ప్రిలిమినరీకి పగడ్బందీ ఏర్పాట్లు
ప్రిలిమినరీకి పగడ్బందీ ఏర్పాట్లు
Published Sat, Jul 30 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
నగరంలో 28 పరీక్షా కేంద్రాలు
ఇక నుంచి విజయవాడలోనే మెయిన్స్ పరీక్ష
సమీక్షించిన కలెక్టర్
విజయవాడ :
యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షకు విజయవాడలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఏ చెప్పారు. శనివారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 7న జరిగే యూపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలకు నియమితులైన సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏవిధమైన పొరపాట్లకు తావివ్వరాదని చెప్పారు. ఏవిధమైన సందేహాలున్నా, వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరీక్షను పర్యవేక్షించటానికి ఐదుగురు ఐఏఎస్‌లతో తనిఖీ ఆఫీసర్స్‌ను నియమించినట్లు చెప్పారు. విజయవాడలో 28 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 1400 మంది ఇన్విజలేటర్స్‌తోపాటు, 94 మంది అధికారులతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా సెంటర్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఫ్యాన్‌లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్వాహకులను ఆదేశించామన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి విజయవాడలో మెయిన్ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ సబ్‌సెంటర్ల సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు అభ్యర్థులతో ఫ్రెండ్లీ నేచర్‌తో మెలగాలన్నారు. చూపులేని అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా పటమట కృష్ణవేణి ఇంగ్లీషు మీడియం స్కూలులో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వీరికి సహాయకులుగా ఉండే సబ్‌స్రై్కబర్స్‌తో జెసీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో యూపీఎస్‌సీ రాష్ట్ర కన్వినర్ నరేష్ శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజీ, డీఆర్‌వో సీహెచ్ రంగయ్య, డీఈవో సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement