అనంతపురంలోని రంగస్వామి నగర్‌లోకి చేరిన వరద నీరు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఇంకా ఆగలేదు. బుధవారం కొన్ని ప్రాంతాల్లో తెరపినిచ్చినా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అనంతపురం, అన్నమయ్య, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు, సత్యసాయి, పల్నాడు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. అనంతపురం నగరం వర్షాలతో వణుకుతోంది.
పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కసిపాడులో బుధవారం అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏర్పడితే మరింత బలపడి రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురుస్తాయని భావిస్తున్నారు.
రెండు, మూడురోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత 24 గంటల్లో పుంగనూరులో 6.9 సెంటీమీటర్లు, రాప్తాడు, కూడేరుల్లో 6.4, కె.కోటపాడులో 6.3, అనంతపురంలో 6.2, తంబళ్లపల్లెలో 5.7, కుట్టగుళ్లలో 5.4, నగరంలో 5.3, రాజాంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అనంతపురాన్ని చుట్టుముట్టిన వరద అనంతపురం జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రాత్రి వరకు వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలావరకు చెరువులు నిండిపోయాయి. అనంతపురం నగరాన్ని వరద చుట్టుముట్టింది. వందలాది ఇళ్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో లోతట్టు ప్రాంతాల జనం విలవిల్లాడుతున్నారు. నగరంలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి బాధితులను వాటిలోకి తరలిస్తున్నారు.
అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ నాగలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు అనంతపురంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద బాధితులకు రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు భోజనం, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది రబ్బర్ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 1,57,051 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం రెండు గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పాదన అనంతరం 66,120 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు çహెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6,333 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 600 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 884.80 అడుగుల మట్టంఓ 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment