Kotpalli project
-
కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి రోజు బోటింగ్
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఇకనుంచి ప్రతి రోజు పర్యాటకులకు బోటింగ్ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులోకి 19 అడుగుల వరకు వర్షపునీరు చేరడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు రోజు రావడంతో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో భారీగా నీరుందని కొంతమంది గాలాలతో చేపలు పడుతున్నారు. యువతీ, యువకులు నీటిలో ఈత కొట్టడం, పాటలు పాడతూ, డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు యువకులు ఈ ప్రాంతంలో ఓ షార్ట్ ఫిలీంలో బాగంగా ఓ పాటను పూర్తి చేశారు. -
కోట్‌పల్లికి వరద నీరు
ప్రాజెక్టులోకి 16.5 అడుగుల మేర నీరు చేరిక ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు నీటి మట్టం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం మరో రెండు అడుగుల నీటి మట్టం పెరిగింది. మూడు రోజులుగా కురస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 16.5 అడుగుల వరకు నీరు చేరింది. ఈ ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 24 అడుగులు. మరో 7.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు నిండిపోతుంది. రెండు సంవత్సరం క్రితం 20 అడుగుల మేర నీరు చేరింది. ఈ తర్వాత ఇదే గరిష్ట నీటి మట్టం. రోజురోజుకు ప్రాజెక్టులోకి నీరు వస్తుండంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘కోట్’ కష్టాలు
- కాల్వలు శిథిలం.. ఆయకట్టుకు అందని నీరు - లక్ష్యం ఆయకట్టులో సగం కూడా పారని వైనం.. - నిలిచిపోయిన ‘జైకా’ నిధులు - ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం - అన్నదాతను ఆదుకోని ప్రాజెక్టు ధారూరు/ పెద్దేముల్ : తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని ధారూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన సుమారు 21 గ్రామాల ఆయకట్టుకు నీరందించేందుకు 1967 సెప్టెంబర్ 8న అప్పటి కేంద్ర గనుల శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పట్లో సాగు విస్తీర్ణ సామర్థ్యాన్ని 9,200 ఎకరాలుగా స్థిరీకరించారు. ధారూరు మండలంలోని ఎడమ కాల్వను 11 కిలోమీటర్ల పొడవు, 1.6 కి.మీ. పొడవుతో బేబీ కెనాల్‌ను నిర్మించారు. పెద్దేముల్ మండలంలోని 18 గ్రామాలకు నీరందించే లక్ష్యంతో 24 కి.మీ. పొడవుతో కుడి కాల్వను నిర్మించారు. మొదట్లో ఈ కాల్వలు చివరి భూములకు సైతం నీరందించి పొలాలను సస్యశ్యామలం చేశాయి. కాలగమనంలో కాల్వలను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం కుడి కాల్వ ద్వారా పొలాలకు సరిగ్గా అందడంలేదు. ఎడమ కాల్వ 4 కి.మీ. వరకే పరిమితమయ్యింది. ఇక బేబీ కెనాల్ సంగతి సరేసరి. ప్రస్తుతం మూడు కాల్వలు కలిసి 4 వేల ఎకరాలకు మాత్రమే నీరందిస్తున్నాయి. కాల్వలు శిథిలం కావడం, షట్టర్లను దొంగలెత్తుకెళ్లడం, నీరంతా తూముల్లోంచి బయటకు వెళ్లిపోవడం, కాల్వలకు గండ్లు పడి ఊటవాగు, మేకలోని వాడుకల ద్వారా కాగ్నాలో కలిసిపోతోంది. దీంతో యేటా పచ్చటి పొలాలు బీడులుగా మారుతున్నాయి. దీంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోతుండటంపై వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రూ.కోట్లు మట్టిపాలు.. ప్రతి యేటా కోట్‌పల్లి ప్రాజెక్టు కాల్వలకు ప్రభుత్వం రూ. కోట్లు కేటాయిస్తోంది. కానీ.. టెండర్ పనులు లేకుండా నామినేటెడ్ పనులు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో దుర్వినియోగమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. 1996లో రూ. 57 లక్షలు కేటాయింపులు జరిగాయి. కానీ నాసిరకం పనులతో కాల్వలు సంవత్సరం తిరక్కుండానే యథాస్థితికి చేరాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రూ. లక్షల్లో మరమ్మతుల పేరిట నిధులు కేటాయిస్తున్న నాసిరకం పనులతో కాల్వలు బాగుపడటం లేదు. 2012, 13లలో రూ. 40 లక్షల చొప్పున కేటాయించినా.. కొంతమంది నాయకులు నిధులు కాజేసి.. పనులు తూతూమంత్రంగా చేసి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. జైకా నిధుల జాడేదీ..? జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రూ. 24.95 కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు అప్పటి మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవ కారణంగా మంజూరయ్యాయి. కానీ రాష్ట్రం విడిపోవడంతో నిధులు విడుదల ఆగిపోయింది. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జైకా నిధులతో సంబంధం లేకుండా తాజాగా కాల్వల మరమ్మతుల కోసం ప్రభుత్వమే నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఎటువంటి ప్రయోజనం లేదు జిల్లాలో అతిపెద్ద నీటి ప్రాజెక్టు ఉన్నా రైతులకు ఎలాం టి ప్రయోజనం లేకుండాపోయింది. ప్రతి యేటా ప్ర భుత్వం కాల్వల మరమ్మతులకు రూ. కోట్లు ఇస్తున్నా.. ఆశయం నెరవేరడంలేదు. ఎకరా భూమి కూడా తడవడం లేదు. - రాములు, రైతు, మంబాపూర్ బీడులుగా చివరి భూములు ప్రాజెక్టు నిర్మించిన మొదట్లో కొన్ని సంవత్సరాలు చివరి భూములకు నీరందేది. గత 20 ఏళ్లుగా చుక్క నీరూ రావటం లేదు. పచ్చని పొలాలు బీడులుగా మారుతున్నాయి. - ప్రకాశం, రైతు, మంబాపూర్ -
‘కోటి’ఆశలు గల్లంతు!.
ధారూరు/పెద్దేముల్: జిల్లాకే తలమానికం కోట్‌పల్లి ప్రాజెక్టు. రెండు మండలాల్లోని 19 గ్రామాల పరిధిలోని ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కోట్‌పల్లి’.. ఈ ఏడాది చుక్కనీరు చేరక వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రాజెక్టులోకి నామమాత్రపు నీరు చేరకపోవడంతో రైతులు సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. మూడేళ్ల నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం లేదు. దీంతో పూర్తిస్థాయి ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. ఈ ఏడాదిలో జూన్, జూలై, ఆగస్టు మొదటి వారం వరకు రైతులు వర్షాలకోసం ఎదురుచూశారు. కానీ ఆశాజనకంగా వర్షాలు పడలేదు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టుకింది రైతులు మెట్టపంటలే సాగు చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు లక్ష్యం 9,200ఎకరాలు. ప్రధాన కుడికాల్వ తూము ద్వారా 7,200, ఎడమ, బేబీ కెనాల్ ద్వారా రెండు వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. కానీ క్రమేపీ తగ్గుతూ వస్తున్న ఆయకట్టు ప్రస్తుతం ఐదు నుంచి ఆరు వేలకే పరిమితమైంది. ప్రభుత్వం యేటా కాల్వల మరమ్మతుల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఎకరా ఆయకట్టు కూడా పెరగకపోగా తగ్గుతూ వస్తోం ది. కాల్వలు, తూములు సరిగాలేక పొలాలకు సాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. పెద్దేముల్, ధారూ రు మండలాల్లోని జనగాం, మంబాపూర్, రేగొండి, రుక్మాపూర్, బండమీదిపల్లి, మారేపల్లితండా, బూర్గుగడ్డ, రుద్రారం, నాగసముందర్, అల్లాపూర్, గట్టేపల్లి గ్రామాల్లోని ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. పేరుకే పెద్ద ప్రాజెక్టు తప్ప.. ఎలాంటి ప్రయోజనమూ ఉండడంలేదని రైతులు వాపోతున్నారు. 75శాతం నీరువస్తేనే ఖరీఫ్‌కు అవకాశం ఆగస్టు చివరినాటికి ప్రాజెక్టులోకి 75శాతం మేర నీరు(18 అగుగులు) వస్తేనే ఖరీఫ్ పంటలకు నీరు విడుదలచేసే వీలుందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం మూడు అడుగుల మేరకే నీటి నిలువ ఉంది. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ వరకు 11.5 అడుగుల నీరు నిల్వఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కుడి కాలువ గేర్‌బాక్సు పగిలి రెండేళ్లు.. రెండేళ్ల క్రితం ప్రాజెక్టు కుడి కాలువ తూముకున్న రెండు గేర్‌బాక్సుల్లో ఎడమవైపు గేర్‌బాక్సు పగిలింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ ద్వారా దీనికి మరమ్మతులు చేయించారు. కానీ తిరిగి నెల రోజులు గడవకముందే పగిలింది. దీనికి మరమ్మతులు చేయించాలని 2013లో ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన అప్పటి చేనేత, జౌళి శాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్, ప్రస్తుత రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డిలకు రైతులు విన్నవించారు. వెంటనే స్పందించిన వారు అధికారులతో అక్కడే మాట్లాడి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అది అమలు కాలేదు. ప్రాజెక్టు మరమ్మతులకు జైకా నిధులు రూ.20కోట్లు రానున్నాయని అప్పట్లో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఆ నిధుల జాడలేదు. ప్రస్తుతం కుడి కాలువ తూము ద్వారా నీరు ఒకే గేర్‌బాక్సు నుంచి సరఫరా అవుతుంది. దీంతో ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా చేరడం లేదు. ప్రాజెక్టులోకి నీరుచేరితే మరమ్మతులు చేయించే వీలుండదు. వలసలు తప్పవా? కోట్‌పల్లి ప్రాజెక్టుపై ఆధారపడి జీవిస్తున్న 19 గ్రామాల పరిధి రైతులు మూడేళ్లుగా మెట్ట పంటలతో సరిపెట్టుకుంటున్నారు. సరైన దిగుబడులురాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఆయకట్టు పరిధి రైతు కుటుంబాలకు వలసలు తప్పేలా లేవు. ఇప్పటికే తండాల్లోని గిరిజనులు కుటుంబాలతో వలస వెళ్లారు. -
సాగునీరు సాగేదెలా..
ధారూరు: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతూ వస్త్తోంది. 9200 ఎకరాల ఆయకట్టు గల ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కేవలం 6 నుంచి 7 వేల ఎకరాలకే పరిమితమైంది. కాల్వలు సరిగా లేక, తూములు పనిచేయక పంట పొలాలకు సాగునీటి సరఫరా పశ్నార్థకమైంది. కుడికాల్వ తూముకున్న రెండు గేర్‌బాక్సుల్లో ఎడమవైపు ఉన్న ఓ గేర్‌బాక్సు పగిలిపోయి రెండు సంవత్సరాలైంది. 2013లో ప్రాజెక్టుకు వచ్చిన అప్పటి రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్‌కు రైతులు దీనిపై ఫిర్యాదు చేశారు. జపాన్నుంచి జైకా నిధులు రూ. 20 కోట్లు రానున్నాయని, వీటితో అన్ని రకాల మరమ్మతులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మత్తుల విషయంలో తగిని చొరవ తీసుకుంటేనే సాధ్యమని రైతులు పేర్కొంటున్నారు. కుడికాల్వ తూముకు ఎడమవైపు పగిలిపోయిన గేర్బాక్సుకు మరమ్మతు చేయించాలని పలుమార్లు నీటిపారుదలశాఖ వికారాబాద్ ఈఈ, తాండూర్ డీఈ, కోట్‌పల్లి ప్రాజెక్టు ఏఈ, సిబ్బందికి పలుమార్లు రైతులు మొరపెట్టుకున్నారు. ఇదిగో చేయిస్తాం, అదిగో చేయిస్తాం అంటూ రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. కుడివైపు ఉన్న ఒక్క గేర్బాక్సుతోనే పంటపొలాలకు నీరు వదులుతుతున్నారు. ఆ గేర్‌బాక్సు కూడా పాడైందంటే దీనికింద ఉన్న దాదాపు 6500 ఎకరాల భూములకు నీటి సరఫరా పూర్తిగా స్తంభించిపోతుంది. ప్రాజెక్టు నిండిపోయిన వేళల్లో మరమ్మతు చేయడానికి వీలుండదని, యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లో బాగుచేయిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని సాగునీటి సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదంలో ఎడమకాల్వ తూము ఎడమ కాల్వ తూము ప్రమాద స్థాయికి చేరిందని రైతులు వాపోతున్నారు. ఎడమ కాల్వ తూముకు ఏర్పాటు చేసిన గేర్‌రాడ్ వంగిపోవడం, ఎడమ కాల్వలో మట్టి పేరుపోవడంతో నీటి సరఫరాలో ఆటంకం కలుగుతోంది. తూము గేర్రాడ్ను వెంటనే సరిచేయకుంటే విరిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వెనకభాగంలో నిర్మించిన ఎడమకాల్వలో పెద్దమొత్తంలో మట్టి పేరుకుపోయిందని , ప్రాజెక్టు నిండక ముందే కాల్వలోని మట్టిని తీసివేయించాలనీ, లేకుంటే పంట పొలాలకు నీరందే వీలుండదని రైతులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3 అడుగుల వరకు నీరున్నా అవి కుడి కాల్వ, బేబికెనాల్కు మాత్రమే వెళ్లే వీలుందని, ప్రాజెక్టులో 7 అడుగుల వరకు నీరున్నా ఎడమ కాల్వలోకి రావని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో పంటలు సాగుచేస్తే మాత్రం ఎడమ కాల్వ కింది పంటపొలాలకు చివరి రెండు తడులకు నీరందే అవకాశం లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. వెంటనే మట్టిని తీయించి, వంగిన గేర్ రాడ్‌ను బాగుచేయించాలని కోరుతున్నారు. అత్యవసర నిధులు కేటాయించి అవసరమైన పనులను వెంటనే చేయించాలన్నారు. -
వృథా.. వ్యధ
ధారూరు, న్యూస్‌లైన్: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు గత వర్షాకాలంలో పూర్తిగా నిండటంతో ధారూరు, పెద్దేముల్ మండలాల రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ప్రాజెక్టుకు తగిన మరమ్మతులు లేక పొలాలకు వదిలిన నీళ్లు వృథాగా పోతున్నాయి. ప్రాజెక్టు కింద 9,200 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఆరువేల ఎకరాలకే అందుతోంది. ఈ ప్రాజెక్టుకు బేబీ కెనాల్‌తో పాటు కుడి, ఎడమ కాల్వలున్నాయి. 1967లో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. కాల్వలు శిథిలమై, లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టులోని నీరు వృథాగా బయటకి వెళ్తున్నాయి. ప్రాజెక్టును నిర్మించి 47 ఏళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ చివరి భూములకు నీరందడం లేదు. మండలంలోని రుద్రారం, గట్టెపల్లితండా, రాంపూర్ తండా మీదుగా 11 కిలో మీటర్ల పొడవుతో ఎడమ కాల్వను నిర్మించారు. కాల్వ లో మూడు చోట్ల పెద్ద పెద్ద లీకేజీలు ఏర్పడి సగం నీరు వృ థాగా కాగ్నా నదిలో కలిసిపోతోంది. ఈ నీళ్లు సద్వినియోగమైతే దాదాపు 400 ఎకరాల బీడు భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ కాల్వ పరిధిలో 1,120 ఎకరాలకు నీరందాల్సి ఉండగా ప్రస్తుతం 600ల ఎకరాలకు కూడా అందడం లేదు. వృథా నీటిని అరికట్టేందుకు లీకేజీలను సరి చేయాలని నాలుగు దశాబ్దాలుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాల్వ తూము వద్దే లీకేజీలు.. ప్రాజెక్టు వెనుక భాగంలో నిర్మించిన ఎడమ కాల్వ తూము లోపభూయిష్టంగా ఉండటంతో పొలాలకు నీరందడం లేదు. తూము నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు నీరు వృథా అవుతోంది. తూముకు రంధ్రాలు పడి, లీకేజీలు ఏర్పడినా మరమ్మతులు చేపట్టకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. కాల్వల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి ఏటా రూ.లక్షల్లో నిధులు కేటాయించినా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేపడుతూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుడి కాల్వ పరిస్థితీ అంతే.. మండల పరిధిలోని నాగసమందర్, అల్లాపూర్ గ్రామాలతో పాటు పెద్దేముల్ మండలంలోని 7,720 ఎకరాలకు కుడి కాల్వ ద్వారా పొలాలకు నీరు చేరాలి. కాల్వ శిథిలావస్థకు చేరడంతో అధిక మొత్తంలో నీరు వృథా అవుతోందని రైతులు వాపోతున్నారు. కాల్వ పొడవు 24 కిలోమీటర్లు కాగా ప్రతీ కిలోమీటర్‌కు 8 నుంచి 10 వరకు లీకేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. కాల్వల్లో ఏర్పాటు చేసిన షెట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వృథా నీటిని అరికడితే దాదాపు 3 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశం ఉంటుందంటున్నారు. బూరుగు గడ్డ ప్రాంతంలోని 360 ఎకరాలకు నీరందించేందుకు నిర్మించిన 1.6 కిలో మీటర్ల పొడవైన బేబీ కెనాల్ కూడా పాడై నీరు వృథాగా నాగసమందర్ సమీపంలోని ఊట వాగులో కలుస్తోంది. ఈ విషయం ప్రాజెక్టు గ్యాంగ్మెన్లకు, సాగునీటి శాఖ డీఈ, ఈఈలకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వల మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించినా నిధులు మంజూరు కాకుంటే తామేం చేస్తామని సిబ్బంది చేతులు దులు పుకొంటున్నారు. ‘జైకా’ నిధులు వచ్చేనా? జైకా నిధులు (జపాన్ దేశం నుంచి) రూ. 20 కోట్లు వస్తేనే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టే వీలుంటుందని రైతులు పేర్కొంటున్నారు. నిధులు మంజూరయ్యాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా ఇంతవరకు పనుల జాడే లేదంటున్నారు. ఈ రబీ సీజన్లోనే పనులను ప్రారంభించి పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.