సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (అర్బన్): కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, నాలుగు రోజుల నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి.
రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది.
నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ఆదివారం నాటికి కుంభవృష్టిగా మారింది. నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్‌లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో బారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రధానంగా కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
కావలి మండలం రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందల గ్రామం వద్ద చప్టాపై నీరు పొంగి ప్రవహిస్తోంది. కావలి పట్టణం బాలకృష్ణారెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. బ్రాహ్మణక్రాక– కృష్ణాపాడు రోడ్డుపై వర్షపు నీరు చేరింది. కొండాపురం మార్గంలో మిడతలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుడ్లూరు–బసిరెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉప్పుటేరు బ్రిడ్జిపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో శనివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
గుడ్లూరు–తెట్టు ప్రధాన రహదారిలో చెమిడిదిపాడు వద్ద ఉన్న రాళ్లవాగు కూడా ఉధృతంగా పారుతుండడంతో మధ్యాహ్నం వరకు కావలి–కందుకూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉలవపాడు మండలంలో బద్దిపూడి–మాచవరం మధ్య ఉన్న ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మన్నేటికోట–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు ఉధృతంగా పారుతోంది. దీంతో చుట్టుగుంటకు రాకపోకలు నిలిచిపోయాయి.
16న మరో అల్పపీడనం!
Published Mon, Nov 14 2022 4:04 AM | Last Updated on Mon, Nov 14 2022 4:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment