ధారూరు/పెద్దేముల్: జిల్లాకే తలమానికం కోట్‌పల్లి ప్రాజెక్టు. రెండు మండలాల్లోని 19 గ్రామాల పరిధిలోని ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కోట్‌పల్లి’.. ఈ ఏడాది చుక్కనీరు చేరక వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రాజెక్టులోకి నామమాత్రపు నీరు చేరకపోవడంతో రైతులు సాగుపై ఆశలు వదులుకుంటున్నారు. మూడేళ్ల నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం లేదు. దీంతో పూర్తిస్థాయి ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు.
ఈ ఏడాదిలో జూన్, జూలై, ఆగస్టు మొదటి వారం వరకు రైతులు వర్షాలకోసం ఎదురుచూశారు. కానీ ఆశాజనకంగా వర్షాలు పడలేదు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టుకింది రైతులు మెట్టపంటలే సాగు చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు లక్ష్యం 9,200ఎకరాలు. ప్రధాన కుడికాల్వ తూము ద్వారా 7,200, ఎడమ, బేబీ కెనాల్ ద్వారా రెండు వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. కానీ క్రమేపీ తగ్గుతూ వస్తున్న ఆయకట్టు ప్రస్తుతం ఐదు నుంచి ఆరు వేలకే పరిమితమైంది.
ప్రభుత్వం యేటా కాల్వల మరమ్మతుల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఎకరా ఆయకట్టు కూడా పెరగకపోగా తగ్గుతూ వస్తోం ది. కాల్వలు, తూములు సరిగాలేక పొలాలకు సాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. పెద్దేముల్, ధారూ రు మండలాల్లోని జనగాం, మంబాపూర్, రేగొండి, రుక్మాపూర్, బండమీదిపల్లి, మారేపల్లితండా, బూర్గుగడ్డ, రుద్రారం, నాగసముందర్, అల్లాపూర్, గట్టేపల్లి గ్రామాల్లోని ఆయకట్టు భూములు బీళ్లుగా మారుతున్నాయి. పేరుకే పెద్ద ప్రాజెక్టు తప్ప.. ఎలాంటి ప్రయోజనమూ ఉండడంలేదని రైతులు వాపోతున్నారు.
75శాతం నీరువస్తేనే ఖరీఫ్‌కు అవకాశం
ఆగస్టు చివరినాటికి ప్రాజెక్టులోకి 75శాతం మేర నీరు(18 అగుగులు) వస్తేనే ఖరీఫ్ పంటలకు నీరు విడుదలచేసే వీలుందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం మూడు అడుగుల మేరకే నీటి నిలువ ఉంది. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ వరకు 11.5 అడుగుల నీరు నిల్వఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కుడి కాలువ గేర్‌బాక్సు పగిలి రెండేళ్లు..
రెండేళ్ల క్రితం ప్రాజెక్టు కుడి కాలువ తూముకున్న రెండు గేర్‌బాక్సుల్లో ఎడమవైపు గేర్‌బాక్సు పగిలింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ ద్వారా దీనికి మరమ్మతులు చేయించారు. కానీ తిరిగి నెల రోజులు గడవకముందే పగిలింది. దీనికి మరమ్మతులు చేయించాలని 2013లో ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన అప్పటి చేనేత, జౌళి శాఖ మంత్రి జి. ప్రసాద్‌కుమార్, ప్రస్తుత రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డిలకు రైతులు విన్నవించారు.
వెంటనే స్పందించిన వారు అధికారులతో అక్కడే మాట్లాడి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అది అమలు కాలేదు. ప్రాజెక్టు మరమ్మతులకు జైకా నిధులు రూ.20కోట్లు రానున్నాయని అప్పట్లో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు ఆ నిధుల జాడలేదు. ప్రస్తుతం కుడి కాలువ తూము ద్వారా నీరు ఒకే గేర్‌బాక్సు నుంచి సరఫరా అవుతుంది. దీంతో ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా చేరడం లేదు. ప్రాజెక్టులోకి నీరుచేరితే మరమ్మతులు చేయించే వీలుండదు.
వలసలు తప్పవా?
కోట్‌పల్లి ప్రాజెక్టుపై ఆధారపడి జీవిస్తున్న 19 గ్రామాల పరిధి రైతులు మూడేళ్లుగా మెట్ట పంటలతో సరిపెట్టుకుంటున్నారు. సరైన దిగుబడులురాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఆయకట్టు పరిధి రైతు కుటుంబాలకు వలసలు తప్పేలా లేవు. ఇప్పటికే తండాల్లోని గిరిజనులు కుటుంబాలతో వలస వెళ్లారు.
‘కోటి’ఆశలు గల్లంతు!.
Published Sun, Aug 10 2014 11:34 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement