స్వాధీనపర్చుకున్న సొత్తుతో ఏసీపీ ఆంజనేయులు, సీఐ సురేష్, సిబ్బంది
సత్తుపల్లిటౌన్: ‘తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం’ అనేది, ఓ సామెత. ఇక్కడ సరిగ్గా ఇదే జరిగింది. ముగ్గురు దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
వీరు ఏం చేశారంటే...
అతడి పేరు బోనగిరి రాములు. సత్తుపల్లి పట్టణంలోని మసీద్ రోడ్డులో ఉంటున్నాడు. రాష్ట్రీయ రహదారి పక్కనున్న శ్రీ మహారాజ ఫ్యాన్సీ షాపులో తొమ్మిదేళ్లపాటు గుమస్తాగా పనిచేశాడు. ఏడు నెలల క్రితమే అక్కడ పని మానేశాడు. అతడికి దుర్బుద్ధి పుట్టింది. స్థానిక ద్వారకాపురి కాలనీకి చెందిన పెయింటర్ కొలికపోగు కృష్ణ, జొన్నలగడ్డ శివతో కలిసి ఆ షాపులో దొంగతనం చేయాలనుకున్నాడు.
జనవరి 23వ తేదీ అర్ధరాత్రి వేళ ఈ ముగ్గురూ కలిసి ఆటో(ఏపీ 07 టీఈ 5309)ను కిరాయికి తీసుకొచ్చి షాపు ముందు పెట్టారు. ఫ్యాన్సీ షాప్ వెంటిలేటర్‌ను పగులగొట్టారు. బక్కగా ఉన్న జొన్నలగడ్డ శివ, ఆ వెంటిలేటర్ నుంచి లోపలికి వెళ్లాడు. షాపు వెనుక తలుపులను తీశాడు. మిగతా ఇద్దరు కూడా ఇద్దరూ లోనికి వెళ్లారు. షాపులోగల మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్‌లు, రాగి, స్టీల్ సామాన్లను ఆటోలో వేసుకుని రెండు ట్రిప్పుల్లో స్థానిక వెంగళరావునగర్‌లోని అద్దె గదిలో దాచారు. పని పూర్తయిన తరువాత, ఆ ఇద్ద్దరూ బయటికొచ్చారు. జొన్నలగడ్డ శివ, లోపలే ఉన్నాడు. వెనుక తలుపులను లోపలి నుంచి వేశాడు. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాడు. మరుసటి రోజున షాపునకు వచ్చిన యజమాని, దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా దొరికారు...
పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. వారు బుధవారం వెంగళరావునగర్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఒక ప్లాస్టిక్ మూటతో ఆటోలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు పట్టుకుని ప్రశ్నించారు. జనవరి 23వ తేదీన శ్రీ మహారాజ ఫ్యాన్సీ షాపులో తాము దొంగతనం చేసినట్టు చెప్పారు. అక్కడ దొంగిలించిన లక్ష రూపాయల విలువైన వస్తువుల్లో కొన్నింటిని అశ్వారావుపేట సంతలో విక్రయించేందుకు తీసుకెళుతున్నట్టు చెప్పారు.
ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనపర్చుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, టౌన్ సీఐ టి.సురేష్ వెల్లడించారు. ఈ కేసును చేధించటంలో కృషి చేసిన సీఐ టి.సురేష్‌ను ఏసీపీ బి.ఆంజనేయులు అభినందించారు. సీఐకి సహకరించిన హెడ్ కానిస్టబుల్ ఐ.చెన్నారావు, కానిస్టేబుళ్లు బి.భరత్, ఎన్.లక్ష్మయ్యకు రివార్డును ఏసీపీ ప్రకటించారు. చోరీ నిందితులను కోర్టుకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment