చెల్లెలు తన అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది అక్క ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అత్తాపూర్: చెల్లెలు తన అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది అక్క ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జ రిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ప్రేమావతిపేటకు చెందిన అనిత (32) నర్సింగ్‌రావు భార్యాభర్తలు. కాగా అనిత చెల్లెలు జయంతి కొద్ది రోజులగా నర్సింగ్‌రావు అక్క కుమారుడు క్రాంతిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన అనిత చెల్లెల్ని మందలించింది.
అయినా వినకుండా ఈనెల 2న జయంతి.. క్రాంతిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేని అనిత తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ప్రేమావతిపేటలోని శ్మశాన వాటికలో వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనిత సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.