ధారూరు: గ్రామాల్లో ప్రతి చిన్నపనికీ సర్పంచ్‌లు అంతోఇంతో డిమాండ్ చేస్తూ ఉంటారు. పని త్వరగా పూర్తి కావడం కోసం ప్రజలు కూడా ‘సమర్పించు’కోక తప్పని పరిస్థితి. రేషన్ కార్డుకు, పింఛన్ నమోదుకు, వివిధ రకాల సర్టిఫికెట్లకు చేసుకునే దరాఖస్తులపై సంతకాల చేసేందుకు మామూళ్ల కోసం సర్పంచ్‌లు చేయి చాస్తుంటారు. ఇక నుంచి అలా డబ్బులు తీసుకునేటప్పుడు సర్పంచ్‌లతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆలోచించాల్సిన పరిస్థితిని ఈ ఘటన కల్పించింది.
లంచం తీసుకుంటూ ఓ సర్పంచ్ ఏసీబీ అధికారులకు పట్టుబడడం ధారూరు మండలంలో బుధవారం సంచలనం రేపింది. ఎక్కడ నలుగురు కూడినా ఈ అంశంపై చర్చించుకుంటూ కనిపించారు. సర్పంచ్ ఏసీబీకి పట్టుబడడంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు రేగింది. ఇన్నాళ్లు ఏసీబీ అధికారులు కేవలం ప్రభుత్వ అధికారులను మాత్రమే పట్టుకుంటారని భావించిన వారు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు.
నాగారం గ్రామానికి చెందిన మొగిలి కృష్ణారెడ్డి గ్రామంలోని వాటర్ ట్యాంకు దగ్గరి నుంచి పరిగి రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం మార్చి నెలలో పంచాయతీ నుంచి తీర్మానం తీసుకున్నాడు. దానిపై సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ సంతకం చేయాల్సి ఉంది. అందుకు ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 25వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం కృష్ణారెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు.
వారి పథకం ప్రకారం బుధవారం కృష్ణారెడ్డి.. సర్పంచ్ మరిది రాంకృష్ణయ్యగౌడ్‌కు డబ్బులివ్వడంతో ఆయన తీసుకెళ్లి సర్పంచ్‌కు ఇచ్చాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు సర్పంచ్‌తోపాటు ఆమె మరిదిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ తీర్మానం ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్నట్లు సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ అంగీకరించారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. కాగా ‘అందరి సర్పంచ్‌ల మాదిరిగా నేను డబ్బులు తీసుకున్న. ఇందులో తప్పేంముంది’ అని సర్పంచ్ తమను ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధి ఏసీబీకి చిక్కడం ఇదే మొదటిసారి..
ప్రజాప్రతినిధులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల లాగే ప్రజా ప్రతినిధులు కూడా ప్రజా సేవకులని, వారు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులై అవినీతికి పాల్పడిన వారిపై తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారి వివరాలు చెబితే దాడులు జరుపుతామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రాజు, వెంకట్‌రెడ్డి, సునీల్, లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ కలకలం!
Published Thu, Jul 24 2014 1:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement