
కన్నతల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ కూతురేమో దుర్మార్గంగా ఆలోచించింది. ఆస్తి కోసం బలవంతంగా ఆమెతో వీలునామాపై సంతకం చేయించుకుంది. అయితే సాక్ష్యంగా ఉంటుందని ఆ కూతురు తీయించుకున్న వీడియోనే.. ఈ బండారం మొత్తాన్ని బయట పెట్టింది. దీంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది .
యూకేలో ఓ వ్యక్తి మూడేళ్లపాటు చేసిన న్యాయ పోరాటం.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. సోదరుడిని మోసం చేసి ఆస్తి కొట్టేయాలని భావించిన ఓ మహిళకు పెద్ద షాకే తగిలింది. అతనికి 7 లక్షల పౌండ్ల విలువైన(మన కరెన్సీలో రూ.7 కోట్ల 86 లక్షల దాకా) విలువైన ఆస్తిపాస్తుల్లో సగం సోదరుడికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
కేసు ఇదే..
మార్గరేట్ బేవర్‌స్టాక్(76) అనే మహిళ 2021 మార్చిలో కన్నుమూసింది. చనిపోయే టైంలో ఆమె తన ఆస్తి మొత్తం కూతురు లీసా పేరిట రాసింది. కొడుకు జాన్‌కు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయితే మతిమరుపు జబ్బుతో బాధపడుతున్న తన తల్లి.. సోదరికి మాత్రమే ఆస్తి ఎలా రాయగలిగిందని అతనికి అనుమానం వచ్చింది. ఆస్తిలో వాటా కోరుతూ.. సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశాడు.
తన తల్లి 2014 నుంచే మతిమరుపు వ్యాధితో బాధపడుతోందని, ఆ వీలునామాపై అనుమానాలు ఉన్నాయని వాదించాడతను. అయితే తల్లి తన పేరిట రాసిన వీలుకు సంబంధించిన వీడియోను లీసా కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జేన్ ఇవాన్స్.. లీసాను గద్దించారు. అది బలవంతంగా చేయించుకున్నదేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె అతి కష్టంగా మాట్లాడుతోంది. పైగా పెన్నును ఆమెతో బలవంతంగా పెట్టించుకున్నట్లు కనిపిస్తోంది. వీలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన కాపీలా ఉంది అని జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
జడ్జి కన్నెర్ర చేయడంతో లీసా నిజం ఒప్పుకుంది. అది ఆమె చనిపోతున్న సమయంలో తీసిందని తెలిపింది. తల్లికి ఉన్న ఆ జబ్బును ఆసరా చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. సాక్ష్యంగా ఉండాలని ఆ టైంలో వీడియో కూడా తీయించుకున్నట్లు తెలిపింది.
దీంతో ఆస్తిలో సగం వాటా.. సోదరుడు జాన్‌కు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. జాన్‌కు అయిన కోర్టు ఖర్చులను కూడా లీసానే భరించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment