బస్సును ఢీకొన్న లారీ | Larry collision to bus | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ

Published Thu, Nov 27 2014 11:02 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Larry collision to bus

ధారూరు: నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేరెళ్లి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓ సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 07 జెడ్ 4055) తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. నగరం నుంచి  తాండూర్‌లోని విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి ఓ లారీ (ఏపీ 09 వై 5448) వస్తోంది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్ వెంకటేశ్ అతి వేగంగా వాహనం నడుపుతున్నాడు.

ఉదయం 10.15 గంటల సమయంలో కేరెళ్లి గ్రామం సమీపంలో గాలి పోచమ్మ ఆలయ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంకటయ్య తీవ్రంగా హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. బస్సు డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతూ వాహనాన్ని ఎడమ వైపునకు మళ్లించాడు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ కుడివైపునకు రాంగ్‌రూట్లో వచ్చాడు. బస్సును సమీపించిన తరుణంలో హారన్‌కు ఉలిక్కిపడిన లారీ డ్రైవర్ వెంకటేశ్ ఒక్కసారిగా లారీని ఎడమ వైపునకు తీసుకున్నాడు.

ఈక్రమంలో లారీ వెనుకభాగం బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్‌లకు గాయాలయ్యాయి. బస్సు కుదుపునకు గురవడంతో ప్రయాణికులు 15 మంది ముందు సీట్లకు తగిలి స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం ప్రయాణికులు వేరే బస్సులో వెళ్లిపోయారు. బస్సు డ్రైవర్ వెంకటయ్య ధారూరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. లారీతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగభూషణం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement