కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు
Published Mon, Feb 6 2017 2:31 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదనడానికి కలెక్టర్ల రివ్యూ మీటింగే నిదర్శనమని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టర్లకు మన ఊరు మన ప్రణాళికా అనే పాత స్కీమ్ గురించి చెప్పడం అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు. మన ఊరు మన ప్రణాళికను రెండేళ్లుగా నిర్వీర్యం చేసి మళ్లీ అమలు చేస్తామంటారా.. పేదల వివరాలు సేకరించాలంటూ కలెక్టర్లకు సూచించిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గురించి మరిచారా అన్నారు.
ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని, ఇళ్లు, ఉపాధి లేని వారి వివరాలు బయటకు వస్తే.. డబుల్ బెడ్ రూమ్ కోసం ఉద్యోగాల కోసం డిమాండ్లు పెరుగుతాయనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెల్లడించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇంట్లో సమీక్షలు నిర్వహిస్తూ ప్రెస్ నోట్ల ద్వారా పాలన సాగిస్తున్నారని ఎద్దేవ చేశారు. క్షేత్ర స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందని పాలనలో జవాబుదారీ తనం లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు.
Advertisement