► 181 గ్రాముల బంగారం, 687 గ్రాములు వెండి స్వాధీనం
► వివరాలు వెల్లడించిన మహదేవపూర్ డీఎస్పీ
కాటారం (మంథని): పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్న ఓ అంతరాష్ట్ర దొంగను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ముద్దబోయిన రాజేశ్ తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్నప్పటి నుంచి చోరీలకు అలవాటు పడి జీవనం కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో 2015లో మహదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడగా పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం 2016లో ఇదే జిల్లాలోని కాటారం, అడవి ముత్తారం మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో రెండు చోరీలకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. 2016 ఆగస్టులో విచారణ నిమిత్తం రాజేశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని చత్తీస్‌గఢ్‌కు పారిపోయాడు. అనంతరం కొంత కాలం పాటు చత్తీస్‌గఢ్‌లో ఉన్న రాజేశ్ భూపాలపట్నంలో దొంగతనానికి పాల్పడి ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేశాడు.
అక్కడ సైతం పోలీసులకు చిక్కాడు. దీంతో అక్కడి నుంచి తిరిగి తెలంగాణకు చేరుకున్నాడు. చోరీ చేసిన సొమ్మును భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటలోని తన బావ ఇంటి వద్ద దాచుకున్న రాజేశ్ ద్విచక్రవాహనంపై భూపాలపల్లిలో విక్రయించడానికి తీసుకెళ్తుండగా మండలంలోని చింతకాని క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సై టి.కిరణ్ గుర్తించి అరెస్ట్ చేశారు. రాజేశ్‌ను విచారించి అతని వద్ద గల 181 గ్రాము ల బంగారం, 687 గ్రామాలు వెండి ఆభరణాలను స్వాధీనపర్చుకున్నారు. రాజేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కాటారం, మహదేవపూర్ సీఐలు గడ్డం సదన్‌కుమార్, చంద్రబాను, ఎస్సైలు టి.కిరణ్, ఉదయ్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
Published Thu, Mar 9 2017 9:35 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement