ధారూరు, న్యూస్‌లైన్: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు గత వర్షాకాలంలో పూర్తిగా నిండటంతో ధారూరు, పెద్దేముల్ మండలాల రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ప్రాజెక్టుకు తగిన మరమ్మతులు లేక పొలాలకు వదిలిన నీళ్లు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్టు కింద 9,200 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఆరువేల ఎకరాలకే అందుతోంది. ఈ ప్రాజెక్టుకు బేబీ కెనాల్‌తో పాటు కుడి, ఎడమ కాల్వలున్నాయి. 1967లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. కాల్వలు శిథిలమై, లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టులోని నీరు వృథాగా బయటకి వెళ్తున్నాయి.
ప్రాజెక్టును నిర్మించి 47 ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ చివరి భూములకు నీరందడం లేదు. మండలంలోని రుద్రారం, గట్టెపల్లితండా, రాంపూర్ తండా మీదుగా 11 కిలో మీటర్ల పొడవుతో ఎడమ కాల్వను నిర్మించారు. కాల్వ లో మూడు చోట్ల పెద్ద పెద్ద లీకేజీలు ఏర్పడి సగం నీరు వృ థాగా కాగ్నా నదిలో కలిసిపోతోంది. ఈ నీళ్లు సద్వినియోగమైతే దాదాపు 400 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ కాల్వ పరిధిలో 1,120 ఎకరాలకు నీరందాల్సి ఉండగా ప్రస్తుతం 600ల ఎకరాలకు కూడా అందడం లేదు. వృథా నీటిని అరికట్టేందుకు లీకేజీలను సరి చేయాలని నాలుగు దశాబ్దాలుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడమ కాల్వ తూము వద్దే లీకేజీలు..
ప్రాజెక్టు వెనుక భాగంలో నిర్మించిన ఎడమ కాల్వ తూము లోపభూయిష్టంగా ఉండటంతో పొలాలకు నీరందడం లేదు. తూము నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు నీరు వృథా అవుతోంది. తూముకు రంధ్రాలు పడి, లీకేజీలు ఏర్పడినా మరమ్మతులు చేపట్టకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి ఏటా రూ.లక్షల్లో నిధులు కేటాయించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేపడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కుడి కాల్వ పరిస్థితీ అంతే..
మండల పరిధిలోని నాగసమందర్, అల్లాపూర్ గ్రామాలతో పాటు పెద్దేముల్ మండలంలోని 7,720 ఎకరాలకు కుడి కాల్వ ద్వారా పొలాలకు నీరు చేరాలి. కాల్వ శిథిలావస్థకు చేరడంతో అధిక మొత్తంలో నీరు వృథా అవుతోందని రైతులు వాపోతున్నారు. కాల్వ పొడవు 24 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు 8 నుంచి 10 వరకు లీకేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. కాల్వల్లో ఏర్పాటు చేసిన షెట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వృథా నీటిని అరికడితే దాదాపు 3 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంటుందంటున్నారు.
బూరుగు గడ్డ ప్రాంతంలోని 360 ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన 1.6 కిలో మీటర్ల పొడవైన బేబీ కెనాల్ కూడా పాడై నీరు వృథాగా నాగసమందర్ సమీపంలోని ఊట వాగులో కలుస్తోంది. ఈ విషయం ప్రాజెక్టు గ్యాంగ్‌మెన్‌లకు, సాగునీటి శాఖ డీఈ, ఈఈలకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాకుంటే తామేం చేస్తామని సిబ్బంది చేతులు దులు పుకొంటున్నారు.
‘జైకా’ నిధులు వచ్చేనా?
జైకా నిధులు (జపాన్ దేశం నుంచి) రూ. 20 కోట్లు వస్తేనే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టే వీలుంటుందని రైతులు పేర్కొంటున్నారు. నిధులు మంజూరయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా ఇంతవరకు పనుల జాడే లేదంటున్నారు. ఈ రబీ సీజన్‌లోనే పనులను ప్రారంభించి పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
వృథా.. వ్యధ
Published Sun, May 25 2014 12:18 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement