ఆ మంత్రిగారి గేదెల దొంగ దొరికాడు!
రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ (మంత్రి గేదెలు..మంచి పోలీసులు) గేదెల దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 2014, జనవరి 31వ తేదీన అజాం ఖాన్ కు చెందిన గేదెల కొట్టాం నుంచి లక్షల రూపాయల విలువైన ఏడు గేదేలను కొంతమంది దుండగులు దొంగింలించారు. దీనిపై అజాం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ గేదెల ఆచూకీ కనిపెట్టినా.. ఆ దొంగతనానికి పాల్పడిన నిందితులలో ఒకరైన చునాన్ ను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.
అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు పాల్పడింది ఐదుగురుగా తేలింది. వీరిలో ముగ్గురు దొంగతనానికి ప్రణాళిక రచించగా, మరో ఇద్దరు ఆ గేదెలను అక్కడ నుంచి తరలించినట్లు మోరాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ ప్రవాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
కాగా మంత్రిగారి ఫాంహౌజ్ నుంచి ఏడు గేదెలు చోరీకి గురైయ్యాయి. అనంతరం మంత్రి ఆదేశాలతో గేదెల దొంగలను కనిపెట్టే పనిలో పడ్డ పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గేదెల చోరీ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి ప్రభుత్వం ముగ్గురు పోలీసులను సస్పెండ్ కూడా చేసింది.