g.prasad kumar
-
సాగునీరు సాగేదెలా..
ధారూరు: జిల్లాకే తలమానికమైన కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతూ వస్త్తోంది. 9200 ఎకరాల ఆయకట్టు గల ఈ ప్రాజెక్టు ప్రస్తుతం కేవలం 6 నుంచి 7 వేల ఎకరాలకే పరిమితమైంది. కాల్వలు సరిగా లేక, తూములు పనిచేయక పంట పొలాలకు సాగునీటి సరఫరా పశ్నార్థకమైంది. కుడికాల్వ తూముకున్న రెండు గేర్‌బాక్సుల్లో ఎడమవైపు ఉన్న ఓ గేర్‌బాక్సు పగిలిపోయి రెండు సంవత్సరాలైంది. 2013లో ప్రాజెక్టుకు వచ్చిన అప్పటి రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్‌కు రైతులు దీనిపై ఫిర్యాదు చేశారు. జపాన్నుంచి జైకా నిధులు రూ. 20 కోట్లు రానున్నాయని, వీటితో అన్ని రకాల మరమ్మతులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మత్తుల విషయంలో తగిని చొరవ తీసుకుంటేనే సాధ్యమని రైతులు పేర్కొంటున్నారు. కుడికాల్వ తూముకు ఎడమవైపు పగిలిపోయిన గేర్బాక్సుకు మరమ్మతు చేయించాలని పలుమార్లు నీటిపారుదలశాఖ వికారాబాద్ ఈఈ, తాండూర్ డీఈ, కోట్‌పల్లి ప్రాజెక్టు ఏఈ, సిబ్బందికి పలుమార్లు రైతులు మొరపెట్టుకున్నారు. ఇదిగో చేయిస్తాం, అదిగో చేయిస్తాం అంటూ రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వస్తున్నారు. కుడివైపు ఉన్న ఒక్క గేర్బాక్సుతోనే పంటపొలాలకు నీరు వదులుతుతున్నారు. ఆ గేర్‌బాక్సు కూడా పాడైందంటే దీనికింద ఉన్న దాదాపు 6500 ఎకరాల భూములకు నీటి సరఫరా పూర్తిగా స్తంభించిపోతుంది. ప్రాజెక్టు నిండిపోయిన వేళల్లో మరమ్మతు చేయడానికి వీలుండదని, యుద్ధ ప్రాతిపదికన 15 రోజుల్లో బాగుచేయిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని సాగునీటి సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదంలో ఎడమకాల్వ తూము ఎడమ కాల్వ తూము ప్రమాద స్థాయికి చేరిందని రైతులు వాపోతున్నారు. ఎడమ కాల్వ తూముకు ఏర్పాటు చేసిన గేర్‌రాడ్ వంగిపోవడం, ఎడమ కాల్వలో మట్టి పేరుపోవడంతో నీటి సరఫరాలో ఆటంకం కలుగుతోంది. తూము గేర్రాడ్ను వెంటనే సరిచేయకుంటే విరిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వెనకభాగంలో నిర్మించిన ఎడమకాల్వలో పెద్దమొత్తంలో మట్టి పేరుకుపోయిందని , ప్రాజెక్టు నిండక ముందే కాల్వలోని మట్టిని తీసివేయించాలనీ, లేకుంటే పంట పొలాలకు నీరందే వీలుండదని రైతులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3 అడుగుల వరకు నీరున్నా అవి కుడి కాల్వ, బేబికెనాల్కు మాత్రమే వెళ్లే వీలుందని, ప్రాజెక్టులో 7 అడుగుల వరకు నీరున్నా ఎడమ కాల్వలోకి రావని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో పంటలు సాగుచేస్తే మాత్రం ఎడమ కాల్వ కింది పంటపొలాలకు చివరి రెండు తడులకు నీరందే అవకాశం లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. వెంటనే మట్టిని తీయించి, వంగిన గేర్ రాడ్‌ను బాగుచేయించాలని కోరుతున్నారు. అత్యవసర నిధులు కేటాయించి అవసరమైన పనులను వెంటనే చేయించాలన్నారు. -
కేసీఆర్ ఓ మాయలోడు
ధారూరు, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ రూ. కోట్లు సంపాదించారని, కుటుంబ పాలన కోసం ఉద్యమాన్ని వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి, వికారాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జి. ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ఎబ్బనూర్, అల్లిపూర్, చింతకుంట, హరిదాస్‌పల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్తడా, దోన్నాల్, నాగారం, తరిగోపుల, మోమిన్‌కలాన్, అంతారం, మోమిన్‌ఖుర్దు, జైదుపల్లి, గోదంగుడ తదితర గ్రామాల్లో ప్రసాద్‌కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సంపాదించిన డబ్బును వ్యవసాయం చేసి సంపాదిస్తున్నానని కేసీఆర్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎకరా పొలంలో మిర్చి పండించి రూ. కోటి ఆదాయం వచ్చిందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికలైన మరుక్షణమే అమెరికా వెళ్లిపోతారని, ఆయనకు ఇక్కడి ప్రజల సమస్యలు తెలియవని, తెలుగు భాష సరిగా రాని ఆయనకు ఓట్లు అడగడానికి రాదని అన్నారు. రాజకీయ కుటంబం నుంచి వచ్చిన చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ధారూరు ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్రావు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ అంజయ్య, వికారాబాద్, ధారూరు ఏఎంసీ వైస్ చైర్మన్లు పెంటయ్య, బాలునాయక్, జెడ్పీటీసీ అభ్యర్థి పట్లోళ్ల రాములు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జి. లక్ష్మన్, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, ఎంఐఎం మండల అధ్యక్షుడు మోయిజ్‌ఖురేషి, సర్పంచులు పాండునాయక్, నర్సిరెడ్డి, ప్రమీలమ్మగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు పలికిన ఏసీఆర్ వర్గం ప్రసాద్‌కుమార్‌కు మద్దతుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ వర్గం ప్రచారంలోకి దిగింది. బుధవారం ధారూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రసాద్‌కుమార్‌కు ధారూరు వద్ద ఎస్కె ఆశం తన అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. ప్రసాద్‌కుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ఏసీఆర్ వర్గం నాయకులు చెప్పారు. -
మాట తప్పిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మరు
ధారూరు, న్యూస్‌లైన్: మాట మీద నిలబడని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు... తెలంగాణ అభివృద్ధి తనతోనే సాధ్యమవుతుందంటే ప్రజలు ఎంతమాత్రం నమ్మరని మాజీ మంత్రి, కాంగ్రెస్ వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం ధారూరులోని రైస్‌మిల్లులో జరిగిన కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ మాట తప్పడం కేసీఆర్‌కు అలవాటనీ, ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌లో విలీనాన్ని, పొత్తును వ్యతిరేకించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, ప్రభుత్వం ఏర్పాటు కాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్తీక్‌ను గెలిపించి సబితారెడ్డి రుణం తీర్చుకుంటా... గతంలో తన గెలుపు కోసం కృషి చేసిన మాజీ హోం మంత్రి సబితారెడ్డి రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికల్లో ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ రూపురేఖలు మారుస్తాం : కార్తీక్‌రెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రసాద్‌కుమార్‌ను, ఎంపీగా తనను గెలిపిస్తే ఇద్దరం కలిసి వికారాబాద్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామని కార్తీక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తామని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, జూరాల ఎత్తిపోతల ద్వారా జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ధారూరు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, అంజయ్య, ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్రావు, డీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్, పీసీసీ నాయకుడు సత్యనారాయణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కన్నె బిచ్చన్న, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దులూర్ మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి, ధారూరు టీడీపీ, జేఏసీలకు చెందిన 12మంది యువకులు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.