- అన్నపానీయాలు లేక ఆకలి ఘోస
- రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చినా స్పందించని కుటంబసభ్యులు
ధారూరు (రంగారెడ్డి) : ఇంట్లో ఉన్న ముసలి తల్లిని వదిలించుకునేందుకు ఓ కూతురు.. అర్ధరాత్రి ఆటోలో తీసుకెళ్లి తల్లిని అడవిలో వదిలిపెట్టింది. వృద్ధురాలు అతి కష్టమ్మీద సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు చేరుకుని అన్నపానీయాలు లేక ఆకలితో అలమటిస్తూ గడుపుతుంది. గమనించిన రైల్వే పోలీసులు వృద్ధురాలి కూతురు, ఆమె కొడుకులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. ఈ సంఘటన ధారూరు రైల్వేస్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దేముల్ మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన వడ్డె బిచ్చమ్మ(75)ను కూతురు బాలమ్మ.. తన కుమారులు గోపాల్, రజనీకాంత్‌లతో కలిసి ఆదివారం అర్ధరాత్రి ధారూరు రైల్వేస్టేషన్ సమీప అడవి ప్రాంతం రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. బిచ్చమ్మ నడవలేని స్థితిలో ఉన్నా పాక్కుంటూ సమీప రైల్వేస్టేషన్‌కు చేరుకుని తలదాచుకుంది. అన్నపానీయాలు లేక అలమటించడమే కాకుండా లేవటానికి చేతకాక మలమూత్రాలు అక్కడే చేసుకుంటూ ఉంది.
ఈమెను గమనించిన రైల్వేస్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విచారించి వివరాలు అడిగి వృద్ధురాలి మనుమలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వారు వృద్ధురాలిని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. కాగా బిచ్చమ్మకు బాలమ్మ, ఎల్లమ్మ, మొగులమ్మ, అంబమ్మ, లక్ష్మిలనే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో నలుగురు కూతుళ్ల పెళ్లిళ్లు చేయగా లక్ష్మికి వివాహం కాలేదు. వీరిలో బాలమ్మ అనే కుమార్తెకు పెళ్లిచేసి కుమార్తె, అల్లుడిని ఇల్లిరికంపెట్టుకుంది. బాలమ్మ తల్లి ఆస్తిని అనుభవిస్తూ తల్లికి నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించన్, బియ్యంను కూడ లాగేసుకుంటుంది.
నెల రోజుల క్రితం తల్లి బిచ్చమ్మను తాండూర్ రైల్వే స్టేషన్‌లో వదిలివెళ్లగా ఎలాగో బిచ్చమ్మ తిరిగి ఇంటికి చేరింది. దీంతో తల్లిని పూర్తిగా వదిలించుకోవాలనే ఆలోచనతో ధారూరు సమీప అడవిలో రోడ్డు పక్కన వదిలిపెట్టి వెళ్లారు. మళ్లీ ఇంటికి రావద్దని, వస్తే మా పరువు పోతుందని, నువ్వు ఇంటి వద్ద ఉంటే తన పిల్లల పెళ్లిళ్లు కావని, జీవితం చాలు అనుకుంటే అక్కడే దగ్గర్లో ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లి చచ్చిపో అంటూ బెదిరించారని వృద్ధురాలు వాపోయింది. తన ఆస్తిని కూతురు, మనుమలు కలిసి దర్జాగా అనుభవిస్తున్నారని, తనను మాత్రం వదిలించుకోవాలనీ, లేకుంటే చంపేయాలనీ ప్రయత్నిస్తున్నారని ఆమే రైల్వే పోలీసులకు తెలిపింది. తనతోపాటు తన భర్త పెంటప్పను కూడా కూతురే ఇంటి నుంచి వెళ్లగొట్టిందని కన్నీరుమున్నీరయ్యింది.
తల్లిని అడవిలో వదిలిపెట్టిన కూతురు
Published Mon, Jun 20 2016 7:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement