కనిషక్ కటారియా, సృష్టి దేశ్‌ముఖ్
న్యూఢిల్లీ: ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, జైపూర్‌కు చెందిన కనిషక్ కటారియా సివిల్స్–2018 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జైపూర్‌కే చెందిన అక్షత్ జైన్ రెండో ర్యాంకు సాధించారు. భోపాల్‌కు చెందిన సృష్టి జయంత్ దేశ్‌ముఖ్ మహిళల్లో తొలి స్థానం, మొత్తంమీద ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డికి 7వ ర్యాంకు దక్కింది.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు మొత్తం 759 మంది అర్హత సాధించారని, అందులో 182 మంది మహిళలు, 36 మంది దివ్యాంగులు ఉన్నారు. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగిరీలో 361 మందికి, ఓబీసీ వర్గంలో 209 మందికి, ఎస్సీల్లో 128 మందికి, ఎస్టీల్లో 61 మందికి ర్యాంకులు వచ్చాయి. గత జూన్‌లో ప్రాథమిక పరీక్షకు 5 లక్షల మంది హాజరవగా, 10,468 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. 1994 మంది మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కాగా, వారికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖాముఖి నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లదే హవా..
ఎస్సీ వర్గానికి చెందిన టాపర్ కటారియా తన ఆప్షనల్‌గా మేథమేటిక్స్ ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారు. ఐదో ర్యాంకర్ దేశ్‌ముఖ్ భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ చేశారు. తనపై ఉన్న నమ్మకంతోనే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని దేశ్‌ముఖ్ చెప్పారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి ప్రిస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
రెండో ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ ఐఐటీ గువాహటిలో ఇంజనీరింగ్ చదివారు. అక్షత్ తండ్రి ఐపీఎస్ అధికారి కాగా, తల్లి ఐఆర్‌ఎస్ అధికారిగా సేవలందిస్తున్నారు. సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోనే ఐఏఎస్‌గా సేవలందించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టాప్–25లో నిలిచిన అభ్యర్థులంతా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్ పిలానీ, ఎన్‌ఎల్‌యూ, డీయూ, ముంబై యూనివర్సిటీ, అన్నా వర్సిటీ లాంటి విద్యా సంస్థల్లో అభ్యసించారు.
Comments
Please login to add a commentAdd a comment