కోవూరు: వివిధ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న కట్టా రాము అనే వ్యక్తిని కోవూరు ఎస్సై చింతం కృష్ణారెడ్డి శుక్రవారం అరెస్ట్ చేశారని సీఐ జీఎల్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 సంవత్సరం జూలై 23వ తేదీన కోవూరు పట్టణంలో నాలుగు గృహాల్లోకి చొరబడి బంగారు వస్తువులు, నగదు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నిందితుడు మండలంలోని స్టౌ బీడీ కాలనీచెందిన కట్టా రాము అని నిర్ధారించారు. అతనిపై నిఘా ఉంచారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా రాము తెలంగాణలోని కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఫినాయిల్ విక్రయిస్తూ చెడు వ్యసనాలకు బానిసైయ్యాడు. ఈ నేపథ్యంలో అతను చోరీలకు పాల్పడుతూ జల్సాగా జీవించసాగాడు.
ఓ కేసులో జగిత్యాలలోని కోరట్ల పోలీసులు రామును అరెస్ట్ చేశారు. అక్కడినుంచి విడుదలై కోవూరు ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి నుంచి రూ.2.70 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. రామును పట్టుకునేందుకు కృషిచేసిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, జబీవుల్లా, వెంకటేశ్వర్లు, ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్‌కే అయాజ్‌లను సీఐ అభినందించారు. వారికి ఎస్పీ ద్వారా రివార్డులు అందజేయనున్నట్లుగా వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేశామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment