
భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
విజయవాడ : రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా వరద ఉధృతికి గల్లంతు అయిన వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగినట్లు చంద్రబాబు తెలిపారు. అందరూ వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారి మళ్లించింది.
కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. గంటకు 45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరించింది.