మాట తప్పిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మరు | peoples do not believe to kcr | Sakshi
Sakshi News home page

మాట తప్పిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మరు

Published Sun, Apr 13 2014 11:21 PM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

peoples do not believe to kcr

 ధారూరు, న్యూస్‌లైన్: మాట మీద నిలబడని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు... తెలంగాణ అభివృద్ధి తనతోనే సాధ్యమవుతుందంటే ప్రజలు ఎంతమాత్రం నమ్మరని మాజీ మంత్రి, కాంగ్రెస్ వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం ధారూరులోని రైస్‌మిల్లులో జరిగిన కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ మాట తప్పడం కేసీఆర్‌కు అలవాటనీ,  ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌లో విలీనాన్ని, పొత్తును వ్యతిరేకించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, ప్రభుత్వం ఏర్పాటు కాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు.

 కార్తీక్‌ను గెలిపించి సబితారెడ్డి రుణం తీర్చుకుంటా...
 గతంలో తన గెలుపు కోసం కృషి చేసిన మాజీ హోం మంత్రి సబితారెడ్డి రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికల్లో ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు.  

 వికారాబాద్ రూపురేఖలు మారుస్తాం : కార్తీక్‌రెడ్డి
 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రసాద్‌కుమార్‌ను, ఎంపీగా తనను గెలిపిస్తే ఇద్దరం కలిసి వికారాబాద్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామని కార్తీక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తామని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, జూరాల ఎత్తిపోతల ద్వారా జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ధారూరు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, అంజయ్య, ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్‌రావు, డీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్, పీసీసీ నాయకుడు సత్యనారాయణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కన్నె బిచ్చన్న, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సిద్దులూర్ మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి, ధారూరు టీడీపీ, జేఏసీలకు చెందిన 12మంది యువకులు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement