అమ్మను అడవిలో వదిలేసింది!
రంగారెడ్డి జిల్లాలో ఓ కూతురు నిర్వాకం
ధారూరు: కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా అడవిలో వదిలేసిందో కూతురు. ఇంటికి రావొద్దని బెదిరించింది. దీంతో ఆ వృద్ధురాలు తిండిలేక.. కదలలేని స్థితిలో ధారూరు రైల్వేస్టేషన్‌లో పడి ఉంది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన వడ్డె బిచ్చమ్మ(75)కు ఐదుగురు కూతుళ్లు. నలుగురికి పెళ్లిళ్లయ్యాయి. మరో కూతురుకి వివాహం కావాల్సి ఉంది. పెద్ద కూతురు బాలమ్మకు ఇల్లరికం పెళ్లి చేసి కూతురు, అల్లుడును తనవద్దే ఉంచుకుంది.
బాలమ్మ తల్లి బిచ్చమ్మకు చెందిన ఇంట్లో ఉంటూ ఆమెకున్న ఐదెకరాల పొలాన్ని అనుభవించడమే కాకుండా నెలనెలా వచ్చే పింఛన్‌ను కూడా తీసుకునేది. నెల రోజుల క్రితం బాల మ్మ తన తల్లిని ఇంట్లో ఉండవద్దని చెప్పి ఆమెను తీసుకెళ్లి తాండూరు రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లింది. బిచ్చమ్మ ఎలాగోలా తిరిగి ఇంటికి చేరింది. దీంతో బాలమ్మ, ఇద్దరు కుమారులు ఆదివారం ధారూరు రైల్వేస్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
అక్కడి నుంచి ఆమె రైల్వేస్టేషన్‌కు చేరింది. అప్పటి నుంచి అన్నపానీయాలు లేకుండా అక్కడే పడి ఉంది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను చూసిన రైల్వేస్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. రైల్వే పోలీసులు బాలమ్మ కుమారులకు ఫోన్‌చేసి విషయం చెబితే వారు ఆమెను తీసుకుపోవడానికి నిరాకరించారు. దీంతో ఆమె ఆదివారం అర్ధరాత్రి నుంచి రైల్వేస్టేషన్‌లోనే కూర్చొంది.