ప్రగతినగర్ : తెలంగాణ అభివృద్ధికి, అర్హులైన వారందరికీసంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సమగ్ర కుటుంబ సర్వేకు ఆదేశాలు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సర్వే రోజు ప్రజలందరూ ఆందుబాటులో ఉండాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం నుంచి పొందే సంక్షేమ పథకాలు అందకుండా పోతాయన్నారు.
మంగళవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎన్యూమరేటర్‌లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాల ను సర్వే చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో ఉద్యోగి సగటున 25 నుంచి 30 కుటుంబాలను సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు సహకరిం చాలని కోరారు.
దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఎన్నికల తరహాలో ఉంటుందన్నారు. ఎన్యూమరేటర్లకు ఏ గ్రామంలో ఏ కుటుంబాలను సర్వే చేసే విషయాన్ని చివరి నిమిషాం వరకు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేను నిర్వహించాలని ఆయన సూచించారు.
సమగ్ర కుటుంబ సర్వే ఫార్మట్‌లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్, ఓటర్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లు, మొబైల్ నెంబర్లు, విద్యార్హతలు, చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, గతంలో పొందిన ప్రభుత్వ పథకాలు, ప్రస్తుతం పొందుతున్న పెన్షన్లు, ఇతర ఆదాయపన్ను వంటి అంశాలు, స్థిరాస్తులు, పశుసంపద వివరాలు పొందుపరచాలని ఆయన సూచించారు. జిల్లా కు 25 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరం అవుతున్నారని కలెక్టర్ తెలిపారు.
బుధవారం తహశీల్దార్లందరూ, ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మండల కేంద్రంలో కనీసం 50 కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివరాలు పొందుపరిచిన తరువాత కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలని అది నిజమా లేదా అనే బాధ్యత అధికారులదేనన్నా రు. అధికారులు తప్పు చేశారని భావిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్‌చార్జి డీఆర్‌ఓ యాదిరెడ్డి, బోధన్,కామారెడ్డి ఆర్‌డిఓలు, పీడీలు, అన్నిశాఖల అధికారులు ఎంఆర్‌వోలు, ఎండీవోలు పాల్గొన్నారు.
ప్రజా ప్రయోజనాలకే కుటుంబ సర్వే
Published Wed, Aug 6 2014 3:27 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM
Advertisement
Advertisement