మద్యం తాగొద్దన్నందుకు..
ధరూరు : నిత్యం మద్యం సేవించి అనారోగ్యానికి గురవుతున్నావని.. ఇలాగైతే సంసారం ఎలాగని ప్రశ్నించిన భార్యను ఓ భర్త దారుణంగా హతమార్చాడు. స్థానికంగా తీవ్రసంచలనం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం మండలంలోని మార్లబీడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల మల్లేష్ మతిస్థితిమితం సరిగాలేని తన మేనమామ కూతురును వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కూతురు జన్మించింది.
అల్లుడు తన కూతురును వేధింపులకు గురిచేస్తుండటంతో తండ్రి రెండేళ్లక్రితం తమ ఇంటికి తీసుకెళ్లాడు. ఇదిలాఉండగా, ఏడునెలల క్రితం మరో వివాహం చేసుకునేందుకు మల్లేష్ పూనుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలో మొదటి భార్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒప్పందపత్రాన్ని రాయించుకుని రాయిచూర్ పట్టణంలోని జలాల్‌నగర్‌కు చెందిన లక్ష్మి(20)ని ఏడునెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆమెకు కట్నకానుకల కింద రెండు తులాల బంగారం, కొంతనగదు ఇచ్చారు.
మల్లేష్ తాగుడుకు బానిసకావడంతో పలుమార్లు లక్ష్మి భర్తను మందలించినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యంమత్తులో ఉన్న మల్లేష్‌ను భార్య తాగొస్తే సంసారం ఎలా సాగుతుందని నిలదీసింది. తనకు ఇష్టమొచ్చినట్లు ఉంటానని లక్ష్మిపై దాడిచేశాడు. ఇంతలో కర్రతో తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాతపడింది.
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు భార్య లక్ష్మి మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సోమవారం ఉదయం మల్లేష్ బంధువులు, ఇరుగుపొరుగువారు గమనించి విషయాన్ని రాయిచూర్‌లోని లక్ష్మి తల్లిదండ్రులకు తెలియజేశారు. రేవులపల్లి ఎస్‌ఐ అమ్జద్‌అలీ సంఘటనపై ఆరాతీశారు. సంఘటనకు కారణమైన భర్త మల్లేష్, అత్త మల్లమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి అన్న నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.