Dharuru
-
మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుపైనే
అడవిదేవులపల్లి: కరోనా సోకిన ఓ యువకుడికి చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న మంచే ఐసోలేషన్ కేంద్రమైంది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. లాక్డౌన్ కారణంగా గ్రామానికి వచ్చిన అతడు స్థానిక ఐకేపీ కేంద్రంలో హమాలీ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కరోనాకు గురయ్యాడు. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉండడం, అందరికీ ఒకటే గది కావడంతో కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టకూడదని భావించాడు. ఇంటి ఆవరణలోనే ఉన్న ఓ చెట్టుపై మంచె ఏర్పాటు చేసుకుని, దానిపైనే నిద్రిస్తూ, సెల్ఫోన్లో పాటలు వింటూ, వీడియోలు చూస్తూ గడుపుతున్నాడు. మంచె మీద సరదాగా గడిచిపోతోందని, భయం దరిచేరక పోతే కరోనాతో పోరాడవచ్చని శివ అంటున్నాడు. చదవండి: అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం
ధారూరు రంగారెడ్డి : ఆగి ఉన్న బస్సును ఎక్కేందుకు వెళుతున్న ఓ వృద్ధురాలు బస్సు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి తాండూర్‌కు 45 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్డినరీ బస్సు కేరెళ్లి గ్రామ బస్టాప్‌లో ఆగింది. గ్రామంలోంచి బస్సు ఎక్కేందుకు మోమిన్‌ఖుర్దు గ్రామానికి చెందిన అల్లిపూరం అంతమ్మ(70) రోడ్డును క్రాస్ చేసి బస్సు ముందు నుంచి వెళుతుంది. డ్రైవర్ శ్రీనివాసులు రోడ్డు ముందుకు చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సు ముందున్న అంతమ్మను ఢీకొట్టిన బస్సు కొద్దిదూరం ఆమెను లాక్కెళ్లింది. బస్సులోని ప్రయాణికులు, బయట ఉన్న ప్రజలు బిగ్గరగా అరవడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. అప్పటికే వృద్ధురాలు అంతమ్మకు తీవ్ర గాయాలై చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంది. అదే గ్రామానికి చెందిన శివకుమార్‌రెడ్డి 108 వాహనానికి కాల్ చేయగా టైర్ పంక్చర్ అయ్యింది, రాలేకపోతున్నాని చెప్పి నిర్లక్ష్యంగా చెప్పి పెట్టేశాడని శివకుమార్‌రెడ్డి తెలిపారు. సకాలంలో అంతమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో వృద్ధురాలు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలింది. మోమిన్‌ఖుర్దు గ్రామానికి చెందిన అంతమ్మ తన కొడుకుతో కలిసి కేరెళ్లి గ్రామంలో ఉంటున్న బంధువు బుడ్డ మణెయ్య ఇంటికి బుధవారం రాత్రి వచ్చింది. గురువారం సొంత ఇంటికి వెళ్లేందుకు వస్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సంతోష్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ శ్రీనువాసులు సంఘటన స్థలం నుంచి పారీపోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వంట.. ఫుడ్ లేదు, పిల్లలూ లేరు..
ధారూరు వికారాబాద్ : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, తల్లులు, గర్భిణులకు ఇవ్వాల్సిన ఫుడ్డు, గుడ్డు లేకపోడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ ఆర్గనైజర్ వీరమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని నాగారం, దోర్నాల్, మదన్‌పల్లి, బానాపూర్, మదన్పల్లితండాల్లోని అంగన్వాడీ కేంద్రాలను చూసి ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. రికార్డుల్లో ఓ రకంగా, వాస్తవంగా మరోరకంగా ఉండడం, పిల్లలు, తల్లులు, గర్భిణులకు ప్రతీరోజు వండి పెట్టేందుకు ఆహార పదార్థాలు లేకపోయిన, వండి పెడుతున్నట్లు టీచర్లు చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రాకున్నా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. వండి తినబెడుతున్నామని చెప్పడం, వంట వండటం అనేది నీటిమీద రాతలనీ అక్కడే ఉన్న కొంతమంది చెప్పడంతో అబద్దాలు ఎందుకు చెబుతున్నారని ఆమె టీచర్లను నిలదీశారు. ఆహార పదార్థాలు ఇళ్లకు పంపిణీ చేసినట్లు ముందుగానే రికార్డుల్లో తల్లులు, గర్భిణుల సంతకాలు తీసుకోవడంతో ఆమె మండిపడ్డారు. నెలకు రెండుసార్లు ఇవ్వాల్సిన గుడ్లు ఇవ్వకున్నా ఇచ్చినట్లు సంతకాలు తీసుకోవడం తనిఖీల్లో బయటపడింది. సూపర్వైజర్ సుశీల తరుచూ తనిఖీ చేస్తున్నారా అంటే లేదనే సమాచారం. పంపిణీ చేసినట్లు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నిస్తే మౌనం వహించారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. వికారాబాద్ పీడీ, సూపర్వైజర్లు బాద్యతా రాహిత్యంతోనే అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తం అవుతున్నాయ ని ఆమె పేర్కొన్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలనీ ఉన్నతాధికారులకు నివేదిక పంపను న్నామన్నారు. మదన్‌పల్లితండాలో టీచరు, ఆయా లేకపోయిన ఉన్నట్లు అక్కడి వారు చెప్పడంపై ఆశ్చర్యానికి గురిచేసింది. అంగన్వాడిల్లో జరుగుతున్న అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించిన వివరాలు నమోదు చేసుకుని వెళ్లిపోయారు. -
గణపతి విగ్రహాల తయారీలో శిక్షణ
ధారూరు : ఆధునిక యంత్రాలతో గణపతి విగ్రహాలను తయారు చేయడానికి రాష్ట్ర అత్యంత వెనుకబడిన అభివృద్ధి సంస్థ (ఎంబీసీ కార్పొరేషన్) కుమ్మరులకు శిక్షణ ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎంపిక చేసిన కుమ్మరులకు యాదాద్రి జిల్లాలోని బూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్న జలాల్పూర్ స్వామి రామానందతీర్థ గ్రామీణ శిక్షణ సంస్థలో 5వ బ్యాచ్ కింద ఐదుగురు శిక్షణ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా కుమ్మరుల జర్నలిస్టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కే.వెంకటయ్య మాట్లాడుతూ గుజరాత్లో ఆధునిక యంత్రాలతో కుమ్మరులు గణపతి విగ్రహాలు, ప్రమిదలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా కొంతమందికి శిక్షణ ఇవ్వడానికి ఎంబీసీ సంస్థ చైర్మన్ తాడూరీ శ్రీనివాస్ ప్రత్యేక చొరత తీసుకున్నారన్నారు. అక్కడ శిక్షణ పొందిన కుమ్మరులు జిల్లాలోని మండలానికి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి మొత్తం 40 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూడా ఆధునిక యంత్రాలతో మట్టి గణపతులు, ప్రమిదలను తయారు చేసి వినాయక చవితికి సిద్ధం చేయనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వాప్తంగా 5 నుంచి 7 లక్షల వరకు గణపతి విగ్రహాలను ఆధునిక యంత్రాల సహాయంతో తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్గిస్తుందన్నారు. ఆధునిక యంత్రాల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మట్టి వినాయకుల విగ్రహాలు, ప్రమిదలను తయారు చేసే వీలుంటుందన్నారు. -
అమ్మను అడవిలో వదిలేసింది!
రంగారెడ్డి జిల్లాలో ఓ కూతురు నిర్వాకం ధారూరు: కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసిందో కూతురు. ఇంటికి రావొద్దని బెదిరించింది. దీంతో ఆ వృద్ధురాలు తిండిలేక.. కదలలేని స్థితిలో ధారూరు రైల్వేస్టేషన్లో పడి ఉంది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన వడ్డె బిచ్చమ్మ(75)కు ఐదుగురు కూతుళ్లు. నలుగురికి పెళ్లిళ్లయ్యాయి. మరో కూతురుకి వివాహం కావాల్సి ఉంది. పెద్ద కూతురు బాలమ్మకు ఇల్లరికం పెళ్లి చేసి కూతురు, అల్లుడును తనవద్దే ఉంచుకుంది. బాలమ్మ తల్లి బిచ్చమ్మకు చెందిన ఇంట్లో ఉంటూ ఆమెకున్న ఐదెకరాల పొలాన్ని అనుభవించడమే కాకుండా నెలనెలా వచ్చే పింఛన్‌ను కూడా తీసుకునేది. నెల రోజుల క్రితం బాల మ్మ తన తల్లిని ఇంట్లో ఉండవద్దని చెప్పి ఆమెను తీసుకెళ్లి తాండూరు రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లింది. బిచ్చమ్మ ఎలాగోలా తిరిగి ఇంటికి చేరింది. దీంతో బాలమ్మ, ఇద్దరు కుమారులు ఆదివారం ధారూరు రైల్వేస్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అక్కడి నుంచి ఆమె రైల్వేస్టేషన్‌కు చేరింది. అప్పటి నుంచి అన్నపానీయాలు లేకుండా అక్కడే పడి ఉంది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన రైల్వేస్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులు బాలమ్మ కుమారులకు ఫోన్‌చేసి విషయం చెబితే వారు ఆమెను తీసుకుపోవడానికి నిరాకరించారు. దీంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి రైల్వేస్టేషన్లోనే కూర్చొంది. -
‘కోట్’ కష్టాలు
- కాల్వలు శిథిలం.. ఆయకట్టుకు అందని నీరు - లక్ష్యం ఆయకట్టులో సగం కూడా పారని వైనం.. - నిలిచిపోయిన ‘జైకా’ నిధులు - ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం - అన్నదాతను ఆదుకోని ప్రాజెక్టు ధారూరు/ పెద్దేముల్ : తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని ధారూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన సుమారు 21 గ్రామాల ఆయకట్టుకు నీరందించేందుకు 1967 సెప్టెంబర్ 8న అప్పటి కేంద్ర గనుల శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో సాగు విస్తీర్ణ సామర్థ్యాన్ని 9,200 ఎకరాలుగా స్థిరీకరించారు. ధారూరు మండలంలోని ఎడమ కాల్వను 11 కిలోమీటర్ల పొడవు, 1.6 కి.మీ. పొడవుతో బేబీ కెనాల్‌ను నిర్మించారు. పెద్దేముల్ మండలంలోని 18 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో 24 కి.మీ. పొడవుతో కుడి కాల్వను నిర్మించారు. మొదట్లో ఈ కాల్వలు చివరి భూములకు సైతం నీరందించి పొలాలను సస్యశ్యామలం చేశాయి. కాలగమనంలో కాల్వలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం కుడి కాల్వ ద్వారా పొలాలకు సరిగ్గా అందడంలేదు. ఎడమ కాల్వ 4 కి.మీ. వరకే పరిమితమయ్యింది. ఇక బేబీ కెనాల్ సంగతి సరేసరి. ప్రస్తుతం మూడు కాల్వలు కలిసి 4 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నాయి. కాల్వలు శిథిలం కావడం, షట్టర్లను దొంగలెత్తుకెళ్లడం, నీరంతా తూముల్లోంచి బయటకు వెళ్లిపోవడం, కాల్వలకు గండ్లు పడి ఊటవాగు, మేకలోని వాడుకల ద్వారా కాగ్నాలో కలిసిపోతోంది. దీంతో యేటా పచ్చటి పొలాలు బీడులుగా మారుతున్నాయి. దీంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోతుండటంపై వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రూ.కోట్లు మట్టిపాలు.. ప్రతి యేటా కోట్‌పల్లి ప్రాజెక్టు కాల్వలకు ప్రభుత్వం రూ. కోట్లు కేటాయిస్తోంది. కానీ.. టెండర్ పనులు లేకుండా నామినేటెడ్ పనులు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్వినియోగమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 1996లో రూ. 57 లక్షలు కేటాయింపులు జరిగాయి. కానీ నాసిరకం పనులతో కాల్వలు సంవత్సరం తిరక్కుండానే యథాస్థితికి చేరాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రూ. లక్షల్లో మరమ్మతుల పేరిట నిధులు కేటాయిస్తున్న నాసిరకం పనులతో కాల్వలు బాగుపడటం లేదు. 2012, 13లలో రూ. 40 లక్షల చొప్పున కేటాయించినా.. కొంతమంది నాయకులు నిధులు కాజేసి.. పనులు తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. జైకా నిధుల జాడేదీ..? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రూ. 24.95 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు అప్పటి మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవ కారణంగా మంజూరయ్యాయి. కానీ రాష్ట్రం విడిపోవడంతో నిధులు విడుదల ఆగిపోయింది. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జైకా నిధులతో సంబంధం లేకుండా తాజాగా కాల్వల మరమ్మతుల కోసం ప్రభుత్వమే నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఎటువంటి ప్రయోజనం లేదు జిల్లాలో అతిపెద్ద నీటి ప్రాజెక్టు ఉన్నా రైతులకు ఎలాం టి ప్రయోజనం లేకుండాపోయింది. ప్రతి యేటా ప్ర భుత్వం కాల్వల మరమ్మతులకు రూ. కోట్లు ఇస్తున్నా.. ఆశయం నెరవేరడంలేదు. ఎకరా భూమి కూడా తడవడం లేదు. - రాములు, రైతు, మంబాపూర్ బీడులుగా చివరి భూములు ప్రాజెక్టు నిర్మించిన మొదట్లో కొన్ని సంవత్సరాలు చివరి భూములకు నీరందేది. గత 20 ఏళ్లుగా చుక్క నీరూ రావటం లేదు. పచ్చని పొలాలు బీడులుగా మారుతున్నాయి. - ప్రకాశం, రైతు, మంబాపూర్ -
మద్యం తాగొద్దన్నందుకు..
ధరూరు : నిత్యం మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నావని.. ఇలాగైతే సంసారం ఎలాగని ప్రశ్నించిన భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చాడు. స్థానికంగా తీవ్రసంచలనం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం మండలంలోని మార్లబీడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల మల్లేష్ మతిస్థితిమితం సరిగాలేని తన మేనమామ కూతురును వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కూతురు జన్మించింది. అల్లుడు తన కూతురును వేధింపులకు గురిచేస్తుండటంతో తండ్రి రెండేళ్లక్రితం తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఇదిలాఉండగా, ఏడునెలల క్రితం మరో వివాహం చేసుకునేందుకు మల్లేష్ పూనుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలో మొదటి భార్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒప్పందపత్రాన్ని రాయించుకుని రాయిచూర్ పట్టణంలోని జలాల్నగర్కు చెందిన లక్ష్మి(20)ని ఏడునెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆమెకు కట్నకానుకల కింద రెండు తులాల బంగారం, కొంతనగదు ఇచ్చారు. మల్లేష్ తాగుడుకు బానిసకావడంతో పలుమార్లు లక్ష్మి భర్తను మందలించినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యంమత్తులో ఉన్న మల్లేష్‌ను భార్య తాగొస్తే సంసారం ఎలా సాగుతుందని నిలదీసింది. తనకు ఇష్టమొచ్చినట్లు ఉంటానని లక్ష్మిపై దాడిచేశాడు. ఇంతలో కర్రతో తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాతపడింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య లక్ష్మి మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సోమవారం ఉదయం మల్లేష్ బంధువులు, ఇరుగుపొరుగువారు గమనించి విషయాన్ని రాయిచూర్‌లోని లక్ష్మి తల్లిదండ్రులకు తెలియజేశారు. రేవులపల్లి ఎస్ఐ అమ్జద్అలీ సంఘటనపై ఆరాతీశారు. సంఘటనకు కారణమైన భర్త మల్లేష్, అత్త మల్లమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అన్న నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బస్సును ఢీకొన్న లారీ
ధారూరు: నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లతో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేరెళ్లి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓ సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 07 జెడ్ 4055) తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. నగరం నుంచి తాండూర్లోని విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీకి ఓ లారీ (ఏపీ 09 వై 5448) వస్తోంది. నిద్ర మత్తులో ఉన్న లారీ డ్రైవర్ వెంకటేశ్ అతి వేగంగా వాహనం నడుపుతున్నాడు. ఉదయం 10.15 గంటల సమయంలో కేరెళ్లి గ్రామం సమీపంలో గాలి పోచమ్మ ఆలయ మలుపులో ఎదురుగా వస్తున్న లారీని గమనించిన బస్సు డ్రైవర్ వెంకటయ్య తీవ్రంగా హారన్ మోగించినా ఫలితం లేకుండా పోయింది. బస్సు డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతూ వాహనాన్ని ఎడమ వైపునకు మళ్లించాడు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ కుడివైపునకు రాంగ్రూట్లో వచ్చాడు. బస్సును సమీపించిన తరుణంలో హారన్‌కు ఉలిక్కిపడిన లారీ డ్రైవర్ వెంకటేశ్ ఒక్కసారిగా లారీని ఎడమ వైపునకు తీసుకున్నాడు. ఈక్రమంలో లారీ వెనుకభాగం బస్సు ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు కుదుపునకు గురవడంతో ప్రయాణికులు 15 మంది ముందు సీట్లకు తగిలి స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం ప్రయాణికులు వేరే బస్సులో వెళ్లిపోయారు. బస్సు డ్రైవర్ వెంకటయ్య ధారూరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. లారీతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగభూషణం తెలిపారు. -
పోలీసులపై కూలిన టెంట్
ధారూరు: మెథడిస్ట్ జాతర ఆవరణలో ఏర్పాటు చేసిన టెంట్ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పోలీసులపై కూలిపడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. స్టేషన్ ధారూరు సమీపంలోని మెథడిస్ట్ జాతర ఆవరణలో నిర్వాహకులు పోలీసుల కోసం ఓ టెంట్ ఏర్పాటు చేశారు. అందులో పోలీసులు సిగ్నలింగ్ కోసం ప్రత్యేకంగా టవర్ ఏర్పాటు చేసుకున్నారు. విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో భారీ వర్షంతో కూడిన గాలిరావడంతో టెంట్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనతో టెంట్ కింద ఉన్న పలువురు పోలీసులు భయాందోళనకు గురయ్యారు. టెంట్ కూలిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, లేకుంటే పెనుప్రమాదం జరిగేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో యాత్రికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
నిల్వ నీటిని తీసివేయాలి
ధారూరు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి పంటను దెబ్బ తీస్తుందని ధారూరు ఏడీఏ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పత్తి పొలాల్లో నిల్వ నీటిని వెంటనే తీసివేయాలని సూచించారు. నీరు నిల్వ ఉంటే పత్తికి తెగుళ్లు సోకుతాయని చెప్పారు. ఈ వర్షాల వల్ల ప్యారావిల్ట్, వేరుకుళ్లు తెగుళ్లు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. ఈ తెగుళ్ల నివారణకు కార్బండిజం, మ్యాంకోజెబ్ కలిపిన పౌడర్‌ను (స్టాఫ్ లేదా స్ప్రింట్) లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ముదురు ఆకులు పసుపు, ఎరుపు రంగుకు మారితే డీఏపీని లీటరు నీటికి 10 గ్రాములు లేదా యూరియాను లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంట బీమాకు ఈ నెల 30వ తేదీ ఆఖరు ఈ సంవత్సరం ఖరీఫ్‌లో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకుల తరఫున బీమా చేయలేరని ఏడీఏ చంద్రశేఖర్ తెలిపారు. రైతులంతా గ్రామం యూనిట్‌గా చేసుకుని మొక్కజొన్న పంటకు బీమా చేయించుకోవడానికి ప్రతిపాదన ఫారాన్ని వీఆర్ఓ సంతకంతో నేరుగా బ్యాంకులో గానీ పీఏసీఎస్‌లో చెల్లించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
‘కోటి’ఆశలు గల్లంతు!.
ధారూరు/పెద్దేముల్: జిల్లాకే తలమానికం కోట్‌పల్లి ప్రాజెక్టు. రెండు మండలాల్లోని 19 గ్రామాల పరిధిలోని ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కోట్‌పల్లి’.. ఈ ఏడాది చుక్కనీరు చేరక వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రాజెక్టులోకి నామమాత్రపు నీరు చేరకపోవడంతో రైతులు సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. మూడేళ్ల నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం లేదు. దీంతో పూర్తిస్థాయి ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. ఈ ఏడాదిలో జూన్, జూలై, ఆగస్టు మొదటి వారం వరకు రైతులు వర్షాలకోసం ఎదురుచూశారు. కానీ ఆశాజనకంగా వర్షాలు పడలేదు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టుకింది రైతులు మెట్టపంటలే సాగు చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు లక్ష్యం 9,200ఎకరాలు. ప్రధాన కుడికాల్వ తూము ద్వారా 7,200, ఎడమ, బేబీ కెనాల్ ద్వారా రెండు వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. కానీ క్రమేపీ తగ్గుతూ వస్తున్న ఆయకట్టు ప్రస్తుతం ఐదు నుంచి ఆరు వేలకే పరిమితమైంది. ప్రభుత్వం యేటా కాల్వల మరమ్మతుల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఎకరా ఆయకట్టు కూడా పెరగకపోగా తగ్గుతూ వస్తోం ది. కాల్వలు, తూములు సరిగాలేక పొలాలకు సాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. పెద్దేముల్, ధారూ రు మండలాల్లోని జనగాం, మంబాపూర్, రేగొండి, రుక్మాపూర్, బండమీదిపల్లి, మారేపల్లితండా, బూర్గుగడ్డ, రుద్రారం, నాగసముందర్, అల్లాపూర్, గట్టేపల్లి గ్రామాల్లోని ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. పేరుకే పెద్ద ప్రాజెక్టు తప్ప.. ఎలాంటి ప్రయోజనమూ ఉండడంలేదని రైతులు వాపోతున్నారు. 75శాతం నీరువస్తేనే ఖరీఫ్‌కు అవకాశం ఆగస్టు చివరినాటికి ప్రాజెక్టులోకి 75శాతం మేర నీరు(18 అగుగులు) వస్తేనే ఖరీఫ్ పంటలకు నీరు విడుదలచేసే వీలుందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం మూడు అడుగుల మేరకే నీటి నిలువ ఉంది. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ వరకు 11.5 అడుగుల నీరు నిల్వఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కుడి కాలువ గేర్‌బాక్సు పగిలి రెండేళ్లు.. రెండేళ్ల క్రితం ప్రాజెక్టు కుడి కాలువ తూముకున్న రెండు గేర్‌బాక్సుల్లో ఎడమవైపు గేర్‌బాక్సు పగిలింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ ద్వారా దీనికి మరమ్మతులు చేయించారు. కానీ తిరిగి నెల రోజులు గడవకముందే పగిలింది. దీనికి మరమ్మతులు చేయించాలని 2013లో ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన అప్పటి చేనేత, జౌళి శాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్, ప్రస్తుత రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డిలకు రైతులు విన్నవించారు. వెంటనే స్పందించిన వారు అధికారులతో అక్కడే మాట్లాడి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అది అమలు కాలేదు. ప్రాజెక్టు మరమ్మతులకు జైకా నిధులు రూ.20కోట్లు రానున్నాయని అప్పట్లో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఆ నిధుల జాడలేదు. ప్రస్తుతం కుడి కాలువ తూము ద్వారా నీరు ఒకే గేర్‌బాక్సు నుంచి సరఫరా అవుతుంది. దీంతో ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా చేరడం లేదు. ప్రాజెక్టులోకి నీరుచేరితే మరమ్మతులు చేయించే వీలుండదు. వలసలు తప్పవా? కోట్‌పల్లి ప్రాజెక్టుపై ఆధారపడి జీవిస్తున్న 19 గ్రామాల పరిధి రైతులు మూడేళ్లుగా మెట్ట పంటలతో సరిపెట్టుకుంటున్నారు. సరైన దిగుబడులురాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఆయకట్టు పరిధి రైతు కుటుంబాలకు వలసలు తప్పేలా లేవు. ఇప్పటికే తండాల్లోని గిరిజనులు కుటుంబాలతో వలస వెళ్లారు. -
ఏసీబీ కలకలం!
ధారూరు: గ్రామాల్లో ప్రతి చిన్నపనికీ సర్పంచ్‌లు అంతోఇంతో డిమాండ్ చేస్తూ ఉంటారు. పని త్వరగా పూర్తి కావడం కోసం ప్రజలు కూడా ‘సమర్పించు’కోక తప్పని పరిస్థితి. రేషన్ కార్డుకు, పింఛన్ నమోదుకు, వివిధ రకాల సర్టిఫికెట్లకు చేసుకునే దరాఖస్తులపై సంతకాల చేసేందుకు మామూళ్ల కోసం సర్పంచ్‌లు చేయి చాస్తుంటారు. ఇక నుంచి అలా డబ్బులు తీసుకునేటప్పుడు సర్పంచ్‌లతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆలోచించాల్సిన పరిస్థితిని ఈ ఘటన కల్పించింది. లంచం తీసుకుంటూ ఓ సర్పంచ్ ఏసీబీ అధికారులకు పట్టుబడడం ధారూరు మండలంలో బుధవారం సంచలనం రేపింది. ఎక్కడ నలుగురు కూడినా ఈ అంశంపై చర్చించుకుంటూ కనిపించారు. సర్పంచ్ ఏసీబీకి పట్టుబడడంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు రేగింది. ఇన్నాళ్లు ఏసీబీ అధికారులు కేవలం ప్రభుత్వ అధికారులను మాత్రమే పట్టుకుంటారని భావించిన వారు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. నాగారం గ్రామానికి చెందిన మొగిలి కృష్ణారెడ్డి గ్రామంలోని వాటర్ ట్యాంకు దగ్గరి నుంచి పరిగి రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం మార్చి నెలలో పంచాయతీ నుంచి తీర్మానం తీసుకున్నాడు. దానిపై సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ సంతకం చేయాల్సి ఉంది. అందుకు ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 25వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం కృష్ణారెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం బుధవారం కృష్ణారెడ్డి.. సర్పంచ్ మరిది రాంకృష్ణయ్యగౌడ్కు డబ్బులివ్వడంతో ఆయన తీసుకెళ్లి సర్పంచ్‌కు ఇచ్చాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు సర్పంచ్‌తోపాటు ఆమె మరిదిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ తీర్మానం ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్నట్లు సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ అంగీకరించారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. కాగా ‘అందరి సర్పంచ్ల మాదిరిగా నేను డబ్బులు తీసుకున్న. ఇందులో తప్పేంముంది’ అని సర్పంచ్ తమను ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి ఏసీబీకి చిక్కడం ఇదే మొదటిసారి.. ప్రజాప్రతినిధులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల లాగే ప్రజా ప్రతినిధులు కూడా ప్రజా సేవకులని, వారు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులై అవినీతికి పాల్పడిన వారిపై తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారి వివరాలు చెబితే దాడులు జరుపుతామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజు, వెంకట్‌రెడ్డి, సునీల్, లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. -
వృథా.. వ్యధ
ధారూరు, న్యూస్‌లైన్: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు గత వర్షాకాలంలో పూర్తిగా నిండటంతో ధారూరు, పెద్దేముల్ మండలాల రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ప్రాజెక్టుకు తగిన మరమ్మతులు లేక పొలాలకు వదిలిన నీళ్లు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్టు కింద 9,200 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఆరువేల ఎకరాలకే అందుతోంది. ఈ ప్రాజెక్టుకు బేబీ కెనాల్‌తో పాటు కుడి, ఎడమ కాల్వలున్నాయి. 1967లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. కాల్వలు శిథిలమై, లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టులోని నీరు వృథాగా బయటకి వెళ్తున్నాయి. ప్రాజెక్టును నిర్మించి 47 ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ చివరి భూములకు నీరందడం లేదు. మండలంలోని రుద్రారం, గట్టెపల్లితండా, రాంపూర్ తండా మీదుగా 11 కిలో మీటర్ల పొడవుతో ఎడమ కాల్వను నిర్మించారు. కాల్వ లో మూడు చోట్ల పెద్ద పెద్ద లీకేజీలు ఏర్పడి సగం నీరు వృ థాగా కాగ్నా నదిలో కలిసిపోతోంది. ఈ నీళ్లు సద్వినియోగమైతే దాదాపు 400 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ కాల్వ పరిధిలో 1,120 ఎకరాలకు నీరందాల్సి ఉండగా ప్రస్తుతం 600ల ఎకరాలకు కూడా అందడం లేదు. వృథా నీటిని అరికట్టేందుకు లీకేజీలను సరి చేయాలని నాలుగు దశాబ్దాలుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాల్వ తూము వద్దే లీకేజీలు.. ప్రాజెక్టు వెనుక భాగంలో నిర్మించిన ఎడమ కాల్వ తూము లోపభూయిష్టంగా ఉండటంతో పొలాలకు నీరందడం లేదు. తూము నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు నీరు వృథా అవుతోంది. తూముకు రంధ్రాలు పడి, లీకేజీలు ఏర్పడినా మరమ్మతులు చేపట్టకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి ఏటా రూ.లక్షల్లో నిధులు కేటాయించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేపడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుడి కాల్వ పరిస్థితీ అంతే.. మండల పరిధిలోని నాగసమందర్, అల్లాపూర్ గ్రామాలతో పాటు పెద్దేముల్ మండలంలోని 7,720 ఎకరాలకు కుడి కాల్వ ద్వారా పొలాలకు నీరు చేరాలి. కాల్వ శిథిలావస్థకు చేరడంతో అధిక మొత్తంలో నీరు వృథా అవుతోందని రైతులు వాపోతున్నారు. కాల్వ పొడవు 24 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు 8 నుంచి 10 వరకు లీకేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. కాల్వల్లో ఏర్పాటు చేసిన షెట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వృథా నీటిని అరికడితే దాదాపు 3 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంటుందంటున్నారు. బూరుగు గడ్డ ప్రాంతంలోని 360 ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన 1.6 కిలో మీటర్ల పొడవైన బేబీ కెనాల్ కూడా పాడై నీరు వృథాగా నాగసమందర్ సమీపంలోని ఊట వాగులో కలుస్తోంది. ఈ విషయం ప్రాజెక్టు గ్యాంగ్మెన్లకు, సాగునీటి శాఖ డీఈ, ఈఈలకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాకుంటే తామేం చేస్తామని సిబ్బంది చేతులు దులు పుకొంటున్నారు. ‘జైకా’ నిధులు వచ్చేనా? జైకా నిధులు (జపాన్ దేశం నుంచి) రూ. 20 కోట్లు వస్తేనే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టే వీలుంటుందని రైతులు పేర్కొంటున్నారు. నిధులు మంజూరయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా ఇంతవరకు పనుల జాడే లేదంటున్నారు. ఈ రబీ సీజన్లోనే పనులను ప్రారంభించి పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. -
పసుపు రైతుకు ప్రతి ఏటా నష్టాలే!
ధారూరు, న్యూస్‌లైన్: ఒకప్పుడు తులం బంగారానికి వచ్చిన ధర క్వింటాలు పసుపునకు వచ్చిందని, మళ్లీ ఆ మద్దతు ధర రాకపోతుందా.. అనే ఆశతో ప్రతీ సంవత్సరం పసుపు పంటను సాగు చేస్తున్నా నష్టాలే తప్పలాభాలు రావటం లేదని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో మండలంలోని పలు గ్రామాల రైతులు యేటా పసుపును సాగు చేస్తూనే ఉన్నారు. కేవలం 2010లో క్వింటాలు పసుపునకు రూ.18 వేల నుంచి రూ.19,500 వరకు మద్దతు ధర పలికింది. అప్పటి నుంచి రైతులు పెద్ద మొత్తంలో పసుపును పండిస్తున్నా 2011 నుంచి ఇప్పటివరకు ధర త గ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు లే వని రైతులు వాపోతున్నారు. మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ధర్మాపూర్, కొండాపూర్‌కలాన్, అవుసుపల్లి, ధారూరు, చింతకుంట, హరిదాస్‌పల్లి, అల్లిపూర ఎబ్బనూర్, బాచారం తదితర గ్రామాల్లో రైతులు దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో పసుపుపంట పండిస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలనే చవిచూస్తున్నారు. పసుపు పంట సాగు చేసిన రైతన్నలు ఎకరాకు రూ.60 వేల పెట్టుబడి పెడుతున్నా అమ్మకానికి మార్కెట్‌కు వెళితే మాత్రం క్వింటాలుకు రూ. 5,200 నుంచి రూ.6 వేల వరకే మద్దతు ధర పలకడంతో పెట్టుబడులు పోను చేతికి చిల్లిగవ్వ కూడా రాకపోగా నష్టాలే వస్తున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా బహిరంగ మార్కెట్లో మద్దతు ధర రాకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమ దీన స్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు పొలాల పక్కనే పారుతున్న నది, వాగుల నుంచి డీజిల్ మోటార్ల ద్వారా నీటిని వాడటంవల్ల వేలల్లో ఖర్చవుతుందని రైతులు వాపోవున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడమే ప్రధాన కారణమని రైతులు పేర్కొన్నారు. ఒక తడికి ఎకరాకు డీజిల్ ఖర్చు రూ.5 నుంచి రూ.6 వేల వరకు అవుతుందన్నారు. కనీసం 4, 5 తడుల నీరు పెట్టాలని, ఇందుకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. 20 రోజుల పాటు కష్టాలే.. పంట చివరి దశలో 20 రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుందని రైతులు పేర్కొన్నారు. పొలాన్ని దున్ని పసుపును వెలికి తీయడంతో పాటు ఉడికించడం, కొమ్ము, గొండలు వేరు చేయడం వంటి పనులు ఉంటాయన్నారు. పెద్ద మొత్తంలో కూలీలు అవసరవువుతారని, వారికి దినసరికూలి రూ.200 చొప్పున ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత ఖర్చు చేసినా పసుపుకొమ్ములను ఆరబెడితే ప్రస్తుతం అకాల వర్షాలు పసుపుకొమ్ముల రంగు మారడానికి కారణవువుతుందని వాపోతున్నారు. దీంతో ధర మరింత తగ్గి నష్టాలనే చవి చూస్తున్నామన్నారు. పసుపు రైతుల బాధలు గమనించి క్వింటాలుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మద్దతు ధర లభించేలా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు. -
‘ఉపాధి’ బకాయిలు రూ.1.60 కోట్లు
ధారూరు, న్యూస్‌లైన్: మండలంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు డబ్బులు అందక నానా పాట్లు పడుతున్నారు. దాదాపు 25 గ్రామ పంచాయతీల పరిధిలో 7 నుంచి 8 వేల మంది కూలీలు ఈ పథకం కింద పనులు చేస్తున్నారు. వేసవి కాలంలో వ్యవసాయ పనులు అంతగా లేకపోవడం, సమీప పట్టణాలకు కూలీ పనులు చేసేందుకు వెళ్తున్నా ఓ రోజు పని దొరకడం, మరో రోజు దొరక్కపోవడంతో ఉపాధి పనుల చేయుడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉపాధి పనుల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారంతా ఫీల్డ్ అసిస్టెంట్ సూచించిన పొలానికి వెళ్లి పనులు చేస్తున్నారు. రెండు నెలల నుంచి కేరెల్లి గ్రామ కూలీలు రూ.1.60 కోట్ల విలువైన పనులు చేసి జిల్లాలో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇంత కష్టపడినా తమకు కూలీ డబ్బులు ఇవ్వడం లేదుని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధన అంటూ డబ్బులు రాకుండా చేశారని చెప్పారు. రెండు నెలలుగా ఇంటి అవసరాలకు డబ్బులు అందక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయమై ఏపీఓ వై.శ్రీనును వివరణ కోరగా డబ్బులు రానిదే నిజమేనని, రూ.1.60 కోట్ల బకాయలున్నాయని చెప్పారు. వారం రోజుల డబ్బులు వచ్చినట్లు ఆదివారం తమకు సమాచారం వచ్చిందని, దశల వారీగా మిగిలిన డబ్బులన్నీ వస్తాయని ఆయన వివరించారు.