నియమించారు. వారం రోజుల క్రితం ఏజేసీ వెంకటయ్యతోపాటు ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, ఆర్అండ్బీ ఎస్ఈలు, డ్వామా పీడీలను కలిపి ఐదుగురితో కమిటీ వేశారు. తాజాగా ప్రభుత్వం విచారణ కోసం ‘విజిలెన్స్’ను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో మరుగుదొడ్ల నిర్మాణం వ్యవహారంపై విచారణలో మరో అడుగు ముందుకు పడింది. జిల్లాలో సుమారు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద మంజూరైన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్‌కిట్స్‌ను సరఫరా చేసిన ధనలక్ష్మి ఏజెన్సీస్‌కు నిర్మాణం కాకుండానే రూ.17.60 కోట్లు చెల్లించిన వైనంపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. . ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు అక్రమాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయిలో ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ నాణ్యతను పరిశీలించి తీసుకోవడంలో వీఆర్వోలు, ఎంపీడీవోల నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ కొనుగోలుకు పెద్దమొత్తంలో చెల్లించేందుకు అప్పటి ముగ్గురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తుండటం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు కమిటీలు ఎన్బీఏ కింద ఈ బాగోతంలో కమీషన్ల రూపంగా రూ.కోటికి పైగా చేతులు మారాయన్న ఆరోపణలపై విచారణ వేగవంతమైంది. మొదటి నుంచి మరుగుదొడ్లలో అవకతవకలపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్ సెప్టెంబర్ చివరి వారంలో ఏజేసీ వెంకటయ్య ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అంతకు ముందు కలెక్టర్ పంపిన నివేదికపై స్పందించిన ప్రభుత్వం ఇటీవలే విజిలెన్స్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇన్చార్జి రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ కె.సురేందర్ ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగినట్లు తెలిసింది. జిల్లాలో ఎన్బీఏ కింద ఎప్పుడు మరుగుదొడ్లకు నిధులు మంజూరయ్యాయి? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఐఎస్ఎల్ టూల్కిట్ల కోసం ‘ధనలక్షి’కి ఏయే తేదీల్లో ఎంత మొత్తంలో చెల్లించారు? టూల్కిట్ల సరఫరా నాటికి జిల్లాలో గ్రౌండింగైన మరుగుదొడ్ల సంఖ్య ఎంత? మరుగుదొడ్ల నిర్మాణం మొదలవక ముందే రూ.17.60 కోట్లు ఎందుకు చెల్లించారు? తదితర అంశాలపై విజిలెన్స్ ఆరా తీస్తుంది. మరుగుదొడ్డిని నిర్మించుకునే లబ్ధిదారుడే నేరుగా ఆన్లైన్ ద్వారా టూల్‌కిట్స్ కొనుగోలు చేయాలన్న నిబంధనలున్నా... ఎంపీడీవోలు ఎందుకు ‘ధనలక్ష్మి’ ద్వారా కొనుగోలు చేశారు? రూ.17.60 కోట్ల చెల్లింపుల వెనుక ఎవరెవరి ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయి? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. టూల్కిట్ల సరఫరాకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ బదిలీ కాగా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ పదోన్నతిపై బదిలీ అయ్యారు. జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి పదవీ విరమణ చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేయడంపైన విజిలెన్స్ అభ్యంతరం చెప్తూనే ఎంపీడీవోల పాత్రపైనా ఆరా తీస్తుంది. తమ పైఅధికారుల ఒత్తిళ్ల మేరకు చెల్లింపులు జరిపామని చెప్తున్నా తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన కొందరు ఎంపీడీవోల్లో కనిపిస్తుంది. -
దంపతులపై వేట కొడవళ్లతో దాడి
మహబూబ్‌నగర్ : జడ్చర్ల మండలం నాగసాలలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై ఆటోలో వచ్చిన నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. కొన ఊపిరితో ఉండటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, సుజాతగా గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.