
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vasthunam) సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు చేయించాలని విజయవాడకు చెందిన ఎం.లక్ష్మణకుమార్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ రవితో కూడిన ధర్మాసనం ఈ పిల్‌పై తీర్పు ఇచ్చింది. ఏదైనా ఒక సినిమా నిర్మాణ కోసం పెట్టిన ఖర్చు విషయంలో దర్యాప్తు చేయమని తాము ఈడీని ఆదేశించలేమని న్యాయస్థానం తెలిపింది. అలా చేస్తే కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని తెలిపింది. అదంతా అధికార యంత్రాంగం పరిధిలో ఉన్న విషయం అని కోర్టు పేర్కొంది.
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తాము విచారించాల్సింది ఏమీ లేదని కోర్టు పేర్కొంది. ఆ సినిమాకు సంబంధించిన అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తయిందని గుర్తుచేసింది. కోర్టులో దాఖలు చేసిన పిల్ కేవలం ప్రచారం కోసం మాత్రమే ఉందని పేర్కొంది. భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వాలని గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బడ్జెట్ విషయంలో ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.