
న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసిన అనంతరం, పరీక్షకు హాజరు కాలేని విద్యార్థులు తమ దరఖాస్తును ముందు గానే ఉపసంహరించుకునే వెసులుబాటును మొదటిసారిగా యూపీఎస్సీ కల్పించనుంది. వచ్చే ఏడాది జరిగే ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని ప్రారంభించి మెల్లగా అన్ని పరీక్షల్లోనూ అమలు చేస్తామని యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా సోమవారం వెల్లడించారు. యూపీఎస్సీ 92వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సివిల్స్ ప్రాథమిక పరీక్షలకు ప్రతి ఏటా పది లక్షల మంది దరఖాస్తు చేస్తే ఐదు లక్షల మందే పరీక్షకు హాజరవుతున్నారు. కానీ యూపీఎస్సీకి మాత్రం గైర్హాజరవుతున్న ఐదు లక్షల మందికి కూడా ప్రశ్నపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇన్విజిలేటర్లను నియమించడం ద్వారా చాలా డబ్బు వృథా అవుతోంది. అందుకే దరఖాస్తు చేసినప్పటికీ పరీక్ష రాయలేని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు తమ దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం కల్పించనున్నాం’ అని చెప్పారు.