- 345 గ్రాముల బంగారు నగలు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి
తిరుచానూరు : తిరుచానూరు, తిరుమల పరిసరాల్లో భక్తుల నగలను చోరీ చేసిన ఓ మహిళను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 345 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తిరుచానూరు పోలీస్‌స్టేషన్లో విలేకరుల సమావేశంలో తిరుపతి ఈస్టు డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్ల టౌన్, ఎన్‌ఎన్‌పీ అగ్రహారంనకు చెందిన వేజెండ్ల వెంకటలక్ష్మి కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడుతోంది. ఈమె భర్త సాంబశివరావు గతంలో బాపట్ల మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్త ప్రోత్సాహంతో ఆమె దొంగతనాన్ని ఎంచుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ భక్తురాలి నుంచి నగలను కాజేసింది. అలాగే 2013లో తిరుమలలో ఓ మహిళా భక్తురాలి నుంచి నగలు దొంగలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించింది.
గతేడాది తిరుచానూరులో భక్తుల నగలను దొంగతనం చేయడంతో 7 కేసులు నమోదయ్యాయి. అలాగే తిరుపతి కూరగాయల మార్కెట్లో ఓ మహిళ వద్ద నుంచి సుమారు 28 గ్రాముల బంగారు నగలను చోరీ చేయడంతో తిరుపతి ఈస్టు పోలీస్‌స్టేసన్లోనూ కేసు నమోదయింది. ఇలా దొంగలించిన బంగారు నగలను అమ్మి తమ ఊర్లో ఇల్లు కొని స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. దీంతో 23వ తేదీ భార్యాభర్తలిరువురు తిరుచానూరు చేరుకున్నారు. పూడి జంక్షన్ వద్ద క్యాష్ బ్యాగుతో అనుమానాస్పద స్థితిలో ఒంటరిగా నిల్చొని ఉన్న వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. భర్త సాంబశివరావును త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.