స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్‌లతో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు, సిబ్బంది
ప్రొద్దుటూరు క్రైం : అతని కన్ను పడితే ట్రాక్టర్లు మాయం కావాల్సిందే.. ఎంతో చాకచక్యంగా ట్రాక్టర్లను దొంగిలించడంలో అతను సిద్ధహస్తుడు. వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లను దొంగలించిన కర్నాటి కృష్ణారెడ్డి అనే నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ట్రాక్టర్ ట్రాయిలర్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం వన్‌టౌన్ పోలీస్‌ష్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడివీధికి చెందిన కర్నాటి కృష్ణారెడ్డి వ్యవసాయం, ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులు అధికం కావడంతో మూడేళ్ల క్రితం నుంచి వ్యసనాలకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా చేసుకుంటుండగా రాజుపాళెం తహసీల్దార్ అతని ట్రాక్టర్‌ను సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ప్రొద్దుటూరు వదిలి వెళ్లాడు.
ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కృష్ణారెడ్డి ఏడాదిన్నర క్రితం ప్రొద్దుటూరులోని ఆటోనగర్‌లో ఒక ట్రాక్టర్, అద్దంకిలో మరో ట్రాక్టర్‌ను దొంగిలించాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లిపోయి కాంట్రాక్టర్ వద్ద పని చేసుకుంటూ ఉండేవాడు. అప్పడప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోయేవాడు. ఈ క్రమంలో 2017 నవంబర్ 17న పెన్నానగర్‌కు చెందిన బత్తల గంగాప్రసాద్‌కు చెందిన ఓ ట్రాక్టర్, అదే నెల 22న సుబ్బిరెడ్డి కొట్టాలలో మరో ట్రాక్టర్‌ను దొంగిలించుకొని పోయాడు. ట్రాక్టర్ యజమానుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డికి నిందితుడు జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో ఉన్నాడని సమాచారం రావడంతో ఆదివారం సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు.
దొంగిలించిన రెండు ట్రాక్టర్లను ఎవరికైనా విక్రయించాలనే ఉద్దేశంతో జమ్మలమడుగు మండలం, కన్నెతీర్థం శివాలయం వద్ద పెట్టినట్లు అతను పోలీసు అధికారులకు తెలిపాడు. దీంతో రెండు ట్రాక్టర్‌లను వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కృష్ణారెడ్డిపై ఆదిలాబాద్, ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్ స్టేషన్‌లో కేసులున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుమారు రూ.6 లక్షలు విలువైన ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐలు నారాయణయాదవ్, ఎంఏఖాన్, హెడ్‌కానిస్టేబుల్ రహంతుల్లా, కానిస్టేబుళ్లు శివనాగిరెడ్డి, ఇస్రాయిల్, మధుసూదనరెడ్డిలను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment