సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరడానికి నీట్ రాసిన అభ్యర్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచే ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)కు ఆయా వైద్య కళాశాలల్లో సీట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) రద్దు అనంతరం ఏర్పడ్డ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ దేశవ్యాప్తంగా ఈడబ్లు్యఎస్ విద్యార్థులకు ప్రత్యేక కోటా కింద సీట్లు కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 25 శాతం వరకు సీట్లు పెరగనున్నాయి. వాస్తవానికి.. ఆర్థికంగా బలహీనవర్గాలకు 10 శాతం కోటా మాత్రమే ఉంది. కానీ నియర్ రౌండప్ పేరుతో 100 సీట్లున్న కళాశాలకు అదనంగా మరో 25 నుంచి 50 సీట్ల వరకు పెంచనున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రస్తుతం 1,750 సీట్లు ఉండగా అదనంగా 550 సీట్లు పెరుగుతాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా పెంచిన సీట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. పెంచిన సీట్లకు ఏడాది లోపు వసతులు కల్పించే విధంగా కళాశాలలకు అవకాశం ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం (2019–20) నుంచే పెంచిన సీట్లు అమల్లోకి వచ్చేలా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులకు పెద్ద ఊరట
మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,750 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 52 వేల మందికి పైగా నీట్ రాస్తే అందులో 39 వేల మందికి పైగా అర్హత సాధించారు. ఒక్కో సీటుకు 22 మందికి పైగా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో 550 సీట్లు రాష్ట్రంలో పెరుగుతుండటంతో నీట్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో ఒక్కో కళాశాలకు 50 సీట్లు పెరగడమంటే చాలా కష్టం. అలాంటిది 10 శాతం ఈడబ్లు్యఎస్ కోటా రావడం, దానికి తోడు మరిన్ని సీట్లు పెరుగుతుండటంతో విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన సీట్లు రెండో విడత కౌన్సెలింగ్ నాటికి అందుబాటులోకి రావచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి వారంలో తొలి విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది. జూలై 30 నాటికి చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆర్థికంగా బలహీనవర్గాల కోసం కేటాయించే సీట్లలో ఒకవేళ జాప్యం జరిగితే ఆగస్టులో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడానికి సడలింపు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెప్పారు.
ప్రతిపాదనలు పంపాం..
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించిన సీట్ల పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు పంపినట్లు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ కె.బాబ్జీ చెప్పారు. ఈ ఏడాది నుంచే సీట్ల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, సీట్లు పెరిగిన వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సమాచారమిస్తామన్నారు. పెరిగిన సీట్లను బట్టి యూనివర్సిటీ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు.
తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో పెరగనున్న సీట్ల వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment