సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ఓడే గ్రామం అది... ఆ ఊరి చివర సువిశాలమైన బంగ్లా... దాని పోర్టుకోలో నాలుగు హైఎండ్ కార్లు... ఇంటి లోపల 30 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు... విల్లా చుట్టూ నైట్ విజన్, మోషన్ సెన్సర్, 360 డిగ్రీస్ రివాల్వేటింగ్ పరిజ్ఞానాలతో కూడిన నిఘా కెమెరాలు... ఈ సెటప్ మొత్తం చూస్తే ఆ ఇల్లు ఏ పారిశ్రామిక వేత్తదో, బడా వ్యాపారితో, పెద్ద రాజవంశీయుడిదో అనుకుంటారు. అయితే అది దేశ వ్యాప్తంగా 100కు పైగా భారీ నేరాలు చేసిన ఘరానా దొంగ నవ్‌ఘన్ తల్పడకు చెందినది. ఇతగాడిని రెండు రోజుల క్రితం ఆనంద్ జిల్లాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పట్టుకుంది. ప్రాథమిక విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు.
⇔ తొమ్మిదో తరగతి వరకే చదివిన నవ్‌ఘన్ తల్పడకు తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు ఓడే గ్రామంలో ఓ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అవసరమైన డబ్బు కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు.
⇔ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఇప్పటి వరకు 100కు పైగా నేరాలు చేసిన నవ్‌ఘన్‌ను అతడి భార్య శోభ సైతం సహకరిస్తుంటుంది. ఆమె తమ విలాసవంతమైన బంగ్లాకు మామగారి పేరే పెట్టుకుంది. నవ్‌ఘన్ తన భార్యతో పాటు కొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకునీ నేరాలు చేస్తుంటాడు. ప్రధానంగా విల్లాలు, బంగ్లాలనే ఎంచుకుని చోరీ చేస్తాడు.
⇔ ఒకప్పుడు భార్యతో కలిసి రంగంలోకి దిగి ఇతడు తొలుత ఆయా విల్లాల్లోని మహిళల్ని ఆకట్టుకునేవాడు. వారి ద్వారా పని వాళ్ళుగా, సహాయకులుగా చేరి... అదును చూసుకుని ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బు తీసుకుని ఉడాయించేవారు. ఆపై తాళం వేసున్న విల్లాలు, బంగ్లాలను ఎంపిక చేసుకుని అనుచరులతో కలిసి దోచేయడం మొదలెట్టాడు.
⇔ చోరీ సొత్తును తమ గ్రామంలో ఉన్న బంగారం వ్యాపారి మహేష్‌కు మాత్రమే విక్రయిస్తుంటాడు. అయితే మహేష్ ప్రతి సందర్భంలోనూ నగల నాణ్యత బాగోలేదనో, తరుగు పేరుతోనే చౌకగా వాటిని కొనేవాడు.
⇔ దీంతో నవ్‌ఘన్ తన విల్లాలోనే బంగారం కరిగించడానికి కార్ఖానా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే నగల్ని బిస్కెట్లుగా మార్చి విక్రయించడం మొదలెట్టాడు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన నవ్‌ఘన్ ఇప్పటి వరకు అక్కడ ఒక్క నేరం కూడా చేయలేదు. ఆ చుట్టుపక్కల జిల్లాలతో పాటు జైపూర్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, బరోడా నేరాలు చేశాడు.
⇔ ఓ నగరాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అనుచరులతో కలిసి విమానంలో అక్కడకు చేరుకుంటాడు. ఖరీదైన హోటల్‌లో బస చేసి ఖరీదైన ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసున్న ఇంటిని గుర్తించిన పట్టపగలే చోరీ చేస్తాడు. ఈ సొత్తుతో ఒకటి రెండు రోజులు అదే హోటల్‌లో ఉండి... ఆపై రోడ్డు మార్గంలో స్వస్థలానికి వెళ్ళిపోతాడు.
⇔ నవ్‌ఘన్ ఇటీవల గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉన్న సీఎం స్మిత్ అండ్ సన్స్ సంస్థకు చెందిన యజమాని ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అందులోకి ప్రవేశించి రూ.45.95 లక్షలు సొత్తు చోరీ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆనంద్ ఎస్‌ఓజీ పోలీసులు రెండు రోజుల క్రితం నవ్‌ఘన్ సహా ముగ్గురిని పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో నేరాలు అంగీకరించాడు
తాజా కేసు ఖేడా జిల్లాలో జరిగింది. అయితే నవ్‌ఘన్ వ్యవహారంపై సమాచారం అందడంతో మేము పట్టుకున్నాం. తండ్రికి గుడి కట్టిన ఇతడిని ఓడే గ్రామస్తులు చాలా గౌరవంగా చూస్తారు. గతంలోనూ వివిధ నగరాల పోలీసులు నవ్‌ఘన్‌ను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను ఖేడా పోలీసులకు అప్పగించాం. వాళ్ళు వీళ్ళని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాతే హైదరాబాద్‌లో ఏ పోలీసుస్టేషన్ పరిధిలో? ఎప్పుడు? ఆ నేరాలు చేశాడు అనేది తెలుస్తుంది. దీనిపై అక్కడి పోలీసులకు అధికారిక సమాచారం అందిస్తాం. -ఆనంది జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్
Comments
Please login to add a commentAdd a comment