సాగునీరు సాగేదెలా..
ధారూరు: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతూ వస్త్తోంది. 9200 ఎకరాల ఆయకట్టు గల ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కేవలం 6 నుంచి 7 వేల ఎకరాలకే పరిమితమైంది. కాల్వలు సరిగా లేక, తూములు పనిచేయక పంట పొలాలకు సాగునీటి సరఫరా పశ్నార్థకమైంది. కుడికాల్వ తూముకున్న రెండు గేర్‌బాక్సుల్లో ఎడమవైపు ఉన్న ఓ గేర్‌బాక్సు పగిలిపోయి రెండు సంవత్సరాలైంది. 2013లో ప్రాజెక్టుకు వచ్చిన అప్పటి రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్‌కు రైతులు దీనిపై ఫిర్యాదు చేశారు. జపాన్‌నుంచి జైకా నిధులు రూ. 20 కోట్లు రానున్నాయని, వీటితో అన్ని రకాల మరమ్మతులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మత్తుల విషయంలో తగిని చొరవ తీసుకుంటేనే సాధ్యమని రైతులు పేర్కొంటున్నారు.
కుడికాల్వ తూముకు ఎడమవైపు పగిలిపోయిన గేర్‌బాక్సుకు మరమ్మతు చేయించాలని పలుమార్లు నీటిపారుదలశాఖ వికారాబాద్ ఈఈ, తాండూర్ డీఈ, కోట్‌పల్లి ప్రాజెక్టు ఏఈ, సిబ్బందికి పలుమార్లు రైతులు మొరపెట్టుకున్నారు. ఇదిగో చేయిస్తాం, అదిగో చేయిస్తాం అంటూ రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. కుడివైపు ఉన్న ఒక్క గేర్‌బాక్సుతోనే పంటపొలాలకు నీరు వదులుతుతున్నారు. ఆ గేర్‌బాక్సు కూడా పాడైందంటే దీనికింద ఉన్న దాదాపు 6500 ఎకరాల భూములకు నీటి సరఫరా పూర్తిగా స్తంభించిపోతుంది. ప్రాజెక్టు నిండిపోయిన వేళల్లో మరమ్మతు చేయడానికి వీలుండదని, యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లో బాగుచేయిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని సాగునీటి సంఘాలు పేర్కొంటున్నాయి.
ప్రమాదంలో ఎడమకాల్వ తూము
ఎడమ కాల్వ తూము ప్రమాద స్థాయికి చేరిందని రైతులు వాపోతున్నారు. ఎడమ కాల్వ తూముకు ఏర్పాటు చేసిన గేర్‌రాడ్ వంగిపోవడం, ఎడమ కాల్వలో మట్టి పేరుపోవడంతో నీటి సరఫరాలో ఆటంకం కలుగుతోంది. తూము గేర్‌రాడ్‌ను వెంటనే సరిచేయకుంటే విరిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వెనకభాగంలో నిర్మించిన ఎడమకాల్వలో పెద్దమొత్తంలో మట్టి పేరుకుపోయిందని , ప్రాజెక్టు నిండక ముందే కాల్వలోని మట్టిని తీసివేయించాలనీ, లేకుంటే పంట పొలాలకు నీరందే వీలుండదని రైతులు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 3 అడుగుల వరకు నీరున్నా అవి కుడి కాల్వ, బేబికెనాల్‌కు మాత్రమే వెళ్లే వీలుందని, ప్రాజెక్టులో 7 అడుగుల వరకు నీరున్నా ఎడమ కాల్వలోకి రావని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో పంటలు సాగుచేస్తే మాత్రం ఎడమ కాల్వ కింది పంటపొలాలకు చివరి రెండు తడులకు నీరందే అవకాశం లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. వెంటనే మట్టిని తీయించి, వంగిన గేర్ రాడ్‌ను బాగుచేయించాలని కోరుతున్నారు. అత్యవసర నిధులు కేటాయించి అవసరమైన పనులను వెంటనే చేయించాలన్నారు.