
పంట పండలేదని రైతు ఆత్మహత్య
వలిగొండ : వర్షాలు లేకపోవడంతో కళ్ల ముందే పంట ఎండిపోతుందని ఒక రైతు తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన వెంకటయ్య అనే రైతుకు ఐదు ఎకరాల పొలం ఉంది.
ఆ పొలంతోపాటు మరో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంట సాగుచేశాడు. కాగా, వర్షాలు సరిగా లేకపోవడంతో పంట ఎండిపోతుంది. వ్యవసాయం కోసం అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. దాంతో ఓ వైపు పంట ఎండిపోవడం.... మరోవైపు అప్పుల బాధతో వెంకటయ్య తీవ్ర మనస్తాపం చెందాడు.
దాంతో పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.