తుమకూరు: పని లేక, తాగుడుకు బానిసైన భర్త ఉన్మాదిగా మారాడు. మంచిగా మారానని మాటిస్తే.. తిరిగి వచ్చిన భార్యాబిడ్డలపై దాష్టికానికి పాల్పడ్డాడు. అత్యంత కిరాతకంగా ఇద్దరినీ కడతేర్చాడు. ఈ దారుణం జిల్లాలోని గుబ్బి తాలూకా నిట్టూరు హోబళి మావినహళ్లి గ్రామంలో జరిగింది.
మావినహళ్లి గ్రామానికి చెందిన స్వామి (33)కి భార్య కావ్య (25), కుమారుడు జీవన్ (4) ఉన్నారు. భార్యతో గొడవపడి గునపంతో భార్య, కుమారుని తలపై కొట్టి ప్రాణాలు తీశాడు. రక్తసిక్తమైన ఇంట్లో పడి ఉన్న భార్య, కుమారుని మృతదేహాలను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురి అయ్యారు. పారిపోయేందుకు యత్నించిన కిరాతకున్ని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టి చేళూరు పోలీసులకు అప్పగించారు.
నాలుగు రోజుల కిందటే భార్య రాక
గ్రామంలో అర్చక వృత్తి చేసుకునే స్వామిని ఇటీవల ఆ పని నుంచి తొలగించారు. ఊళ్లో అటూ ఇటూ తిరుగుతూ కుటుంబ సభ్యులతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. గత ఆరేళ్ల క్రితం స్వామి, కావ్యకు వివాహం జరిగింది. తరచూ కొట్లాటలు అవుతుండడంతో కావ్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువులు రాజీ పంచాయతీ చేసి నాలుగు రోజుల క్రితమే ఒక్కటి చేశారు. మంచిగా చూసుకుంటాడని చెప్పడంతో దీంతో కావ్య తిరిగి భర్త స్వామి ఇంటికి వచ్చింది.
కానీ అతనిలోని ఉన్మాది ఊరుకోలేదు. మంగళవారం రాత్రి మరోసారి భార్యతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడైన స్వామి తన చేతికి అందిన గునపం తీసుకుని కావ్య, నాలుగేళ్ల జీవన్ తలలపై బాది చంపాడు. ఘటనాస్థలి అంతా రక్తం ధార కట్టి భీతావహంగా మారింది. చేళూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి స్వామిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: రాజీకి పిలిచి ఘోర అవమానం
Comments
Please login to add a commentAdd a comment