హైదరాబాద్ :దేవాలయాల్లో దొంగతనం చేయడమంటే ఆ దొంగకు చాలా సరదా. హైదరాబాద్ నగరంలోని పలు దేవాలయాల్లో అతను దొంగతనం చేశాడు. అయితే సోమవారం జూబ్లిహిల్స్ పోలీసులు ఈ ఘరానా దొంగ రాంబాబు ఆట కట్టించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పొలీసులు అతని వద్ద నుంచి 12 కేజీల వెండి, 3 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రాంబాబు 22 కేసుల్లో ప్రధాన నిందితుడు. జైలుకు వెళ్లకముందు 35 దొంగతనాలు చేశాడు. ఈ దొంగతనాలు అన్ని దేవాలయాల్లోనూ చేసినవి కావడం విశేషం. రాంబాబు దేవాలయంలోకి ప్రవేశించి పూజారికి రూ. 500 నోటు దక్షిణగా ఇచ్చేవాడు. అతను చిల్లర తెచ్చేందుకు పక్కకు వెళ్లగానే మూల విగ్రహానికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను తస్కరించి పారిపోయేవాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.