పాలమూరు, న్యూస్‌లైన్: దినాం పరిస్థితి ఎట్లున్నగాని.. పండ్గదినమొచ్చిందంటే.. పిల్లలు కండ్లముందలుండాలె.. లేకుం టే అమ్మ, నాయ్నలు శాన కుద్నెజేస్తరు.. గసొంటి బా ధనే గీళ్లు గూడవడ్తుండ్రు.. 70 ఏండ్లు మీదవడ్డ వెంకటయ్యది అడ్డాకుల మండలం తుంకినిపూర్. గాయ న భార్య నర్సమ్మ.. వీరికిద్దరు కొడ్కులు..పెద్దకొడ్కు కురుమూర్తికి పెండ్లయింది.
చిన్నకొడ్కు వెంకటేశ్‌కు ఇంకాగాలేదు. పెద్దకొడుకు పెండ్లాన్ని, తన త మ్ము డ్ని దోల్కోని పొట్టచేతవట్కోని మహరాష్ట్రలున్న నా గపూర్‌కు వలసవోయిండ్రు..! పెద్దకొడ్కు పిల్లలు వోల్లతాన్నె ఉన్నగూడ్క.. పండ్గపూట కోడలు, కొడ్కులిద్దరు వొస్తలేరని దినమంత దిగులువడ్తుండ్రు.. ఇంట్ల కొడ్కుల్లేకుండ మంగళారం పండ్గ ఎట్లజేస్కుంటమని ఎంకటయ్య, గాయన భార్య నర్సమ్మ పక్కింటి కుర్మయ్య, వెంకటమ్మకు తమ కడుపులబాధ గిట్ల జెప్పుకుంటుండ్రు..!
వెంకటయ్య : మనూరు పిల్లగాళ్లంత సంకురాత్రి పం డ్గకోస్రం శానా దూరంకెళ్లి ఊరికొస్తుండ్రు.. మన కొ డ్కులు మాత్రం ఒస్తలేరు.. ఊర్లపని దొర్కుతలేదని దేశంగాని దేశంబొయి ఏం కష్టాలు వడ్తున్నరో.. మన పిల్లలకు సుఖం లేకపాయె.. ఏం బత్కులే మనయ్!
నర్సమ్మ : సర్కారు సాయం లేదు. ఉన్న రెండెక్రాల బూమిల బోర్లు వేస్తే నీళ్లువడకవాయె.. ఏస్కున్న పంటెండిపాయె.. గందుకే గద మన పిల్లలు బత్కనీకె వొయిండ్రు.
వెంకటయ్య : పట్నంల పనిజేస్క బత్కుతున్న మనూరు పోరగాళ్లు పెండ్లం పిల్లల్తోటి సంకురాత్రి పండ్గ సంబురం జేస్కునికి తుంకినిపూర్‌కొస్తుండ్రు మన కోడలు, కొడుకులు వొస్తలేరని బాధయితుంది.
నర్సమ్మ : ఏంజేతం.. గీసారీ కాలం మంచిగుందని చెప్పుకొన్నీకెనే.. ముందల మురిపించి.. ఎన్కసీరి పంటల్ని శెడగొట్టినయ్‌గా వోనలు.. పంట చేత్కొచ్చే టైంలనే వోనలెక్వయ్ అందర్కీ పంట చేత్కి రాకపాయె.. గిసోంటి పరిస్థితిల మన పిల్లలు ఊర్లుంటె ఎట్ల బత్కుతమని పనికోస్రం మారాష్ట్రకు వొయిండ్రు..
వెంకటయ్య : గిసోంటి టైంలనే సర్కరొళ్లు ఎక్కడలేని భారం మోపుతుండ్రు.. వొంటజెయ్యనీకె కట్టెల్ దొర్కుతలేవు.. గ్యాస్‌బండకు రేట్లు వెంచిరి.. ఊర్లంటె గాళ్లకు చిన్నతనమైందేమో.. కరెంటు బిల్లులు వెంచిరి.. పొద్దుమూకు కరెంటు తీయవట్రి.. ఇన్ని తిప్పల మన పిల్లలు మనూర్కొచ్చినగిట్ల.. ఏం సుఖపడ్తరు గాని నువ్ బాధవడకే..!
నర్సమ్మ : అవునయ్యా... బస్‌చార్జీలు పిరెమైనయి..కండ్ల ముంగట కొడుకుల్లేరని బాధవడ్తున్నగాని గంత దూరం నుంచి వొచ్చిపోవాలంటె ఎంత ఖర్సైతది. గాళ్ల పరిస్థితి ఎట్టుందో యేమో?
..గీ బూమ్మీన యెట్ల బత్కాల్నొ దెలుస్తలేదు. పిల్లల పరిస్థితి జూస్తె ఏడ్పొస్తుంది. అనుకుంట ఎంకటయ్య, నర్సమ్మ ఆలుమొగండ్లు ఇద్దరు ఒకరికొకరు సర్ది చెప్పుకొని కొంచెసేపు బాధవడ్రి..!
గీళ్లిద్దరు ఆలుమొగుండ్ల పరిస్థితి గిట్లుంటే..
తుంకినిపూర్‌లనే ఉన్న 60 ఏండ్ల బొంగు చిన్నకుర్మయ్య, వెంకటమ్మల ఇద్దరు కొడ్కులు చిన్నయ్య, దాసు, కోడండ్లు.. గాళ్ల పిల్లలు పట్నానికి (హైదరాబాద్‌కు) కూలిపనికి పోయిరిపనిజెయ్యనీకి వొయిండ్రు.. గానీ పండ్గకొస్తలేరని ఆల్మొగలు దిగులు వడ్తుండ్రు..!
వెంకటమ్మ : ఏమంది వోయ్య.. శానకుదెన జేస్తున్నవ్.. ఎందుకో జెప్పరాదా..!
కుర్మయ్య : ఏం లేదే.. మన చిన్న తనంల ఊరిడ్సి పోయెటోళ్లం గాదు.. మన పిల్లలకు గీడ బత్కుదెర్వు లేకనే.. ఊరిడ్సివోయిండ్రు.. సంకురాత్రి పండ్గకు కొడ్కులు, కోడండ్లు, గాళ్ల పిల్లలు గూడ్క వొస్తలేరని దిగులైతుంది.
వెంకటమ్మ : ఏంజేతమయ్యా.. యవుసాయం జేతమంటే కరెంట్ ఎప్పుడు వోతదో ఎప్పుడొస్తదో ఎర్కలేకుండవోయింది. కానీ కాలమొచ్చింది.. కన్నకష్టాలు మనయెంట కాసుకున్నయ్.
కుర్మయ్య : యాదిమర్సినవా.. సంకురాత్రి పండ్గొస్తే ఎంత సంబురం ఉంటుండె.. గిప్పుడు ఏం కొన్నీకే.. తిన్నీకే లేకుండైంది. సన్నబియ్యంతోటి బెల్లం బువ్వ జేస్కుందమంటె కిలకు 35 రూపాయిలైంది.. ఇంటికి సుట్టమొస్తెగిట్లు బువ్వ వెట్టనీకె లేకుండైంది. గిసోంటి టైంల సంకురాత్రి పండ్గను జేస్కునెదెట్లనొ అర్థమైతలేదు.
కుర్మయ్య : ఊర్లనేమో గిట్లుంది.. పిల్లలతోటి పట్నంబోదమంటె ఇల్లిడ్సి పోబుద్దిగాదు.. పండ్గ దినాలల్ల కొడ్కులు, కోడండ్లు, మన్మండ్లు లేకపోతె తినబుద్దిగూడ గాదు. పిల్లల్లేకుండ సంకురాత్రి పండ్గ జేస్కునుడెట్లనో అర్థమైతలేదు.
...గాళ్లకు బత్కుదెర్వు లేనందుకే కూలిపనికోస్రం పట్నం బొయిండ్రు.. ఏంజేతం మన బత్కులిట్ల కాలవడ్నయి.. ముందర ఇంగేమి బాధలు ఎదుర్కొనాల్లో అర్థమైతలేదు.. అన్కుంట వెంకటమ్మ, కుర్మయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల్లేకపోయిరి!
Published Tue, Jan 14 2014 2:59 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement