సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసిన యువతను టార్గెట్ చేసుకుని..ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ దేశ వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసిన హైదరాబాదీ ఆనంద్‌ను భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందా కోసం ఇతగాడు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ నిర్వహించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారిలో నగరానికి చెందిన వారూ ఉన్నట్లు తేలింది. దీంతో దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక బృందం మంగళవారం వచ్చివెళ్లింది. బెంగళూరుకు చెందిన అర్వింద్ కుమార్ అలియాస్ ఆనంద్ కుటుంబం నగరంలో స్థిరపడింది. ఓయూ నుంచి ఎంటెక్ గోల్డ్ మెడల్ పొందాడు.
ఇండోర్ వెళ్లి కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. అదే సమయంలో నీట్ పరీక్ష రాసిన అనేక మంది సీట్ల కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తారని గుర్తించాడు. అలాంటి వారిని మోసం చేయడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ భోపాల్, ఇండోర్, పుణే, బెంగళూరుల్లో కార్యాలయాలు తెరిచాడు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల జాబితాలను సమీకరించే వాడు. తన కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్న కాల్సెంటర్ల నుంచి ఫోన్లు చేయించి ఎస్ఎమ్మెస్లు పంపి ఆకర్షించేవాడు. రెండేళ్ల క్రితం ఓ నకిలీ వెబ్సైట్ రూపొందించాడు. దీనిలోకి ఎంటర్ అయిన వారి వివరాల ద్వారా అభ్యర్థుల ఫోన్లు చేయించి ప్రైవేట్ వైద్య కళాశాల్లో సీట్లంటూ చెప్పించే వాడు. స్టార్ హోటళ్లలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నమ్మకం కలిగించే వాడు.
ఆపై విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్వాన్సుల పేరుతో రూ.లక్ష వరకు వసూలు చేసి మోసం చేసేవాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి మరో మహిళ సహకారం అందించింది. ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఆనంద్ను గత బుధవారం పుణేలో పట్టుకుంది. ఇతడి చేతిలో హైదరాబాద్ చెందిన వాళ్లూ మోసపోయినట్లు గుర్తించింది. ఆయా విద్యార్థుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు తదుపరి దర్యాప్తు కోసం భోపాల్ క్రైమ్ బ్రాంచ్కు చెందిన స్పెషల్ టీమ్ మంగళవారం వచ్చి వెళ్లింది. వందల మందిని మోసం చేసిన ఈ స్కామ్ రూ.కోట్లలో ఉంటుందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment