తల్లి కళ్లెదుటే కన్న కొడుకుల పెనుగులాట
విడిపించేందుకు వెళ్లిన వృద్ధురాలినినెట్టేసిన కొడుకు
పిల్లలు చూస్తుండగానే ప్రాణం వదిలిన వైనం
పరిగి: గొడవ పడుతున్న కొడుకులను విడిపించేందుకు వెళ్లిన ఓ తల్లి ప్రాణం కోల్పోయింది. క్షణికావేశంతో మొదలైన చిన్నపాటి తగాదా ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరమ్మ (63)కు వెంకటయ్య, శ్రీను, సత్యమ్మ సంతానం. భర్త గతంలోనే మృతిచెందగా.. చిన్న కొడుకు శ్రీనుతో కలిసి ఉంటోంది. పెద్దకొడుకు వెంకటయ్య కుటుంబంతో సహా సమీపంలోని నజీరాబాద్ తండాలో జీవిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల శ్రీను అనారోగ్యం బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో అన్న వెంకటయ్యకు ఫోన్ చేసి.. మహ్మదాబాద్‌కు చెందిన పసుపుల మల్లయ్య వద్ద రూ.5 వేలు తీసుకురమ్మని చెప్పాడు. డబ్బులు తీసుకొచ్చిన వెంకటయ్య వాటిని తమ్ముడికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి భార్యతో కలిసి సయ్యద్‌మల్కాపూర్ వచ్చాడు. ఇదిలా ఉండగా అనారోగ్యం పాలైన తమ్ముడిని పరామర్శించేందుకు అక్క సత్యమ్మ సైతం వచ్చింది. అయితే రాత్రి వేళ అందరూ భోజనానికి సిద్ధమవుతుండగా.. అన్నదమ్ములిద్దరూ మద్యం తాగేందుకు కూర్చున్నారు.
కొద్దిసేపటి తర్వాత అక్క సత్యమ్మ తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వలేదని వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను తనను చూసేందుకు వచ్చిన అక్కను డబ్బులు అడుగుతావా అంటూ అన్నను నిలదీశాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. డబ్బు తెచ్చిస్తానని సత్యమ్మ చెప్పినా అన్నదమ్ముల వాగ్వాదం ఆగలేదు. ఈ క్రమంలో ఇద్దరూ పెనుగులాడుతూ ఇంటి ఎదురుగా ఉన్న సీసీ రోడ్డుపైకి చేరుకున్నారు. కొడుకులు కొట్టుకుంటున్నారని గాబరాపడిన తల్లి శంకరమ్మ.. ఇరువురినీ విడిపించే ప్రయత్నం చేసింది.
దీంతో సహనం కోల్పోయిన శ్రీను మధ్యలో నీవెందుకు వస్తున్నావంటూ తల్లిని తోసేయగా, సీసీ రోడ్డుపై పడిపోయింది. కుటుంబ సభ్యులు వచ్చి లేపేందుకు ప్రయత్నించగా చలనం కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లు 108కి ఫోన్ చేసి, అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment