23 కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
Published Sat, Jul 30 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 23 కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ఈ మేరకు శనివారం హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ కళాశాలల ప్రతినిధులు, పోస్టల్, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ వరంగల్ కేంద్రంగా మొదటిసారి ఆగస్టు 7న జరుగనున్న యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాకు పరీక్షల నిర్వహణ అవకాశం రావడం అందరం గౌరవంగా భావించాలన్నారు. పరీక్షలకు 11 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పోస్టల్, పోలీస్, విద్యుత్, కళాశాలల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు, వివిధ శాఖల సమన్వయం కోసం ఒక అధికారిని కన్వీనర్‌గా నియమించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల వివరాలు ఎక్కువ చోట్ల ఏర్పాటు చేసి వారి హాల్æటికెట్ నంబర్లు, గదుల వివరాలను త్వరగా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఢిల్లీ నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారులు రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమీక్షలో డీఆర్వో శోభ, వివిధ శాఖల అధికారులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement