అంతమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సంతోష్
ధారూరు రంగారెడ్డి : ఆగి ఉన్న బస్సును ఎక్కేందుకు వెళుతున్న ఓ వృద్ధురాలు బస్సు ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ నుంచి తాండూర్‌కు 45 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్డినరీ బస్సు కేరెళ్లి గ్రామ బస్టాప్‌లో ఆగింది. గ్రామంలోంచి బస్సు ఎక్కేందుకు మోమిన్‌ఖుర్దు గ్రామానికి చెందిన అల్లిపూరం అంతమ్మ(70) రోడ్డును క్రాస్ చేసి బస్సు ముందు నుంచి వెళుతుంది.
డ్రైవర్ శ్రీనివాసులు రోడ్డు ముందుకు చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సు ముందున్న అంతమ్మను ఢీకొట్టిన బస్సు కొద్దిదూరం ఆమెను లాక్కెళ్లింది. బస్సులోని ప్రయాణికులు, బయట ఉన్న ప్రజలు బిగ్గరగా అరవడంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. అప్పటికే వృద్ధురాలు అంతమ్మకు తీవ్ర గాయాలై చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంది.
అదే గ్రామానికి చెందిన శివకుమార్‌రెడ్డి 108 వాహనానికి కాల్ చేయగా టైర్ పంక్చర్ అయ్యింది, రాలేకపోతున్నాని చెప్పి నిర్లక్ష్యంగా చెప్పి పెట్టేశాడని శివకుమార్‌రెడ్డి తెలిపారు. సకాలంలో అంతమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో వృద్ధురాలు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలింది.
మోమిన్‌ఖుర్దు గ్రామానికి చెందిన అంతమ్మ తన కొడుకుతో కలిసి కేరెళ్లి గ్రామంలో ఉంటున్న బంధువు బుడ్డ మణెయ్య ఇంటికి బుధవారం రాత్రి వచ్చింది. గురువారం సొంత ఇంటికి వెళ్లేందుకు వస్తుండగా ఆర్టీసీ బస్సు మృత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టింది.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సంతోష్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ శ్రీనువాసులు సంఘటన స్థలం నుంచి పారీపోయి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment