
నేటి నుంచి రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్
నాగ్‌పూర్‌లో విదర్భతో ముంబై ‘ఢీ’
అహ్మదాబాద్‌లో కేరళతో గుజరాత్ పోరు
ఉ. గం. 9:30 నుంచి జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ కీలక ఘట్టానికి చేరింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ గుజరాత్‌తో కేరళ జట్టు... విదర్భతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు తలపడుతున్నాయి. గత ఏడాది టైటిల్ కోసం తుదిపోరులో పోటీపడిన విదర్భ, ముంబై ఈసారి సెమీఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తుంటే... ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న విదర్భ ముంబైకి చెక్ పెట్టాలని భావిస్తోంది.
అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి టీమిండియా ఆటగాళ్లు ఉన్న ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా... విదర్భ జట్టు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌పై ఎక్కువ ఆధార పడుతోంది. ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ సెమీఫైనల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ‘నాన్ ట్రావెలింగ్ రిజర్వ్’గా ఎంపికైన యశస్వి జైస్వాల్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగుతాడనుకుంటే... గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జైస్వాల్ ప్రస్తుతం బీసీసీఐ పర్యవేక్షణలో బెంగళూరులో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడు.
జైస్వాల్ అందుబాటులో లేకపోయినా... ముంబై జట్టు బ్యాటింగ్ విభాగానికి వచి్చన ఇబ్బందేమీ లేదు. ఆయుశ్ మాత్రే, ఆకాశ్ ఆనంద్, సిద్ధేశ్ లాడ్, రహానే, సూర్యకుమార్, దూబే, షమ్స్ ములానీ, శార్దుల్, తనుశ్ రూపంలో ముంబై జట్టుకు తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. తాజా సీజన్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లే ముంబై జట్టును ఆదుకున్నారు.
హరియాణాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ ఎనిమిదో వికెట్‌కు 183 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. ఈ సీజన్‌లో వీరిద్దరితో పాటు శార్దుల్ బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ నేపథ్యంలో టాపార్డర్ కూడా రాణిస్తే ముంబైకి తిరుగుండదు.
జోరు మీదున్న కరుణ్ నాయర్..
ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మైదానంలో అడుగు పెడితే సెంచరీ చేయడమే తన కర్తవ్యం అన్నట్లు విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ దూసుకెళ్తున్నాడు. విజయ్ హజారే టోర్నీలో వరుస సెంచరీలతో హోరెత్తించిన ఈ సీనియర్ బ్యాటర్ రంజీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై కూడా భారీ శతకం నమోదు చేశాడు. నాయర్ మినహా విదర్భ జట్టులో స్టార్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతో ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది.
అథర్వ తైడె, ధ్రువ్ షోరే, ఆదిత్య ఠాక్రె, యశ్ రాథోడ్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ సీజన్‌లో 728 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. కరుణ్ నాయర్ (591), అక్షయ్ వాడ్కర్ (588) కూడా భారీగా పరుగులు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నారు.
బౌలింగ్‌లో హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, ఆదిత్య ఠాక్రె, నచికేత్ భట్ కీలకం కానున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే తాజా సీజన్‌లో 59 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై టాపార్డర్ నిలకడలేమిని సొమ్ము చేసుకుంటూ డిఫెండింగ్ చాంపియన్‌పై పైచేయి సాధించాలని విదర్భ యోచిస్తోంది.
కేరళ నిరీక్షణ ముగిసేనా!
అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న మరో సెమీఫైనల్లో గుజరాత్‌తో కేరళ తలపడనుంది. జమ్మూ కశీ్మర్‌తో క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా కేరళ జట్టు ముందంజ వేయగా... సౌరాష్ట్రతో ఏకపక్షంగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో గెలిచి గుజరాత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 2016–17లో చాంపియన్‌గా నిలిచిన గుజరాత్ జట్టు ఆ తర్వాత 2019–20 సీజన్‌లో మాత్రమే సెమీస్‌కు చేరింది.
మరోవైపు కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. గుజరాత్ జట్టు తరఫున కెపె్టన్ చింతన్ గాజా, ప్రియాంక్ పంచాల్, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, మనన్ హింగ్‌రాజియా, జైమీత్ పటేల్, ఉర్విల్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మిడిలార్డర్‌లో జైమీత్, ఉర్విల్, మనన్ కీలక ఇన్నింగ్స్‌లతో గుజరాత్ జట్టు సునాయాసంగా సెమీస్‌కు చేరింది.
ఈ సీజన్‌లో 582 పరుగులు చేసిన జైమీత్ గుజరాత్ తరఫున ‘టాప్’ స్కారర్‌గా కొనసాగుతున్నాడు. మనన్ 570 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అర్జాన్ నాగ్‌వస్వల్లా, చింతన్ గాజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... క్వార్టర్స్‌లో జమ్మూకశ్మీర్‌పై చూపిన తెగింపే సెమీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది.
బ్యాటింగ్‌లో సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్ కీలకం కానున్నారు. క్వార్టర్స్‌లో నిజార్, అజహరుద్దీన్ పోరాటం వల్లే కేరళ జట్టు సెమీస్‌కు చేరగలిగింది. ని«దీశ్, బాసిల్ థంపి, జలజ్, ఆదిత్య, అక్షయ్ బౌలింగ్ భారం మోయనున్నారు.
48 తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఇప్పటి వరకు 48 సార్లు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇందులో 42 సార్లు విజేతగా నిలువగా... 6 సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment